రశ్మిక.. రష్మికా.. రాష్మికా.. రశ్మికా..

SriRamaNavami

దేవతలకు అనేక పేర్లు ఉంటుంటాయి. అయితే సినీమా నటీనటుల్ని కూడా మనవాళ్లు దేవతల్లా కొలుస్తారు కాబట్టి కాబోలు… వాళ్లకి కూడా రకరకాల పేర్లు పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు రశ్మికా మందణ్ణ విషయంలోనూ అదే జరుగుతోంది. కన్నడంలో ‘కిరాక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్ అయిన రశ్మికా మందణ్ణ, తెలుగులో ‘గీతగోవిందం’తో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఈమెకి తమిళ, మలయాళ సినీ రంగాలు కూడా ఆహ్వానం పలుకుతున్నాయి.
అయితే రశ్మిక పేరును నాలుగు దక్షిణ భారతభాషల్లోనూ నాలుగు రకాలుగా రాస్తున్నారు. వీటిలో ఏ రెండూ కూడా ఒక్కటిగా లేకపోవడం విశేషం

రశ్మిక ప్రాథమికంగా కన్నడ అమ్మాయి. ఆమె అసలు పేరు రశ్మికా మందణ్ణ. అయితే తెలుగులోకి వచ్చేసరికి ‘రశ్మిక మందన్న’ అనీ ‘రష్మిక మందన్న’ అనీ రాస్తున్నారు. తమిళంలో ‘రాష్మికా మందనా’ అని మొదట్లోనే దీర్ఘం పెట్టి రాస్తున్నారు. ఇక మలయాళంలో చివరి దీర్ఘం కూడా తీసేసి ‘రశ్మిక మందన’ అని రాస్తున్నారు. ఇవన్నీ వేరు వేరుగానే ఉండటం విశేషం.

ఏదేమైనా – ఒక నటుడు గానీ, నటి గానీ అనేక భాషల్లో నటించేటప్పుడు అసలు పేరును ఆ భాషవారికి సరిగ్గా తెలియజేయాలి. అంతే కాదు, తమకి భాష తెలియకపోయినా తమ పేరును స్క్రీన్ మీద ఎలా ఇస్తున్నారో… ఒకసారి చెక్ చేయించుకుని చూసుకోవడం మంచిది. ఎందుకంటే పేరు అన్నది కోట్ల మంది ప్రేక్షకుల మనసుల్లో స్థిరంగా ఉండిపోయే విషయం కాబట్టి!

సమస్య ఎక్కడ వస్తోందంటే – ఇంగ్లిష్‌లో సినిమా వార్త రాస్తే- యాక్టర్స్‌ పేర్లను తమతమ భాషల్లోకి రాసుకునేటప్పుడు ణ, న – ళ, ల… మధ్య తేడాలు పోతున్నాయి. అందువల్లే చాలాసార్లు హీరోహీరోయిన్ల పేర్లను పరభాషలవాళ్లు తప్పుగా రాయడం జరుగుతోంది. కొందరికి శ, ష, స ల మధ్య తేడాలు తెలియకపోవడం, అమ్మాయిల పేర్ల చివర ఎప్పుడు దీర్ఘం పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అన్న అవగాహన లేకపోవడం – ఇవన్నీ ఇందుకు కారణాలే! అలా కాకుండా, పేర్లను ఆషామాషీగా రాసేయకుండా సరిగ్గా గమనించి రాస్తే – ఆ కూడా నటుల్ని మాత్రమే కాదు, మన భాషల్ని కూడా మనం గౌరవించుకున్నవాళ్లం అవుతాం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu