100000000 మంది క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు హ్యాక్‌ చేసింది!


“ఓటీపీలు చెప్పద్దు, ఇంకో రకంగా మోసపోవద్దు” – అంటూ మన బ్యాంకులన్నీ మనకి నిత్యం ప్రబోధం చేస్తూ భద్రత బోధిస్తుంటాయి. తాము మాత్రం తమ వైపు నుంచి చాలా సేఫ్‌ అన్నట్టు చెబుతుంటాయి. అయితే మనవాళ్ల సైబర్‌ సెక్యూరిటీ ఎంత అన్నది మనం ఎప్పుడూ అనుమానించాల్సిందే! ఉదాహరణకి మన బ్యాంకుల యాప్స్‌ – చాలాసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కేవలం కొన్ని బ్యాంకులు తప్ప – చాలా బ్యాంకులు నిత్యం పాస్‌వర్డ్ అప్‌డేట్‌ చేసుకోమని విసిగిస్తాయి. అలా మార్చుకోకపోతే భద్రత ఉండకపోవచ్చని వాళ్ల భయం.

పాస్‌వర్డ్‌లు ఎన్ని మార్చినా భద్రత గురించి గ్యారంటీ ఉందని అనుకోలేం. నిజానికి మనం ఎంతో ఎడ్వాన్స్‌డ్‌ అనుకునే యూఎస్‌లోని బ్యాంకులకే సమాచారపరమైన సేఫ్టీ లేదని చెప్పాల్సి వస్తుంది. టెక్నాలజీ అన్నది పని సులువుగా అవ్వడానికి ఉపయోగపడుతుంది కానీ, అందులోనే జాగ్రత్తలు తీసుకోవాలి. టెక్నాలజీ మీద మంచి పట్టున్న హ్యాకర్స్‌ పట్టుబడితే – బ్యాంక్‌ వివరాలు కూడా బయటపడిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే యూజర్లు ఎప్పటికప్పుడు ఎలర్ట్‌గా ఉండకపోతే అంతే సంగతులు!

యూఎస్‌లోని ‘క్యాపిటల్ వన్‌’ అనే ప్రఖ్యాత బ్యాంకు నుంచి ఒక 30 ఏళ్ల వనిత – ఏకంగా 10 కోట్లమంది వ్యక్తుల పర్సనల్ ఫైనాన్షియల్ డేటాను యాక్సెస్ చెయ్యగలిగింది. ఏ పాస్‌వర్డ్ లేకుండానే హ్యాకింగ్ ద్వారా ఈ క్యాపిటల్ వన్ బ్యాంక్ సర్వర్లలోకి చొరబడి సమాచారాన్ని తెలుసుకుంది. అయితే – ఆ సమాచారాన్ని ఆమె ఇంకా ఎక్కడా ఉపయోగించలేదని పరిశోధకులు అంటున్నారు. అయితే ఇప్పటికీ పరిశోధన కొనసాగుతోంది.

బ్యాంకింగ్‌ సైట్లోకి చొచ్చుకువెళ్లిపోయిన ఈ వనిత పేరు పేజ్ ఎడిల్ థాంప్సన్ ( paige adele thompson).ఈమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నెట్‌క్రేవ్‌ (NetCrave) అనే ఒక కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.

ఈమెకు వేరే అవసరమే ఉందో… లేక క్యాపిటల్ వన్ అనే బ్యాంక్ మీద ఏదైనా కోపం ఉందో తెలియలేదుగానీ – ఏదో ఒక సంస్థకు సంబంధించిన ఆర్థిక సమాచారం తెలుసుకోవడం కోసమో లేక దాంట్లో మార్పు చేయడం కోసమో… ఈవిడ హ్యాకింగ్ కి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఈమె హ్యాకింగ్ పనులకి పాల్పడ్డప్పుడల్లా ఎరాటిక్ (Erratic ) అనే పేరు వాడుతూ ఉంటుంది. హ్యాక్ చేసిన తర్వాత దానిని ఆమె ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో చాలా గొప్పగా చెప్పుకుంది. ఎవరో అది చూసి ఫిర్యాదు ఇవ్వడం వల్ల దర్యాప్తు మొదలై ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఏ ఉద్దేశ్యంతో ఈ హ్యాక్ చేసిందో ఇంకా తేలాల్సి ఉంది. ఇక బ్యాంక్‌వాళ్లు ఏమంటున్నారు? ఏముంది? మామూలే! – అబ్బే! ఏం పర్లేదు. మీ సమాచారం అంతా భద్రంగానే ఉంది – అని తమ కస్టమర్లకి భరోసా ఇస్తూ నచ్చజెబుతున్నారు. ఏమైనా డిజిటల్‌ సమాచారం అంటే ఎప్పటికైనా అభద్రమే అనిపిస్తుంది – ఇలాంటి సంఘటనలు చూస్తే!

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE