రెండొకట్ల రెండు! రేపటివరకూ సున్న!

SriRamaNavami

“ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలు మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు” – అని చెప్పాడు సుమతీ శతకకారుడు. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదే నీతిని పాటిస్తున్నట్టున్నాయి. వ్యాపారాలు చేసుకునేవాళ్లకి అనుకూల వాతావరణం కల్పించడంలో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌కి నంబర్‌ వన్‌, తెలంగాణకి నంబర్‌ టూ ర్యాంకులు వచ్చాయి. కాస్త అటూ ఇటూ అయినా రెండు టాప్‌ ర్యాంకులూ మనకే వచ్చాయని సంతోషించవచ్చు. అయితే ఇక్కడ ఈ విజయం కంటే గుర్తించదగిన మరో విషయం ఉంది. ఈ గెలుపుని పాఠకుల ముందుకి తీసుకురావడంలో కొన్ని మీడియా సంస్థలు చూపిన చతురతే ఆ విషయం!
ఇప్పుడు దాదాపు ప్రతి పెద్ద పత్రికా ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణలోనూ విడివిడిగా ఎడిషన్స్‌ నడుపుతోంది. అయితే ఒకే విషయాన్ని అక్కడా ఇక్కడా కూడా రాయాల్సి వచ్చినపుడు అవి చూపుతున్న చతురత అంతా ఇంతా కాదు. అక్కడో మాటా ఇక్కడో మాటా అన్నట్టు ఉంటోంది వాటి వ్యవహారం. ఆంధ్రాకి వచ్చిన నంబర్‌ వన్‌ ర్యాంకుని అక్కడి ఎడిషన్లో గొప్పగా చూపిన పత్రికలు – తెలంగాణ దగ్గరకొచ్చేసరికి చిక్కుల్లో పడ్డాయి. తెలంగాణలో ఉంటూ ఆంధ్ర నంబర్‌ వన్‌ అని చూపిస్తే – తెలంగాణని తక్కువ చేసినట్టవుతుందని అనుకున్నాయో ఏమో, తెలంగాణ సాధించిన ర్యాంక్‌ నంబర్‌ 2 ని పెద్దగానూ, ఆంధ్రప్రదేశ్‌ సాధించిన ర్యాంక్‌ నంబర్‌ 1 ని చిన్నగానూ వేసి ‘బ్యాలెన్స్‌’ చేశాయి. నిజం రాయడానికి కూడా ఇంత బ్యాలెన్స్‌ పాటించాల్సిన అవసరం ఏముంది? అయినా తెలంగాణ, ఆంధ్రల మధ్య ఇప్పుడు అభివృద్ధి పోటీ వాతావరణం ఉందే తప్ప – ఉద్యమం నాటి ఆవేశాలు, విభజననాటి విద్వేషాలూ లేనే లేవు. అలాంటప్పుడు ఈ అతి తెలివి అవసరం లేదేమోననిపిస్తుంది. ఏదేమైనా ఎవరి క్షేమం వారిది! అయినా – నిజం చెప్పాలంటే సులభతరమైన వాతావరణం కల్పించినంత మాత్రాన అదేదో గొప్ప విజయం కాదు. ఆ వాతావరణాన్ని గుర్తించి పరిశ్రమల స్థాపనకి ఎక్కువమంది ముందుకొచ్చి ప్రగతి సాధించినప్పుడే నిజమైన విజయం సాధించినట్టు! అంతవరకూ – ఈ ర్యాంకులకి ఉన్న విలువ ఒకటీ రెండూ కాదు, కేవలం సున్నా మాత్రమే!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu