17 గంటల పనితో కుప్పకూలి మరణించిన టీవీ ఉద్యోగి!


చూడండి. ఎంత చూడముచ్చటగా ఉన్నాడో! తైవానీస్‌- కెనడియన్‌ టీవీ యాక్టర్! సరే. ఏ దేశం వాడైతే ఏంటి? పాపం 35 ఏళ్లకే రాలిపోయాడు. ఎందుకు? టీవీ ఛానెల్‌ ఓవరాక్షన్‌ వల్ల! సెలబ్రిటీల సందట్లో సొంత ఉద్యోగి పరిస్థితిని పట్టించుకోని నిర్లక్ష్యం వల్ల! పైగా నీరసం వస్తోందని అంటే – అతనిదే ఓవరాక్షన్‌ అన్నార్ట వాళ్లు! చైనా టీవీ ఛానెల్‌ ఓవరాక్షన్‌ ఇది.. మన ఛానెల్స్‌ మాత్రం ఏం గొప్పగా ఉన్నాయని?

నవంబర్‌ 27 . సెలబ్రిటీల్నీ సామాన్యుల్నీ కలిపి చేసే చిత్రమైన ఛాలెంజింగ్‌ ప్రోగ్రాం ప్రోగ్రాం ‘ఛేజ్‌ మీ’ . ఇదో రియాలిటీ టీవీ షో. ఇందులో అందరినీ ఉత్సాహపరుస్తూ ఎంతో ఎనర్జీ ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. బహుశా అందుకే- అందులో పనిచేస్తున్న తైవానీస్‌- కెనడియన్‌ యాక్టర్ .. గాడ్‌ ఫ్రే గావ్‌… పనిచేస్తూ పనిచేస్తూ అలాగే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఇంకేం ఉంది? అసువులు గాలిలో కలిసిపోయాయి. ఎప్పుడో వచ్చి పోయే సెలబ్రిటీలకి ఎంతో విలువ ఇచ్చే టీవీ ఛానెల్స్‌ … ఎప్పుడూ తమ కోసం పనిచేసే ఉద్యోగుల్ని పట్టించుకోవు – అనడానికి ఈ సంఘటనని ఓ ఉదాహరణకి చెప్పుకోవచ్చేమో! ప్రోగ్రామ్ గొప్పగా వస్తోందా లేదా సెలబ్రిటీల మీదే దృష్టి పెట్టే యాజమాన్యం.. ఆ షో కోసం 17 గంటలుగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడన్న విషయం ఎలా పట్టించుకుంటుంది? ఫలితం. ఓ నిండు ప్రాణం! 35 ఏళ్లకే ఒక జీవితం అంతం!

ఒక టీవీ ప్రోగ్రామ్‌లో సెలబ్రిటీలు ఉన్నారంటే – ఓనర్‌కి ఆనందం. ఉద్యోగులకి సంకటం. ఛానెల్‌కి సెలబ్రిటీలు వచ్చినప్పటినుంచి పోయేవరకూ టీవీ ఉద్యోగులు పడే బాధ వర్ణనాతీతం. వాళ్లని రిసీవ్ చేసుకోవడం దగ్గర్నుంచి కూర్చోబెట్టి మాట్లాడి, నొప్పి కలగకుండా తిరిగి పంపేవరకూ ఛానెల్‌ ఉద్యోగులదే బాధ్యత ఉంటుంది. ఏదైనా తేడా వస్తే ఉద్యోగాలు పోవచ్చు. అందువల్ల సెలబ్రిటీ ఆగమనం నుంచి నిష్క్రమణం వరకూ టీవీ ఉద్యోగుల్లో – అంతర్గతంగా ఒక టెన్షన్‌ ఉంటుంది. ఇది టీవీ ఛానెల్‌ లో పనిచేసే ఉద్యోగులకి తెలిసిన విషయమే!

ఇక రియాలిటీ షో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ టెన్షన్‌ అలా కొనసాగుతూనే ఉంటుంది. సెలబ్రిటీలతో లింక్‌ ఉన్న ప్రోగ్రాములైతే డ్యూటీ టైమ్ అయిపోయినా – మధ్యలో కట్‌ చేయలేరు కాబట్టి – అలా ఓవర్‌ టైమ్ చేయాల్సిందే! పైగా టీవీ స్క్రీన్ మీద కనిపించేవాళ్లు నీరసం ప్రదర్శించడానికి లేదు. వచ్చినవారిని, అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరుస్తూ పనిచేయాల్సిందే! తమలో ఓపిక ఉన్నా లేకపోయినా హుషారుగా ఉండాల్సిందే! అయితే అలసట విపరీతంగా ఉన్నప్పుడు – ఆ విషయం స్క్రీన్‌ మీద తెలిసిపోయేలా ఉన్నప్పుడు – కాస్త ఓపిక వచ్చేవరకూ వాళ్లకి రెస్ట్‌ ఇస్తారు. కానీ కెమెరామన్‌ లాంటివాళ్లకి మాత్రం అలాంటి మినహాయింపు ఉండదు. ఫలానా సెలబ్రిటీ కాసేపట్లో వెళ్లిపోవాలనో… ఇంకొకాయన ఎపాయింట్‌మెంట్ దొరకదనో… షూటింగ్‌ కంటిన్యూ చేస్తుంటారు. అయితే ఇక్కడ షో నడిపేదే గాడ్‌ ఫ్రే కాబట్టి అతనికి ఎలాంటి మినహాయింపుకీ అవకాశం లేకపోయింది. టీవీ డిస్కషన్‌ ప్రోగ్రాముల్లో యాంకర్లు మానసికంగా ఎంత అలసిపోతారన్నది మామూలు వ్యక్తులకి అర్థం కాదు. అయితే ఈ ఛేజ్‌ మీ ప్రోగ్రాం – ఫిజికల్‌ ఛాలెంజెస్‌ తో కూడుకున్నది… అందువల్ల ఇది ప్రోగ్రామ్‌ నడిపేవారికి మరింత అలసట కలిగిస్తుంది.

బాధాకరమైన విషయం ఏమిటంటే – కుప్పకూలిపోవడానికి కొన్ని గంటల ముందునుంచీ కూడా “చాలా అలసటగా ఉంది. ఇంక నా వల్ల కావడం లేదు” అని గాడ్‌ ఫ్రే అంటూనే ఉన్నాడట. కానీ అక్కడి స్టాఫ్‌.. “హుషారుగా ఉండు బ్రదర్‌. ఓవరాక్షన్‌ చెయ్యకు ప్రోగ్రాం బాగా రావాలి” – అంటూ అతన్ని ఇంకా పని చేయమని ‘ఎంకరేజ్‌’ చేశారట! విషయం తెలిసిన నెటిజన్లు ఈ ఛానెలూ వద్దు, ఈ ప్రోగ్రామూ వద్దు ఎత్తి పడేయండంటూ ట్వీట్లు పెడుతున్నారిప్పుడు! పెట్టి మాత్రం ఏం లాభం? పోయిన ప్రాణం రాదుగా? తైవాన్‌లో పుట్టి, కెనడాలో పెరిగి, తిరిగి కెరీర్‌ కోసం చైనా వెళ్లి – ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న ఓ యువకుడు – ఛానెల్‌వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల బలయ్యాడు. ఇలాంటి సంఘటనలు చదివి – కనీసం మన ఛానెల్స్‌ వాళ్లయినా మారితే బాగుంటుంది. ఎక్కువ పనిచేయించడం మాట పక్కన పెడదాం. అసలు సెలబ్రిటీలు వచ్చినప్పుడు – ఆ సందట్లో సంస్థకోసం పనిచేసే ఉద్యోగి చచ్చిపోతున్నా పట్టించుకోని తత్వం మారాలి!

53 / 100 SEO Score

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE