సెన్సేషన్‌ కోసం సెన్స్‌ కోల్పోతున్న యూట్యూబ్‌ ఛానెల్స్‌

SriRamaNavami

ఈరోజుల్లో ప్రతివాళ్లూ యూట్యూబ్‌ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సొంత ఛానెల్‌ పెట్టుకునే హక్కు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ వచ్చింది. ఖర్చు భరించగల కొన్ని సంస్థలు – ఒక్క ఛానెల్‌ కాదు… అనేక యూట్యూబ్‌ ఛానెల్స్‌ నడుపుతూ వీడియోలతో యూట్యూబ్‌ని నింపి పారేస్తున్నాయి. వీడియోల్ని మానిటైజ్‌ చేసి లాభం పొందడానికి అవకాశం ఉండడమే ఈ ఉత్సాహానికి కారణం అని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఏదో వ్యక్తిగతమైన వీడియోలు కొన్ని పోస్ట్‌ చేసుకుని బంధువులకీ స్నేహితులకీ చూపించుకోవడం వేరు. కానీ కమర్షియల్‌ దృక్పథంతో – పబ్లిక్‌ ని ఆకర్షించడం కోసం అదే పనిగా వీడియోలు పోస్ట్‌ చేయడం వేరు. ఎప్పుడైతే పబ్లిక్‌ ని టార్గెట్‌ చేశామో… మనం కూడా “మీడియా” గా లెక్కకు వస్తాం… మనకీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి – అని ఈ సంస్థలు గుర్తించడం లేదు. అందుకే ఇప్పుడు యూట్యూబ్‌ లో ఎక్కడ చూసినా చీప్‌ కామెంట్లూ చీప్‌ టైటిల్స్‌ తో కూడిన థంబ్‌నెయిల్సే కనిపిస్తున్నాయి.

వీడియో థంబ్‌నెయిల్లో కనిపించే మేటర్‌ వీడియోలో ఉండాలని లేదు. ఉన్నా అదే అర్థంలో ఉంటుందని అసలు గ్యారంటీ లేదు. అలా తయారయింది యూట్యూబ్‌. ఈ మధ్య యూట్యూబ్‌ తోనే పేరు తెచ్చుకున్న ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ ఛానెల్‌ ప్రసిద్ధ హీరోయిన్‌ జయసుధ ఇంటర్వ్యూ పోస్ట్‌ చేసింది. అందులో ఓ క్లిప్‌ కి జయసుధ స్టేట్‌ మెంట్‌ని థంబ్‌ నెయిల్‌ గా పెట్టారు. ఆ మేటరేంటో తెలుసా? ” నా పెళ్లి వల్ల రాఘవేంద్రరావుగారు ఇబ్బంది పడ్డారు ” – అట! నిజానికి ఆ క్లిప్‌ లో జయసుధ మాట్లాడిందాంట్లో తప్పేమీ లేదు. అయితే – జయసుధ పెళ్లి చేసుకుంటే రాఘవేంద్రరావుకి ఇబ్బంది ఏమిటి? – అని సగటు వ్యూయర్‌ తప్పుగా ఆలోచించేలా ఉంది ఈ టైటిల్‌. యూట్యూబ్‌ ఛానెల్స్‌ వక్రియేటివిటీకి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే! నిరూపించలేకపోవచ్చు గానీ..  కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ వాళ్లు – వీడియో థంబ్‌ నెయిల్స్‌ మీద ఇలాంటి  టైటిల్స్‌ – అసభ్యమైన ధ్వని కలిగేలా – కావాలనే – పెడుతున్నారని కచ్చితంగా చెప్పవచ్చు. కానీ వీటిని ఎవరు ఎదుర్కుంటారు? యూట్యూబా? వాళ్లది బిజినెస్. వాళ్లు మాట్లాడరు. ఇలాంటి చీప్‌ టైటిల్స్‌ని ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులా? వాళ్లూ మాట్లాడరు. ఇక సెలబ్రిటీలా? వాళ్లు అసలే మాట్లాడరు. మాట్లాడి రచ్చ చేసుకోవడం కన్నా మౌనంగా భరించడమే బెటరన్నది వాళ్ల సిద్ధాంతం. కాబట్టి – ఇలాంటి సెన్సేషనల్‌ న్యూసెన్స్‌ ని చూసీ చూసీ జనం అసహ్యించుకుని వీడియోలకి ఆదరణ తగ్గే వరకూ ఇది కొనసాగుతూనే ఉంటుంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.