జనాన్ని బకరాలు చేస్తున్న ‘రీడర్స్‌ డైజెస్ట్‌’


బిజినెస్‌ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ దానికి రూల్స్‌ ఉంటాయి. అలాగే ఎథిక్స్ కూడా ఉంటాయి. కానీ మన దేశంలో – బిజినెస్‌ రూల్స్‌ తప్పినప్పుడు – కాస్తో కూస్తో చైతన్యం చూపిస్తాం తప్ప- నైతిక విలువలు ఎంత తప్పినా అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ దశాబ్దాలుగా సాగిస్తున్న అన్‌-ఎథికల్ బిజినెస్‌ ఇప్పటికీ వీర విహారం చేస్తూ లక్షలాది అమాయక పాఠకుల్ని ఇబ్బంది పెడుతున్నా – అడిగేవారు లేరు.

‘రీడర్స్‌ డైజెస్ట్‌’ ‘స్వీప్‌ స్టేక్స్‌ ( Sweepstakes)’అనే పేరుతో నిత్యం ఒక కాంపైన్‌ నడుపుతూ ఉంటుంది. దానికి సంబంధించిన మెయిల్స్‌ జనానికి పంపిస్తూ ఉంటుంది. అలాగే వాటి బ్రోచర్స్‌ తాలూకు హార్డ్‌ కాపీలు ప్రింట్‌ చేసి పోస్టులో కూడా పంపుతూ ఉంటుంది. ‘రీడర్స్ డైజెస్ట్‌’ సబ్‌ స్క్రైబర్స్‌కీ, కానివారికీ కూడా ఈ మెయిల్స్‌ వెళ్తూ ఉంటాయి. పంపిన ప్రతి మెయిల్‌లో ఒక ఫార్మ్‌ ఇస్తారు. జస్ట్‌ .. దీన్ని నింపి తిరిగి మాకు పంపండి చాలు. మీకు లక్షలు వచ్చేస్తాయి” అని చెబుతారు. కానీ ఇలా పంపేటప్పుడు మెలిక ఏంటో తెలుసా? రీడర్స్‌ డైజెస్ట్‌ కి యాన్యువల్‌ సబ్‌ స్క్రిప్షన్‌ కట్టాలి. అప్పుడే మనం పంపిన కవర్‌ కి విలువ ఉంటుందని అంటారు. రిటర్న్‌ కవర్‌ కూడా వారే ఇస్తారు. “పోస్ట్‌ ఖర్చులేని పని కదా, పోనీలే కడదాం!” అని దాదాపు అందరూ పంపుతారు. కానీ లాభం శూన్యం. ప్రతి నెలా ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ మేగజైన్‌ మాత్రం మనకి వస్తుంటుంది. పోనీ సబ్‌ స్క్రిప్షన్‌ కట్టేశారు కదా, అని వాళ్లు ఆగరు. అక్కడినుంచి ఆ మేగజైన్‌ తో పాటు ప్రతినెలా అదనంగా వచ్చే బ్రోచర్లూ కవర్లూ పెరిగిపోతాయి. మళ్లీ మరో కవర్‌.. మళ్లీ మరో కవర్‌.. అలా అలా వస్తూనే ఉంటాయి. అలా ఆశలు పెంచుతూనే ఉంటారు. వీళ్లు అక్కడ రాసిన రాతలతో ఎంత హడావిడి చేస్తారంటే… నిజంగా మనకి లక్షల రూపాయలు వచ్చేశాయనే మనం అనుకుంటాం. అంతా గెలిచేశావ్‌.. జస్ట్‌ ఈ ఒక్క స్టెప్పూ పూర్తి చేస్తే – ఇన్ని లక్షల రూపాయలు నీ సొంతం! అంటారు.

పైగా- దీంతో బాటు మీకు కారు కూడా వస్తుంది అని చెబుతూ – “ఈ కారు కావాలా? ఈ కారు కావాలా?” అని కొన్నిమోడల్స్‌ బొమ్మలు ఇచ్చి సెలక్ట్‌ చేసుకోమంటారు. నిజంగా అది చూసేవాళ్లకి – “అరె! లక్కీగా మనం ఫైనల్‌కి వ చ్చేశాం. మనకి డబ్బులో కారో రావడం ఖాయం! ” అనే అనిపిస్తుంది. ఆ స్థాయిలో ఆశలు పెడుతూ రాతలు రాస్తారు. కానీ నిజం ఏమిటంటే – దశాబ్దాల తరబడి వీటిని నమ్మి పంపినా – ఎప్పుడూ ఒక్క ప్రైజ్‌ కూడా రానివాళ్లు లక్షల్లో ఉన్నారు. ఎవడికో ఎప్పుడో నూటికో కోటికో కొన్ని ప్రైజులు నిజంగానే ఇచ్చాం – అని నమ్మకం చూపుతూ కొన్ని రుజువులూ ఫొటోలూ కూడా ఇస్తారు. అవి నిజమే కావచ్చు. కానీ – బ్రోచర్స్‌ లో మాత్రం – మీరే విజేత అంటూ అందరికీ రాస్తారు.

లాటరీ మోసం ఎలా అవుతుంది అనేవాళ్లకి…

ఏదైనా ఇది లాటరీ లాంటిది కదా? లాటరీ అన్నది అదృష్టం ఉంటే గెలుస్తాం. టికెట్‌ కొన్న ప్రతివాడికీ లాటరీ వస్తుందా? అలాగే లక్షమందిలో ఒకడికి వస్తుంది. టిక్కెట్‌ కొని లాటరీ రాకపోతే ఎలా తప్పు పట్టగలం? “టిక్కెట్‌ కొన్నాను, లాటరీ రాలేదేంటి? అని కేసు వేయలేం కదా? ” – అని ఎవరైనా వాదించవచ్చు. కానీ జనరల్‌ లాటరీ టికెట్ కీ, ఈ రీడర్స్‌ డైజెస్ట్‌ స్వీప్‌ స్టేక్స్‌ కీ తేడా ఏంటంటే – అక్కడ అదృష్టం ఏ ఒక శాతమో ఇంకా తక్కువో ఉందని మనకి స్పష్టంగా తెలుసు. అందుకే టికెట్‌ కొంటే కొంటాం. లేదంటే మానేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. మనకే ప్రైజ్‌ మొత్తం వచ్చేసిందని నమ్మిస్తారు. కవర్లు పంపమంటారు. ఆన్సర్లు రాయమంటారు. ఫార్మ్స్‌ పూర్తి చేయమంటారు. క్విజ్‌ లు పూర్తి చేయమంటారు. పోస్టాఫీస్‌ కి వెళ్లి కరెక్ట్‌ టైమ్‌ లో అవి చేరేలా పోస్ట్‌ చేయమంటారు. దీని కోసం మనం వెచ్చించే టైమ్‌ కొన్ని వందల గంటలుంటుంది. వాడి వ్యాపారం కోసం- లక్షలాదిమంది పౌరుల విలువైన సమయాన్ని వృథా చేసే హక్కు ‘రీడర్స్‌ డైజెస్ట్‌’కి ఎవడిచ్చాడు? – అని అడిగే నాథుడే దేశంలో లేడు. వీళ్ల మీద ఏ లాయరూ కేసు వేయడు. ఎన్ని సార్లు వాళ్లు అతిగా కబుర్లు చెప్పి మోసం చేసినా – పోన్లే ఆశపడడం మనదే తప్పు అని సర్దుకుపోయే పాఠకులే తప్ప – నిలిచి పోరాడే యోధుడే లేడు.

అసలు ఇలాంటి వ్యాపారాల మీద చర్య తీసుకునే చట్టాలే మనకి లేవా? వీళ్లందరూ జనాన్ని చట్టబద్ధంగానే ఆశపెట్టి మోసం చేస్తున్నారా? వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ఆకర్షణకరమైన మాటలు చెప్పడం మామూలే! అది వ్యాపారధర్మం అనుకోవచ్చు. కానీ ఆ మాటల్లో సత్యాలెన్ని? అసత్యాలెన్ని? అని ఆలోచించినప్పుడు – కాస్త అతిశయోక్తులు ఉన్నా పరవాలేదని కొందరు అనుకోవచ్చు. అయితే ఆ వెసులుబాటుని వ్యాపారులు విచ్చలవిడిగా వాడుకోవచ్చా? సింపుల్‌ గా పచ్చి అబద్ధాలు చెప్పచ్చా? చెప్పినా ఈ దేశంలో చెల్లుబాటు కావలసిందేనా? ఎంతో మంది లాయర్లు ప్రజాప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా వ్యాజ్యాలు వేస్తుంటారు. అయితే దశాబ్దాల తరబడి ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ చేస్తున్న ఈ ‘బిజినెస్‌ కోసం ఆశపెట్టి జనం సమయం దోపిడీ చేసే దారుణ కృత్యం’ గురించి జనం తరఫున పోరాడేందుకు ఒక్క న్యాయవాది కూడా ముందుకు రాకపోవడం విచారకరం.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE