Let 75 Years of Independent India Be United!

75 ఏళ్ల స్వతంత్రభారతం శతాబ్దం పూర్తయ్యేవరకైనా సమైక్యంగా ఉంటుందా?

75వ స్వాతంత్రదినం వచ్చేసింది.

అయితే వందో స్వాత్రంత్ర దినోత్సవానికి దేశం ఇంత సమైక్యంగా ఉంటుందా? – అనే అనుమానాలు మేధావుల్లో రేకెత్తుతున్నాయి. దేశాభిమానులు ఈ విషయంలో ఎంతో కలవరపడుతున్నారు.

ఇందుకు కారణాలు? ఈ దేశాన్ని ఇంతకాలం ఏలిన రెండు జాతీయ పార్టీలు.
ఇవి పేరుకి జాతీయ పార్టీలయినప్పటికీ ఆ లక్షణాలు వీటిలో ఎంతమాత్రం లేవు. ఇవి రెండూ ఫేక్‍ నేషనల్‍ పార్టీలే. కేవలం హిందీకీ ఉత్తరాదికీ మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాదిని చిన్న చూపు చూసే పార్టీలే! అదే భవిష్యత్తులో దేశానికి ప్రమాదం కావచ్చని మేధావులు భావిస్తున్నారు.

మన దేశం ఇండియా అన్న విషయం మరిచిపోయి, దీన్ని హిందియా ( Hindia )గా మార్చేసి.. ఇతరభాషల్ని తొక్కేసి ఏలాలనుకునే హిందీ నాయకులు కొందరు మనకి ఉన్నారు. వీరి సంకుచిత దృక్పథాన్ని దక్షిణభారతదేశంలోని విజ్ఞులు ఇప్పటికే గుర్తించారు. ప్రజలు కూడా వీరి సంకుచిత ధోరణిని గుర్తించి – తమ అస్తిత్వం కోసం, తమ భాషలకి గుర్తింపు కోసం ఇప్పటికే పోరాటాలు ప్రారంభించారు. స్వతంత్ర భారతదేశంలో ఇది ఊహించని పరిణామం.

సొంత దేశంలో పార్లమెంట్‌లో మాతృభాష మాట్లాడితే నవ్వుతారా? ఎంత నీచం!

Let 75 Years of Independent India Be United! 9

హిందీ రానివారిని, హిందీ డామినేషన్‌ని ఒప్పుకోనివారిని – ఈ దేశంలో సెకండరీ పౌరులుగా చూసే నీచ మనస్తత్వం – ఉత్తరాది నాయకులు కొందరిలో ఈ మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. దీని గురించి ఇప్పటికే ఆందోళన మొదలయింది. ఒక భారతీయుడు తన సొంత దేశంలోని తన పార్లమెంటులో తన మాతృభాష మాట్లాడలేని పరిస్థితి మనకి ఉంది. పార్లమెంట్‌లో ఎవరైనా హిందీలో కాకుండా – తన మాతృభాష మాట్లాడితే – ఈ హిందియన్స్‌ పగలబడి నవ్వుతారు. ఇలాంటి విష సంస్కృతి మన దేశ రాజకీయాల్లో చోటు చేసుకోవడం బాధాకర పరిణామం.

స్వతంత్రం వచ్చిన నాటినుంచీ హిందీవారిదే ఈ దేశంలో పైచేయిగా నడుస్తోంది. నాయకత్వాలూ పెత్తనాలూ అన్నీ వారివే. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఓ దక్షిణాది నాయకుడు దేశానికి లీడర్‌ అయినా.. అది చాలా అరుదు. దక్షిణాది లీడర్లు ప్రధానమంత్రి స్థాయికి చేరినా .. వారిని చులకన చేసి చూపడం, వారిని అగౌరవపరచడం, తద్వారా దక్షిణాది నాయకులు సమర్థులు కారని చూపడం… ఉత్తరాది నాయకుల స్ట్రాటజీలో ఒక భాగం అని అనిపిస్తుంది. ఢిల్లీ వీధుల్లో పీవీ నరసింహారావు కి ఎంతటి అవమానం జరిగిందో తెలుగువారెవరూ మరిచిపోలేరు.

దక్షిణాదిని ముక్కలు చేయండి! హిందీవాళ్లే ఏలండి! ఇదే వారి స్ట్రాటజీ ! అడిగేదెవడు?

Let 75 Years of Independent India Be United! 9

దక్షిణాది రాష్ట్రాల్ని ముక్కలు చేసి వాటి బలం తగ్గించడం… ఉత్తరాది నాయకుల, పార్టీల స్ట్రాటజీ. ఇక్కడి మన నాయకులు ఎంత పవర్‍ఫుల్‍ వ్యక్తులయినా సరే… నేషనల్‍ రాజకీయాల్లో వారికి తగిన గౌరవం ఇవ్వకపోవడం ఉత్తరాది శైలి. అసలు మన భారతదేశం మనకే ఏదో పరాయి దేశంలా… మనకి కావలసినవాటికోసం హిందియన్లని వేడుకోవాల్సి రావడం.. మన దక్షిణాది లీడర్లని అక్కడ ఢిల్లీలో బిచ్చగాళ్ల మాదిరిగా ట్రీట్‍ చేయడం.. ఇలాంటివన్నీ కాంగ్రెస్‌ హయాంలో కోకొల్లలుగా జరిగాయి. ఆదర్శవంతమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ – అంత కంటే ద్రోహి అని దక్షిణాదివారికి ఇప్పుడు అర్థమైపోతోంది. మన భావాలు అర్థం చేసుకోరు. మన ఆందోళనని పట్టించుకోరు. మనం రోడ్డున పడ్డా మధ్యలో వినోదం చూస్తూ మనతో ఆడుకుంటారు. ఇది నిజం కాదా? వీళ్లా మన రక్షకులు? వీళ్లా మన సోదరులు? వీళ్లా భారతీయులు?

జగన్‍, కేసీ‌ఆర్‍ లాంటి గొప్ప నాయకులు కూడా అక్కడ ఢిల్లీ గుమ్మం దగ్గర వేచి చూడాలి. దేవిరించాలి. కారణం? వాళ్లు హిందీ బెల్ట్‌ లోని నాయకులు కారు. హిందీ బెల్ట్‌ అంటే ఏంటి? అయితే హిందియన్‌ అయి ఉండాలి. లేదా మాతృభాష మీద గౌరవాన్ని చంపుకుని హిందీకి దాసోహం అంటూ ఉత్తరాది అహంకారాన్ని తృప్తిపరచాలి. అలాంటివారందరితో ఉత్తర భారతదేశం ఇప్పటికే హిందీ బెల్ట్‌గా మారింది. ఉత్తరాది నాయకులంతా హిందీవాళ్లు కాకపోయినా – వారికి వారి సొంత భాషల పట్ల ఉండాల్సిన గౌరవం లేదనిపిస్తుంది. ఎందుకంటే వాటిలో చాలా వరకూ ఒకే రకం భాషలు. ఆ భాషలకి ప్రత్యేకమైన ఐడెంటిటీలు లేవు. అందువల్లనేనేమో వారు నిత్యం హిందీకి సలాం చేస్తారు. తమ భాషని చంపుకుని హిందీకి దాసోహం అనడానికి సిగ్గుపడరు. ఆత్మగౌరవం కలిగిన బెంగాలీలు, మరాఠీల్లాంటివాళ్లు మధ్యలో తమ భాష అస్తిత్వాల గురించి నోరెత్తినా అది అంతంతమాత్రమే! కానీ హిందీ కంటే ఎంతో గొప్పవైన, ప్రాచీనమైన భాషలు – మన తెలుగు తమిళం కన్నడం మలయాళం. నిజానికి సిసలైన భారతీయ భాషలివి.

మోదీ కూడా హిందీ వ్యక్తి కారు. గుజరాతీయే. కానీ ఉత్తరాది వాళ్లంతా సాధారణంగా హిందీ దాసులుగానే ఉంటూ వస్తున్నారు. హిందీకి దాస్యం చేసినంత సేపే ఈ దేశంలో నాయకత్వానికి అవకాశం లభిస్తుంది. మొదటినుంచీ ఈ దేశపు రాజకీయాల్ని ఆ విధంగా డిజైన్‍ చేశారు. బహుశా అందుకేనేమో.. తమ భాష పట్ల ఎవరికైనా ప్రేమ ఉన్నా స్వలాభం కోసం ఆ లీడర్లు నోరెత్తడం లేదు.

హిందియన్ల ద్రోహాన్ని ముందుగా గుర్తించింది తమిళులే!

Let 75 Years of Independent India Be United! 9

ఈ దేశపు భాష ఏది? ఇండియా భాష ఏది? అని అడిగితే… అది హిందీ అట… హిందీ మాత్రమేనట! స్వాతంత్రం వచ్చిననాటినుంచీ ఇలాగే సాగుతూ వస్తోంది హిందియన్ల ప్రచారం. నిజానికి నిన్నమొన్న వచ్చిన భాష హిందీ… ఇది మన తెలుగుతో తమిళంతో పోలిస్తే ఏ విధంగానూ ఘనమైనది కాదు. అసలది భారతీయ భాష కానే కాదు. పర్షియన్‍ పదాలకి సంస్కృత పదాలు మిక్స్‌ చేసి తయారుచేసిన ఓ వికృత విచిత్ర భాష అది. దాన్ని ఓ ఆయుధంగా చేసి అసలు సిసలు భారతీయ భాషలైన దక్షిణాది భాషల అస్తిత్వాన్ని చంపేయాలన్న కుట్ర – స్వాతంత్రం వచ్చిన నాటినుంచీ జరుగుతోందని అంటారు. అయితే ఈ విషయాన్ని దక్షిణాదిలో తమిళ జాతి ముందుగా గుర్తించింది.

మీరు మా రాష్ట్రం వస్తే హిందీలో మాట్లాడండి… మేం మీ రాష్ట్రం వచ్చినా హిందీలోనే మాట్లాడతాం – అనే అహంకారం హిందియన్లది. కానీ తమిళులు ఈ నీచ సంస్కృతిని ఎంతమాత్రం సహించరు.

తమ భాష గొప్పతనం గురించి తమిళవారు ఎంతో అభిమానం కలిగి ఉంటారు. ఎంతో ఆత్మగౌరవం ప్రదర్శిస్తారు. అయితే తమిళుల ఆత్మగౌరవం చాలాసార్లు ఇతరులకి అహంకారంగా అనిపించడం వల్ల… తమిళవారికి ఇతర దక్షిణాది రాష్ట్రాలనుంచి తగినంత సహకారం అందడం లేదు. కానీ నిజానికి – తమిళ జాతి అనేదే దక్షిణాదిలో లేకపోయి ఉంటే.. వారు ఉత్తరాది మీద నిత్యం పోరాడి ఉండక పోతే… ఏం జరిగి ఉండేది? ఈ పాటికి మన దక్షిణాదికీ మన భాషలకీ ఉనికే లేకుండా పోయేది – ఇది నూటికి నూరుపాళ్లూ సత్యం.

మాతృభాషకి ద్రోహం చేసేవాళ్లు మాతృదేశానికీ ద్రోహం చేస్తారు!

Let 75 Years of Independent India Be United! 9

భాష అంటే సంస్కృతి.. జాతి అస్తిత్వం.
మాకు మా భాష అక్కర్లేదు. మేం హిందీ దాసులం – అనేవాళ్లూ ఉన్నారు. వాళ్లకి ఆత్మగౌరవం విలువ గురించి చెప్పేదేం ఉండదు. ఆత్మగౌరవం అన్నది నేర్పితే రాదు.

పేరుకి నేషనల్‍ పార్టీలు అయినా నిజానికి రెండు కృత్రిమ జాతీయ పార్టీలివి. అందరూ ఒకటే అంటూనే… ఇవి ఈ దేశానికి ద్రోహం చేశాయి. వివిధ రాష్ట్రాల మధ్య పక్షపాతాలు చూపుతూ… దేశ సమగ్రతకీ సమైక్యతకీ తూట్లు పొడుస్తూ – భారతమాతకి తీరని అన్యాయం చేస్తున్నాయి.

మతం చెప్పిన మంచి విలువల్ని పాటించడం మానేసి – లౌకిక వాదం పేరుతో స్వదేశస్థుల్ని ఒక పార్టీ తొక్కి పడేస్తే… మతం పేరుతో స్వలాభం కోసం మనుషుల మధ్య చిచ్చుపెడుతూ ఎదగాలనుకునే నీచమైన దృక్పథంతో సాగుతున్నది మరో పార్టీ. ఈ రెండు పార్టీలదీ కూడా – దాదాపు ఒకటే ధోరణి. దక్షిణాదిని ఎన్ని ఎక్కువ ముక్కలు చేస్తే మనకి అంత సేఫ్‍ అనేది వారి ధోరణి!

ఉత్తరాది రాష్ట్రాలు విశాలంగానే ఉంటాయి. వాటిలోని నియోజకవర్గాల సంఖ్యను పెంచేసి… దక్షిణాది సపోర్ట్‌ లేకపోయినా దేశంలో తమకి శాశ్వతంగా మెజారిటీ వచ్చేలా ఈ నేషనల్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయంటే – ఇంతకి మించిన అన్యాయం ఉంటుందా?

భారతదేశం ఒక దేశం కాదు… ఇది ఒక ఉపఖండం!

Let 75 Years of Independent India Be United! 9

దేశ భక్తి అన్న పేరుతో హిందీని అందరికీ అంటగట్టడం కేవలం హిందియన్ల డామినేషన్‌ కోసమే నన్నది జగమెరిగిన సత్యం. పనిలో పనిగా ఇంగ్లిష్‌ మన భాష కాదు… మీరు హిందీయే నేర్చుకోండి అని అంటుంటారు. ఇంగ్లిష్‌ పరాయి భాష అయితే హిందీవాళ్లు దాన్ని ఎందుకు వదిలేయడం లేదు? ఉత్తరాదికి మాతృభాష, అదనంగా ఇంగ్లిష్‌ చాలట. వాళ్లు తెలుగు తమిళం నేర్చుకోరట. కానీ దక్షిణాది పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌ మానేసి మరీ.. హిందీ నేర్చుకోవాలట. కాదంటే మూడు భాషలు నేర్చుకోవాలట! ఇదెక్కడి అన్యాయం? ఒకే దేశంలో ఒకరికి ఒక నీతి.. మరొకరికి మరో నీతి.

నిజానికి భారతదేశం అనేది ఎప్పుడూ ఒక్క దేశంగా లేదు. అది అనేక దేశాల సమ్మిశ్రణం. అంగ వంగ కళింగ కాశ్మీర మగధ మరాఠ ఆంధ్ర తమిళ కర్నాట మలయాళ దేశాలు అన్నీ విడి విడి దేశాలే. అవన్నీ కలిసిన ఉపఖండం మన భారతదేశం. ఇంగ్లిష్‍ వాళ్ల తరవాత ఈ ఖండం భారతదేశం అయ్యింది.. ఈ దేశాలన్నీ రాష్ట్రాలయ్యాయి. ( అఫ్ కోర్స్‌… హిందీలో రాష్ట్రం అంటే దేశం.. రాజ్యం అంటే రాష్ట్రం. )

కాబట్టి ఇక్కడ చెప్పేదేంటంటే… ఒక్కో దేశానికి ఒక్కో సంస్కృతీ భాషా వ్యక్తిత్వం ఉంటాయి. వాటన్నిటినీ కలిపి ఉపఖండాన్ని తయారుచేసుకున్నాం. ఒక దేశంగా మార్చుకున్నాం. ఒకరినొకరు గౌరవించుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సంస్కృతినీ భాషనీ చంపేస్తూ నిర్ణయాలు తీసుకుంటే ? అది ఆ సమైక్యతకి ముప్పు కాదా? ఏ ఆదర్శంతో అందరూ కలిశామో.. ఆ ఆదర్శానికే తూట్లు పొడుస్తుంటే అది దేశ సమగ్రతకి ప్రమాదం కాదా?

ఏదో ఉపఖండాన్ని దేశం చేశాం అని – ఈ దేశానికి భాష ఇదీ… అంటూ ఓ భాషని అందరి మీదా రుద్దుతున్నారు కొందరు హిందియన్లు. హిందీ ప్రమోషన్‌ కోసం… నిజమైన భారతీయ భాషల్ని కించపరుస్తూ భారతీయ సంస్కృతుల భిన్నత్వాన్ని నాశనం చేస్తూ వచ్చారు. తెలుగు తమిళ కన్నడ మలయాళాలతో పోలిస్తే ఏమాత్రం గొప్ప చరిత్రా గౌరవం లేని భాష హిందీ భాష. ఇది నూటికి నూరుపాళ్లూ సత్యం. అలాంటి భాషకోసం అసలైన మన భారతీయ భాషల్ని చంపుకోవాల్సి రావడం ఎంత దారుణం?

భిన్నత్వంలో ఏకత్వం అన్నది మన భారతీయ ఆదర్శం. కానీ ఏకత్వం పేరుతో భిన్నత్వాన్ని చంపేయడం కాదు. కానీ ఈ హిందీ సంకుచితులు ‘నేషనల్‍ లాంగ్వేజ్‍’ అనే ఓ దొంగ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు మన రాజ్యాంగంలో నేషనల్‍ లాంగ్వేజ్‍ ( జాతీయ భాష) అనే ప్రస్తావన లేనే లేదన్న పచ్చి నిజం మీకు తెలుసా?

హిందీ జాతీయ భాష కాదని స్వయంగా కోర్టులే చెప్పాయి.

https://www.thehindu.com/news/national/Hindi-not-a-national-language-Court/article16839525.ece

రాజ్యాంగంలో లేని ఈ విషయం కొందరు కుత్సిత హిందియన్లు సృష్టించినది మాత్రమే అని మీకు తెలుసా? మరి ప్రత్యేక అస్తిత్వాలూ భాషలూ ఉన్న అనే క భారతీయ జాతుల మీద హిందీని రుద్దుతూ – దానికి తోడు హిందీయేతర రాష్ట్రాల వారికి అన్యాయం కూడా చేస్తూ పోతే.. ఈ సమైక్యత ఎంత కాలం నిలుస్తుంది? – అన్నదే ఇప్పుడు ప్రశ్న.

ఈ దేశం హిందియా ( ఉత్తరాది ) ఇండియా ( దక్షిణాది ) గా విడిపోతుందా?

Let 75 Years of Independent India Be United! 9

ఇప్పటికే ప్రత్యేక దక్షిణాది గురించి జనంలో ఆలోచనలు మొదలయ్యాయి. దేశాన్ని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా కాదు… Hindia మరియు India గా విడిపోతుందేమోనన్న ఆందోళనలు ప్రాణం పోసుకుంటున్నాయి.

హిందీయే మన భాష అని ఇతరుల్ని పీడించే హిందియన్లు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే – మన దేశం ఇండియా ( India ). హిందియా ( Hindia ) కాదు.

ఎవరైనా హిందియన్లు ( Hindians ) ఇండియాని హిందియాగా మార్చాలని చూస్తే – వారికంటే దేశద్రోహులు మరొకరు ఉండరు. ఇప్పటికే హిందియన్లు మన దేశానికి ద్రోహం చేశారు. ఏంటా ద్రోహం? వీళ్లు భారతీయ భాష అంటే హిందీ ఒకటే అంటూ ఇంతకాలం ప్రపంచాన్ని నమ్మించారు. అందువల్ల అంతర్జాతీయంగా మన భాషలకి గుర్తింపే లేకుండా పోయింది. తెలుగు తమిళం కన్నడం మలయాళం వగైరా భాషల విలువ తగ్గిపోయింది.

అన్ని రంగాల్లోనూ దక్షిణాదికి ద్రోహమే!

Let 75 Years of Independent India Be United! 9

అలాగే సినిమా రంగం లాంటివాటిలో కూడా తీవ్రమైన ద్రోహం జరిగింది. జరుగుతూ వస్తోంది. టాలీవుడ్, తమిళ కాలీవుడ్ ఎంత గొప్పవయినా – బాహుబలులూ రోబోలూ తీసినా – ఇప్పటికీ బాలీవుడ్‍ మాత్రమే ఇండియన్‍ సినిమా అని ఫోకస్‍ చేస్తున్నారు. మన డబ్బింగ్‍ సినిమాలు ప్రపంచవేదికల మీద చూపించుకుంటూ అదంతా బాలీవుడ్ గొప్పతనమే అని చెబుతూ ఉన్నారు. ఒక అమితాబ్‌ గురించో షారుఖ్‌ ఖాన్‌ గురించో రాసేటప్పుడు ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ అని రాస్తారు. కానీ రజనీకాంత్‌ , చిరంజీవి లాంటివాళ్లు ఎంత సాధించినా – వీళ్ల గురించి ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ అని ఎప్పుడూ రాయరు. సౌత్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్ అని మాత్రమే రాస్తారు బాలీవుడ్‌ జర్నలిస్టులు. ఎందుకు? ఎందుకంటే – అలా రాస్తే ఇండియాలో బాలీవుడ్‌ కంటే గొప్ప సినిమా రంగాలున్నాయని అంతర్జాతీయంగా తెలిసిపోతుంది. అలా జరగకూడదు. ఇది హిందీవారి కుట్ర కాదా? – అని ప్రశ్నిస్తే వాళ్లు ఏం చెబుతారు?

ఇప్పటికే – దక్షిణాదికి రాజకీయంగా భాషాపరంగా అస్తిత్వపరంగా, వినోదపరంగా ఉన్న అవకాశాలన్నిటినీ Hindians నాశనం చేశారనడంలో అబద్ధం లేదు. అసలు ఇంతకు మించిన దేశద్రోహం ఏముంది? ఆలోచించండి. నిజాల్ని పరిశీలిస్తే సులభంగా అర్థమవుతుంది. మన దక్షిణాది రాష్ట్రాల్ని – ఏమాత్రం మొహమాట పడకుండా వీళ్లు ఈజీగా ముక్కలు చేస్తారు. మన ప్రాజెక్టులకి డబ్బులివ్వరు. మనకి రైల్వై లైన్లే వేయరు. ఏ బడ్జెట్‌ వచ్చినా మనకి ప్రయారిటీ ఉండదు. ఎప్పుడూ ఏదో చిన్న కంటితుడుపు. అంతే.

మన సొంత దేశంలో మన దక్షిణాది పట్ల ఇంతటి చులకన భావం! మన దేశాన్ని మనకే పరాయిగా మారుస్తున్న ఈ ద్రోహం ఎవరిది? వారిని ప్రశ్నించాల్సిన అవసరం లేదా?

మన గొడవల్ని ఆసరా చేసుకుని వీళ్లే మన రాష్ట్రాలు విభజించి ముక్కలు చేస్తారు. విభజించి పాలిస్తారు. మరి – బయటనుంచి వచ్చిన బ్రిటిషర్ల కంటే ఉత్తరాది లీడర్లు హిందీయులు… ఏం గొప్పవాళ్లు అనిపిస్తుంది ఒకోసారి. విభజనలు చేస్తారు. కనీసం విభజన హామీలు అమలు చేయరు. అసలు దక్షిణ భారతదేశం అన్నది భారతదేశంలో ఒక భాగమే కాదు అన్నట్టు ప్రవర్తిస్తారు. ఇంతకంటే దేశద్రోహం ఉందా?

నిజమైన భారతీయులం ఎన్ని అవమానాలైనా సహిద్దాం.. దేశాన్ని సమైక్యంగా ఉంచుకుందాం!

Let 75 Years of Independent India Be United! 9

స్వతంత్రం వచ్చిన నాటినుంచీ దక్షిణాదికి ద్రోహం జరుగుతున్నా ఎవరూ దేశ విభజన కోరుకోం. దక్షిణ భారతీయులు ఎప్పుడూ గొప్పవారే. స్వతంత్రం వచ్చిననాటినుంచీ అన్నిటా అవమానాలు పడుతున్నా… తమ అవసరాలు తీరకున్నా.. ఈ ఉత్తరాది లీడర్ల నిర్వాకాల వల్ల.. నీచ స్వభావాల వల్ల తమ జీవితాలు దెబ్బతిన్నా- రాజధానులు కోల్పోయి రోడ్డున పడినా… మాది ఇండియా… మేం భారతీయులం అని దక్షిణాది వారు సగర్వంగా చెప్పుకుంటున్నారు. జై భారతమాత అంటూ ఐకమత్యంతో నినదిస్తున్నారు.

హిందీ డామినేషన్‌ కలిగిన హిందియాని మాత్రమే ఇండియా అనుకునే సంకుచితమైన ఉత్తరాది ఎక్కడ? అందరూ ఒకటే అనుకునే దక్షిణాది ఎక్కడ? మనం ఎల్లకాలం కలిసి ఉండాలంటే… ఇప్పటికైనా హిందియన్లు బుద్ధి తెచ్చుకోవాలి. భాషాహంకారాలు మాని దక్షిణాదిని అక్కున చేర్చుకోవాలి. హిందీ అహంకారులు తమ మైండ్‌ సెట్స్‌ మార్చుకోవాలి.

స్వాతంత్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి – సాధించిన దానికి సంతృప్తిని చెంది – అదే విజయమనుకుంటే పొరబాటోయి – అన్నాడు మహా కవి శ్రీశ్రీ.

ఇప్పటికైనా ఈ దొంగ నేషనల్‍ పార్టీలు కళ్లు తెరవాలి. దక్షిణ భారతదేశం అంటే సెకండరీ స్థాయి భారతదేశం కాదు అని తెలుసుకోవాలి. తమ రాజకీయ అవసరాలకీ కుట్రలకీ దక్షిణాదినీ వాడుకోవడం మానేసి… వారి అవసరాల్ని నిజంగా అర్థం చేసుకోవాలి. దక్షిణాదిలో హిందీని బ్యాన్‍ చేసి … దక్షిణాది భాషల్నీ సంస్కృతినీ గౌరవించడం నేర్చుకోవాలి. పాతికేళ్ల తరవాత మనమందరం కలిసి స్వతంత్ర భారత శతాబ్ది ఉత్సవాల్ని జరుపుకోవాలి. జై భారతమాత. జై తెలుగు తల్లి.

This post is also available in: Telugu