వీటికి జీవితాంతం డబ్బులు కడుతూనే ఉండాలి!

ఇదివరకు ఇంట్లో ఒక వస్తువు కొంటే అమ్మయ్య! జీవితాంతం పనికొస్తుంది అనుకునేవారు. ఇక వేరేవి కొనుక్కోవడానికి ప్లాన్‌ చేసుకునేవారు. అయితే ఇప్పుడు టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఇలా ఏది కొన్నా మూడు నాలుగేళ్లలోపే పాతబడిపోతున్నాయి. మళ్లీ మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఇప్పుడీ పరిస్థితి సాఫ్ట్‌వేర్‌కీ, యాప్స్‌కీ, ఇంటర్‌నెట్‌ సర్వీసులకీ కూడా పాకింది.

నిన్నమొన్నటి వరకూ మనం సాఫ్ట్‌వేర్లూ, యాప్స్ కొనుక్కోవాలంటే – వాటిని ఒక్కసారి కొనేస్తే సరిపోయేది. యాప్స్ మాత్రమే కాదు… ఒక ఇంటర్నెట్ సర్వీస్ అయి ఉన్నా – సబ్‌స్క్రిప్షన్ కట్టాలంటే, “లైఫ్ టైం సబ్‌స్క్రిప్షన్” అనే ఆప్షన్ ఉండేది. అయితే, ఇటీవలి కాలంలో చాలా యాప్స్, అనేక ఇంటర్నెట్ సర్వీసులు – “లైఫ్ టైం పర్ఛేజ్‌” అనేదానిని పూర్తిగా తొలగించడం గుర్తించాల్సిన విషయం. ఒక్కసారి కొనేస్తే ఇక జీవితాంతం పనికొస్తాయి… అనే పరిస్థితి నుంచి – ప్రతి నెలా ఎంతో కొంత సబ్‌స్క్రిప్షన్‌గా చెల్లిస్తే తప్ప ఆ సర్వీసుల్నీ, సాఫ్ట్‌వేర్స్, యాప్స్‌నీ ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. ఫ్రీ సాఫ్ట్‌వేర్స్, ఫ్రీ యాప్స్ ఉన్నప్పటికీ – మంచి ఫీచర్స్ అన్నీ సాధారణంగా ప్రీమియం యాప్స్, ప్రీమియం సర్వీసులలోనే దొరుకుతాయి. మొన్నటివరకూ ఫ్రీ వెర్షన్, ప్రో వెర్షన్ అని రెండు స్థాయిల్లో యాప్స్, సాఫ్ట్‌వేర్స్‌ని ఇస్తున్నప్పటికీ… ప్రో వెర్షన్‌కి లైఫ్ టైంలో ఒక్కసారి – అంటే వన్ టైం పేమెంట్‌ చేస్తే సరిపోయేది. అవి మన సొంతం అయిపోయేవి. అయితే ఇప్పుడు ఆ స్థానంలో నెల నెలా సబ్‌స్క్రిప్షన్స్ కట్టాల్సిన పరిస్థితి దాపురించింది.

ఆఖరికి Cam Scanner, Face app లాంటి మోస్ట్ పాపులర్ యాప్స్‌.. జనం ఎంతో ఇష్టపడే, అవసరం అనుకునే యాప్స్‌కి కూడా ప్రీమియం వెర్షన్స్ పేరిట మంత్లీ సబ్‌స్క్రిప్షన్స్ పెట్టేశారు. అలాగే ఒకసారి సాఫ్ట్‌వేర్‌ కొనుక్కుంటే – ఆ సీరియల్‌తో ఎన్ని సిస్టమ్స్‌ లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎంత డబ్బుపోసి సాఫ్ట్‌వేర్‌ లైసెన్స్‌ కొన్నా ఒకటి రెండు సిస్టమ్స్‌కి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వీటన్నిటికీ కారణం… ఆర్థిక మాంద్యమా? లేకపోతే ఆ డెవలపర్ల అత్యాశా? ఆలోచించాల్సిన అవసరం ఉంది.

కస్టమర్ల నుంచి నిరంతరం ఇలా రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా డబ్బు లాగడం అవసరమా? అంటే – అందుకు ముఖ్య కారణం – ఈ సాఫ్ట్‌వేర్స్‌లో యాప్స్‌లో కొత్త కొత్త వెర్షన్స్ రిలీజ్ చెయ్యాల్సిన అవసరం ఉండడం! ఏ యాప్‌లోనైనా కొత్త ఫీచర్స్ ఎప్పటికప్పుడు అదనంగా చేర్చాల్సిన అవసరం ఈ పోటీ ప్రపంచంలో రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ మెయింటెనెన్స్ ఖర్చులను భరించడం కోసమే కంపెనీలన్నీ ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్స్ బాట పడుతున్నాయి. సబ్‌స్క్రిప్షన్స్‌తో పోల్చి చూస్తే – లైఫ్ టైమ్‌ పర్ఛేజ్‌ కి కాస్త ఖర్చు ఎక్కువ అనిపించవచ్చు. అయితే అప్‌డేట్స్‌ ఎంతవరకూ ఇస్తారన్నదాన్ని బట్టి – చాలా సార్లు లైఫ్‌టైమ్‌ లైసెన్స్‌ కొనడమే లాభకరం! సబ్‌స్క్రిప్షన్స్ సింపుల్‌ గా కనిపించినా – మన సొమ్మంతా లాగేస్తాయి. ఎలాగైతే EMIలు ప్రతి నెలా మన జీతంలో ముఖ్య భాగాన్ని పట్టుకుపోతాయో, అలాగే ఈ సబ్‌స్క్రిప్షన్స్ ప్రతి నెలా మన సొమ్మును ఎగరేసుకుపోతాయి. కాబట్టి ఏ మాత్రం వీలైనా లైఫ్‌టైమ్‌ చెల్లింపు ద్వారా శాశ్వతంగా ఆ సాఫ్ట్‌వేర్స్ లేదా యాప్స్‌ని మన సొంతం చేసుకోవడం మంచిది. రేపు కొత్త వెర్షన్‌ వచ్చినా అప్‌గ్రేడ్‌ ప్రైస్‌ చెల్లిస్తే సరిపోతుంది. అయితే లైఫ్‌టైమ్‌ పేమెంట్‌ చేసేటప్పుడు ఆ సాఫ్ట్‌వేర్‌కి ఫ్రీ అప్‌డేట్స్‌ ఎంతకాలం ఇస్తారు? అన్నది కూడా గమనించడం అవసరం.

This post is also available in: ఇంగ్లిష్‌