సినిమా దొంగలకు ‘సహాయం’ చేస్తున్న’మూవీ రూల్జ్‌’


ఏ సినిమా వచ్చినా రెండో రోజే నెట్‌లో ప్రత్యక్షం. పైరసీ పైరసీ అని గోల పెట్టడమే తప్ప – దీన్ని ఏమాత్రం ఆపలేని నిస్సహాయతలో పడిపోయింది సినీరంగం. ఎన్టీఆర్‌ – కథానాయకుడు , పేట, వినయవిధేయరామ, ఎఫ్‌2 – ఇలా సంక్రాంతి మూవీస్‌ అన్నీ ఇప్పుడు నెట్‌  ముంగిట్లో సిద్ధంగా ఉన్నాయంటే పైరసీ ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా మూవీ రూల్జ్‌ (movierulz) వెబ్‌ సైట్‌ పైరసీకి కేరాఫ్‌ ఎడ్రస్‌ గా మారింది. ఈ నేపథ్యంలో – దీని ఐపీ ఎడ్రస్‌ని బ్లాక్‌ చేస్తూ వస్తున్నారు అధికారులు. కానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐపీ ఎడ్రస్‌లతో ఈ వెబ్‌సైట్‌ నడుస్తూనే ఉంటోంది. సినీదొంగాభిమానులకు తన “సేవల్ని” అందిస్తూనే ఉంటోంది.

ఇప్పుడు పరిస్థితి మరింత ముదిరింది. మూవీ రూల్జ్‌ వారు – మనల్ని ఇక ఎవరూ ఏం చేయలేరు అనుకున్నారో ఏమో – ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్న వీడియోల మధ్యలోనే పైరసీ వీడియోల్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ట్యుటోరియల్‌ కూడా ఇస్తున్నారు. ఐపీ ఎడ్రస్‌ బ్లాక్‌ అయినప్పటికీ ఏ దొంగ వ్యూయర్‌కీ ఇబ్బంది కలగకూడదు – అన్న తాపత్రయం వీళ్లలో కనిపించడం విశేషం. మీ ఐఎస్‌పీ ( ఇంటర్‌నెట్ సర్వీస్‌ ప్రొవైడర్‌ ) మా వెబ్‌సైట్‌ ఐపీ ఎడ్రస్‌ బ్లాక్‌ చేసేశారా? అయినా పర్లేదు. ఇదుగో మేం చెప్పినట్టు ఇలా చేస్తే –  ఎప్పటిలా మా సైట్‌ ఓపెన్ అవుతుంది. అంటూ – ఓపెన్‌ గా వీడియో ట్యుటోరియల్‌ ఇస్తున్నారు. దీంట్లో ఒకటి కాదు, రెండు పద్ధతుల్ని వీళ్లు సూచిస్తున్నారు. టార్‌ బ్రౌజర్‌ వాడడం ఒకటి, సిఫాన్‌ విపిఎన్‌ ( psiphon vpn ) వాడడం ఒకటి. ఆ పద్ధతులన్నీ ఎలా వాడాలో ట్యుటోరియల్లో చూపిస్తున్నారు. మరి ఇంత ఓపెన్‌గా వాళ్లు దొంగ పద్ధతుల్ని చూపిస్తుంటే, పైరసీని ప్రమోట్ చేస్తుంటే – మరి సైబర్‌ క్రైమ్‌వారు ఏం చేస్తున్నట్టు? ఈ మార్గాల్ని నిరోధించే పద్ధతుల్ని వాళ్లు కనిపెట్టగలరా? ఒకవేళ కనిపెట్టినా పైరసీకారులు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపెడితే? అసలు నిజంగా పైరసీని కంట్రోల్‌ చేయడం సాధ్యమా? – అని సినీరంగం వారు కలవరానికి గురవుతున్నారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu