సినిమా రివ్యూయర్లను రివ్యూ చేస్తున్న జనం!

SriRamaNavami

సోషల్ మీడియా పెరిగిపోయిన తరవాత అక్షరాలు కొన్ని సరిగ్గా రాయగలిగే ప్రతివాడూ జర్నలిస్ట్ అవతారం ఎత్తేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో – ఒక సినిమా విడుదల కాగానే – ప్రతి వెబ్‌సైటూ తనకు తోచిన రీతిలో రివ్యూ ఇచ్చేయడం మొదలైంది. అయితే మీడియా ఎంత సోషల్‌గా మారిపోయినా – రివ్యూల్లో పస లేకపోతే జనం ఆదరించడం లేదు. వెబ్‌ సైట్‌ రివ్యూ నచ్చకపోతే – జనం తమకి తామే రి-రివ్యూలు ఇచ్చుకుంటూ వెబ్ రివ్యూయర్లను తిట్టి పోస్తున్నారు. ఇలాంటి అనుభవమే తాజాగా ఒక మలయాళ చిత్రం విషయంలో ఎదురయింది.

మలయాళ స్టార్ డైరక్టర్ షఫీ తెరకెక్కించిన ‘ఒరు పళయ బాంబ్ కథ’. సినిమాలో హీరో ఒక దివ్యాంగుడు. ఆ హీరో పేరు బిబిన్ జార్జ్. అతనికి నిజ జీవితంలో పోలియో కారణంగా కాళ్ళు దెబ్బతిన్నాయి. అయినా ఆ దివ్యాంగుడిగానే హీరో పాత్రలో ఈ సినిమాలో నటించాడు. ‘పిశాచి’ అనే సినిమాలో కొద్ది క్షణాలపాటు కనిపించే హీరోయిన్ ప్రయాగా మార్టిన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను మలయాళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.

‘ఒరు పళయ బాంబ్ కథ’ ఒక కామెడీ మూవీ. కామెడీ జనానికి చాలా నచ్చింది. అయితే కొన్ని వెబ్ సైట్లు.. ఇదంతా పాత కథేననీ, ఇందులో కొత్తదనమేమీ లేదనీ, ఈ సినిమా మరీ యావరేజ్‌గా ఉందన్నట్లు రివ్యూలు రాశాయి. మలయాళ నెటిజెన్స్‌ చాలామందికి ఆ రాతలు చాలామంది ఎంతమాత్రం నచ్చలేదు. ఎక్కడెక్కడైతే రివ్యూయర్లు ఈ సినిమాను విమర్శించారో.. అక్కడ ప్రతిచోటా ఆ రివ్యూలను వ్యతిరేకిస్తూ కామెంట్లు వచ్చాయి.

మొత్తానికి వెబ్ సైట్లలోని రివ్యూయర్ల అభిప్రాయం కంటే – సాధారణ ప్రేక్షకుల అభిప్రాయమే విజయం సాధించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులు కూడా ఆడుతుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే – మీడియా ఇంతగా పెరగని ఒకప్పటి కాలంలో – ఎవరో కొద్దిమంది ప్రింట్ సినిమా మ్యాగజైన్లలో రివ్యూలు రాసేవారు. “సినిమా జర్నలిస్టులమంటే మేమే” – అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు అందరూ జర్నలిస్టులు కాగలిగే అవకాశం వచ్చింది. అలాగని – రాసే వేదిక ఉంది కదా అని – తెలిసీతెలియక అల్లాటప్పాగా రివ్యూలు రాస్తే – మళ్ళీ జనం అదే రివ్యూయర్లను అక్కడికక్కడే తిప్పుకొట్టే అవకాశం కూడా సోషల్ మీడియా ఇస్తోంది. కాబట్టి వెబ్ సైట్లలో సినిమా రివ్యూలు చేసే మిడిమిడి జర్నలిస్టులూ! కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని రివ్యూలు రాయండి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu