
ఆగండి. ఇవన్నీ మేం అనడం లేదు. మాలీవుడ్ సోషల్ మీడియాలో రీసెంట్గా వస్తున్న వార్తలివి.
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం నీతిని పూర్తిగా మరిచిపోయారు కొందరు. సంచలనాలు క్రియేట్ చేసే మోజులో… సెలబ్రిటీలు చనిపోకపోయినా… పోయారని రాసేస్తున్నారు.

కాస్త వయసు మీద పడ్డవాళ్లు పోయారని అంటే.. నిజమేమో అని జనం అనుకోవచ్చు. కానీ ఇంకా సంచలనం సృష్టించాలంటే ఏం చేయాలి? వయసులో ఉన్నవాళ్లూ, క్రేజ్ ఉన్నవాళ్లూ చనిపోయారని చెప్పాలి. ఈ మధ్య కన్నడ స్టార్ పునీత్ మరణం ఎంత సంచలనం సృష్టించిందో చూశాక – కొందరికి ఇలాంటి వికృతమైన ఐడియాలు వస్తున్నాయి. అందుకే క్రేజీ హీరోయిన్ అపర్ణా బాలమురళి చనిపోయేలా ఉందన్నట్టు అపోహలు క్రియేట్ చేశారు.
ఈ మధ్యనే సూర్యతో ‘శూరరై పోట్రు’ సినిమాలో నటించింది అపర్ణ. అదేనండీ.. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. అందులో అపర్ణ నటన చూసి అద్భుతం అన్నారు జనం. మరి అలాంటి టాలెంటెడ్ హీరోయిన్… అనారోగ్యం పాలవడం ఏంటీ అని జనం బెంబేలు పడిపోయారు. తీరాచూస్తే అలాంటిదేమీ లేదు.. మాలీవుడ్లోని కొందరు సోషల్ మీడియా ప్రబుద్ధుల సృష్టి మాత్రమే ఇది.. అని తేలింది.
మలయాళ హీరోయిన్ అపర్ణా బాలమురళికి కొద్దిరోజులుగా పరిస్థితి విషమంగా ఉందని మాలీవుడ్ లో విపరీతంగా ప్రచారం జరిగింది. అపర్ణ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిందనీ పరిస్థితి విషమంగా ఉందనీ కూడా సోషల్ మీడియా రాసేసింది.
ఈ వార్తలు ఎంతవరకూ వచ్చాయంటే – చివరికి అపర్ణ స్పందించి.. అయ్యో అలాంటిదేమీ లేదు బాబోయ్ – అని గట్టిగా తనే చెప్పుకోవాల్సి వచ్చింది.
“కొద్ది రోజులుగా నా ఆరోగ్యం గురించి రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి వార్తల్ని ప్రచారం చేయడం ఆపండి. నా స్నేహితులు, బంధువులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ప్రూఫ్ కోసం అన్నట్టు… “రీసెంట్ గా నేను వెళ్ళిన “నిరామయ రిట్రీట్స్” కు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తున్నాను” అంటూ కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తప్పదు మరి. పెన్షనర్లు ప్రతి ఏటా మేం బతికున్నాం అని సర్టిఫికెట్ చూపించినట్టే – సోషల్ మీడియా దాడికి గురయిన సెలబ్రిటీలు కూడా తాము చావలేదని నిరూపించుకోవాలి. ఇలా ప్రూఫులూ ఫొటోలూ కూడా చూపించాలి. ట్రెండ్ అలా ఉంది మరి!
This post is also available in:
ఇంగ్లిష్