సత్యజిత్‌ రే కేరాఫ్ కంచరపాలెం

SriRamaNavami

‘కేరాఫ్ కంచరపాలెం’… పేరు చూస్తే ఈ సినిమా గురించి ఏం అర్థం కాదు. సినిమా ఎలా ఉంటుందో, సినిమాలో ఏముంటుందో కూడా ఎవరికీ అవగాహన లేదు, ఐడియా రాదు. ఇందులో ఎవరు ఉన్నారో కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఫొటోల బదులుగా ఆర్ట్‌ వర్క్‌… స్కెచెస్‌ గీసి బొమ్మలతో ఎడ్వర్టయిజ్‌ చేశారు. మరేం చేస్తారు? గుర్తింపు ఉన్న ఒక్క ఆర్టిస్ట్‌ కూడా సినిమాలో లేడు మరి. అంతా కొత్త ఆర్టిస్టులు సరే! మరి ఇక ఈ సినిమాకి వెళ్లాలని అనిపించాలంటే – అసలు ఈ సినిమా గురించి ఓ ఐడియా ఉండాలంటే – జనానికి తెలిసింది ఏంటయ్యా అంటే – కేవలం బాహుబలి టీమ్‌ దీన్ని ప్రమోట్ చేయడం!

కేరాఫ్‌ బాహుబలి… మొదట అదొక్కటే అడ్రస్‌!

రానా సమర్పణ అట… రాజమౌళేమో .. “ఈ సినిమా చూశాక ఈ పాత్రల గురించే చాలా రోజులు ఆలోచించాను “అని అన్నాడట! కీరవాణి అయితే – “ఈ సినిమాలో పాత్రలు వేసినవాళ్లందరూ ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్లతో సెల్ఫీ దిగాలనిపించింది” – అని అన్నాడట.

అంతే! ఇంతకుమించి ఈ సినిమాకి ఎడ్వర్‌టైజ్‌మెంట్లు లేవు. ప్రమోషన్లు లేవు. “పెద్ద డైరెక్టర్లూ నటులూ – చిన్న సినిమాల్ని ప్రమోట్‌ చేయడానికి ఇలాంటి సోది ఏదో ఒకటి చెప్పడం మామూలే! ఇది కూడా అలాంటిదే అయ్యుంటుంది. సరే. పోనీ ఓసారి వెళ్లి చూద్దాం ఈ సినిమా ఏంటో ! ” అని కొందరు ప్రేక్షకులు అనుకుంటారు. అలా వెళ్లిన ప్రేక్షకుడికి పరిస్థితి ఏమిటి? అది చెప్పేదే ఈ రివ్యూ.

ఏంట్రా ఇదీ? ఇది సినిమాయేనా?

థియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకుడికి ఏమీ హడావిడి కనిపించదు. డైరెక్టర్‌ ఏం చెప్పబోతున్నాడో కూడా తెలీదు. ఎక్కడా పెద్ద సౌండ్ ఉండదు. థ్రిల్‌ ఉండదు. గొప్ప బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉండదు. హీరో ఎంట్రీ ఉండదు. అసలు హీరో ఎవరో… ఇది ఎవరి కథో, ఎటుపోతోందో కూడా ఐడియా రాదు. దాదాపు ఇరవై నిమిషాలపాటు ఇదే పరిస్థితి ఉంటుంది. అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో అంచనా వేసుకోవడానికి ఆ ఇరవై నిమిషాలు సరిపోతుంది. మామూలు కమర్షియల్ మూవీలకి అలవాటు పడ్డ వాళ్ళు ఆ మొదటి అరగంటలోనే సీట్లోంచి లేచి బయటికి వెళ్లిపోయే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఇలాంటి సినిమా హిట్‌ అవుతుందా? హిట్‌ మాట అటుంచి గొప్ప సినిమా కాగలుగుతుందా? కాగలుగుతుంది. అదే విచిత్రం! ఇది గొప్ప సినిమా. మంచి సినిమా. తెలుగు భాషలో చెప్పాలంటే – గ్రేట్‌ సినిమా!

ఇలా తీశాడేంట్రా? ఎవడీ డైరెక్టరు?

టైమ్‌ గడిచే కొద్దీ నెమ్మదిగా క్యారెక్టర్ల పోకడ, సినిమా పోకడ అర్థమవుతాయి. ఏ క్యారెక్టర్ ఏమిటి అన్నది తెలుస్తుంటుంది. ఒక నలభై నిమిషాలు అయ్యేసరికి కథలో పడిపోతాం. ఇంటర్వెల్‌ టైమ్‌కి సినిమా ఏంటీ అన్నది దాదాపు ఒక అవగాహనకు వస్తుంది. ఏంటి ఇలా తీశాడు అన్న ప్రశ్న మనసుని తొలుస్తున్నా, సమాధానం దొరక్కపోయినా- ప్రేక్షకుణ్ణి పట్టి ఉంచుతుంది. సెకండాఫ్ కి ఇంటరెస్ట్‌తో థియేటర్లో కూర్చోబెడుతుంది. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి – దర్శకుడి ఉద్దేశమేంటో తెలుస్తుంది. ఎందుకలా తీశాడన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఈ సినిమా స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఓ అవార్డ్‌‌ సినిమాని చూశాం అన్న విషయం అప్పటికి అర్థమవుతుంది. శంకరాభరణం సినిమా మొదటివారం రోజులూ ఆడకుండా తరవాత బ్లాక్‌ బస్టర్‌ అయినట్టు – ఏం అద్భుతంగా తీశాడు! అనే ఫీలింగ్‌ కలుగుతుంది. హ్యాట్సాఫ్‌ టు ద డైరెక్టర్‌!

సత్యజిత్‌రే కంచరపాలెంలో ఉన్నాడా?

సింగిల్‌ లైన్లో చెప్పాలంటే – ఏదీ ఊహించుకోకుండా వెళ్లి ఈ సినిమా చూస్తే కలిగే అనుభూతి ఓ అపురూపం! ఆ అనుభూతిని ఎవరికి వాళ్లే స్వయంగా పొందాలి! అంతేగానీ, ఏదో ఇక్కడా అక్కడా రివ్యూలు చదివీ, ట్రైలర్లు చూసీ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచుకునో తగ్గించుకునో వెళ్లడం కాదు. బ్లాంక్‌ మైండ్‌ తో వెళ్లండి. మంచి అనుభూతితో తిరిగి వస్తారు. ఇది ఒక అత్యంత సహజమైన సినిమా! అత్యంత సహజమైన పాత్రలు కలిగిన సినిమా! మన రెగ్యులర్‌ సినిమా పరిజ్ఞానంతో పరిభాషలో చెప్పాల్సి వస్తే – అసలిది సినిమాయే కాదు. సత్యజిత్ రే లాంటివాడో ఓ సినిమాని బెంగాలీలో తీసేస్తే పొరబాటున తెలుగులో రిలీజ్‌ చేసేశారా? లేకపోతే ఏ మలయాళ సినీ దర్శకుడో మలయాళంలో ఛాన్స్‌ దొరక్క తెలుగులో సినిమా చేశాడా? – అన్న డౌట్‌ వస్తుంది ఈ సినిమా చూశాక!

తెలుగువాళ్లముందు ఇంత సాహసమా?

డైరెక్టర్ ‘మహా’ కచ్చితంగా అభినందనీయుడు! అతని దర్శకత్వ ప్రతిభకి అభినందించడం సరే. అంతకి మించి అభినందించడం దేనికంటే – అసలు ఇలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లి ప్రేక్షకులచేత ఒప్పించగలను అని నమ్మి సాహసించినందుకు! అందులోనూ స్పీడ్‌ని ఇష్టపడుతూ ఓపికా సహనం తక్కువగా ఉండే తెలుగు ప్రేక్షకుల ముందు ఇలాంటి సాహసం చేయబూనడం మరీ గొప్ప విశేషం!

అసలు నటించిందెవడు?

సినిమా రివ్యూ అనగానే నటుల గురించీ నటన గురించీ మాట్లాడాలి. రాయాలి. కానీ అసలు ఇందులో నటుల గురించీ పాత్రల గురించీ చెప్పడానికి ఏమీ లేదు. అసలు వాళ్లెవరూ నటించలేదు. వాళ్లే పాత్రలు. వాళ్లే నటులు. నటన అనేది ఎక్కడా కనిపించదు. చిన్న పిల్లల దగ్గర్నుంచి అందరూ సహజంగా నటించారు. సారీ… సహజంగా ఉన్నారు. పోనీ వీళ్లు బాగా నటించారు, వాళ్లు బాగా నటించారు అని చెప్పాలన్నా – అసలు ఇందులో మనకు తెలిసిన నటులు ఎవరూ లేరు.

మరీ ఇంతమందికి బ్రేకా?

ఒక్కో సినిమా – అందులోని ఓ పాత్రకీ, ఆ పాత్ర నటించిన వారికీ పేరు తెస్తుంటుంది. ఒకేసారి అనేకమందికి గుర్తింపు తెచ్చే సినిమాలు చరిత్రలో కొన్ని మాత్రమే ఉంటాయి. అందరూ కొత్త వాళ్లే ఉండేలా దాసరి నారాయణరావు సినిమాలు తీసేవారు. స్వర్గం-నరకం, బ్రహ్మముడి – ఇలాంటి సినిమాలు ఒక మోహన్‌బాబునీ, ఒక రజని ( హీరోయిన్‌ ) ని తెలుగువారికి అందించాయి. పాతికేళ్ల క్రితం వచ్చిన ‘శివ’ సినిమాని గుర్తు చేసుకోండి. అంతవరకూ మనం ఎవరూ చూడని మనుషులు అందులో చాలామంది ఉన్నారు. కానీ ఆ సినిమా తరవాత శివ నరేష్‌, శివ గణేష్‌, శివ చిన్నా – ఇలా ఆ సినిమా పేరుతోనే అనేకమందిని గుర్తుపెట్టుకున్నాం. ఆ రకంగా ఈ సినిమాని ‘శివ’ తో పోల్చవచ్చు. కానీ అందులో అప్పటికి జనానికి ఆల్రెడీ తెలిసిన నాగార్జున, మురళీమోహన్‌ లాంటి నటులు కొంతమంది అయినా ఉన్నారు. ఈ సినిమాలో అలా ఒక్కరూ లేరు. సినిమా పూర్తయిపోయిన తరవాత – టైటిల్స్‌ స్క్రాల్‌ అవుతుంటే – జనం థియేటర్లోంచి వెళ్లిపోకుండా నుంచుని – ఏ పాత్రలో నటించింది ఎవరు? వాళ్ల పేర్లేంటి? – అని చదువుకోవడం – ఈ సినిమా ఘనవిజయానికీ, నటుల సహజత్వానికీ అసలైన అవార్డ్‌!

రివ్యూలు చదవొద్దు, ప్లీజ్‌!

‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా గురించి చివరిగా మళ్లీ చెప్పేది ఒకటే! – మీరు ఏ రివ్యూలూ చదవకుండా ఈ సినిమాకి వెళ్లండి. సహజమైన అనుభూతిని పొందండి. ఎందుకంటే మామూలు కమర్షియల్‌ సినిమాల మధ్య ఈ సినిమా నిజంగా ఓ గొప్ప ప్రయోగం, అద్భుతం. ఆ అద్భుతాన్ని చూసి గొప్ప అనుభూతి పొందిన వాళ్లందరూ – థ్రిల్‌ అయిపోయి ఆ అనుభూతిని ఎలా పంచుకోవాలో తెలియక – ఏదేదో చెబుతారు. మీకు నేచురల్‌గా కలిగే మంచి అనుభూతిని పాడు చేస్తారు. అందుకే ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాకి వెళ్లండి. చూడండి అనుభూతిని మీరే స్వయంగా పొందండి. పెద్ద పెద్ద డైలాగులూ అందమైన మేకప్పులూ ఆకర్షణీయమైన ముఖాలూ ఉంటే తప్ప చూడలేం అంటారా? ఈ సినిమాకి వెళ్లద్దు. సినిమా కాకుండా కొన్నిజీవితాల్ని ఉన్నదున్నట్టుగా తెరమీద చూడగలిగే దమ్ముందా? అయితే వెంటనే వెళ్లి చూడండి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu