‘మహానటి’ బాటలోనే ‘మహానటుడు’


‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి ఓ అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. తాత, తండ్రి, కొడుకు నటులై, కుటుంబం అంతా కలిసి నటించే అరుదైన అలాంటి అవకాశం ప్రపంచంలోనే మరెవరికీ వచ్చి ఉండదు. అలాగే – తండ్రీ కొడుకూ నటులై ఉండి, తన తండ్రి పాత్రలో తానే నటించే అరుదైన అవకాశం కూడా బాలకృష్ణకి తప్ప మరెవరికీ వచ్చి ఉండదు. మరి ఇలాంటి చిత్రానికి హీరో, దర్శకుడూ ఎలాంటి న్యాయం చేశారు? చూద్దాం.

అయితే – పడుచు ఎన్టీఆర్‌లాగ బాలకృష్ణ ఎంతమాత్రం ఫిట్‌ కాలేదన్నది ఈ సినిమా మీద మొదటి విమర్శ. చాలాచోట్ల ఎన్టీఆర్‌లా నడిచేందుకూ మాట్లాడేందుకూ బాలకృష్ణ ప్రయత్నించినప్పటికీ – విడిగా ఆయనకో ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉండడం వల్ల – ఎదురుగా కనిపిస్తున్న బాలకృష్ణని చెరిపేసి – అతన్నే ఎన్టీఆర్‌ అనుకోవడం ప్రేక్షకులకి చాలా కష్టం.

కథాపరంగా చూస్తే – ఎన్టీఆర్‌ సినీజీవితంలోని ముఖ్య ఘట్టాల్ని బాగానే కవర్‌ చేశారు. లవకుశ లాంటి ముఖ్యమైన కొన్నిటిని వదిలేసినప్పటికీ – అనేక చిత్రాల విషయాల్ని బాగానే టచ్‌ చేశారు. కొన్ని తప్పులు కూడా ఉన్నాయని విమర్శకులంటున్నారు. ఎన్టీఆర్‌ కుమారుడు చనిపోయింది ‘దక్ష యజ్ఞం’ సినిమా సమయంలోనని చెబుతారు. కానీ సినిమాలో వేరే సినిమా చూపించారు. ఎన్టీఆర్‌ శివుడిగా నటించింది రెండు సినిమాల్లో – ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ’, ‘దక్ష యజ్ఞం’. రెండు సందర్భాల్లోనూ ఆయనకి విషాద సంఘటనలు జరగడం వల్ల – ఇక ఆయన జీవితంలో శివుడి పాత్రే వేయలేదని అప్పటితరంవారు చెబుతారు.

ఇక పోతే – క్రిష్‌ తెలివితేటల గురించి! డైరెక్టర్‌గా క్రిష్‌కి మంచి ఎమోషన్స్‌ ఉన్నాయి. గమ్యం, వేదం లాంటి సినిమాల్లో వాటిని చూపించాడు, పైకి వచ్చాడు. అయితే ఆయనకున్న మరో టాలెంట్‌- కష్టమనుకునే సినిమాని ఏదో ఓ గైడ్‌లైన్‌ ఎదర పెట్టుకుని – మినిమమ్‌ గ్యారంటీతో స్పీడుగా చుట్టేయడం! ఇది నిజంగా గొప్ప టాలెంట్‌… ఎంతో కష్టపడి రాజమౌళి ఐదేళ్లపాటు ‘బాహుబలి’ తీస్తే – ఆ ఇన్‌స్పిరేషన్‌తో షార్ట్‌కట్‌లో క్విక్‌గా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చుట్టేశాడు మనవాడు – అది కూడా మినిమమ్‌ గ్యారంటీతో! అలాగే ఇప్పుడు ‘మహానటి’ గైడ్‌లైన్స్‌లో ‘ఎన్టీఆర్‌’ లాగిపడేశాడు.

నిజాయతీగా చెప్పాలంటే ఈ సినిమా క్రెడిట్‌ ఎక్కువభాగం ‘మహానటి’ డైరెక్టర్‌ నాగ్‌ ఆశ్విన్‌కి వెళ్తుంది. ఒక బయోపిక్‌ని ఎలా తీస్తే జనాన్ని ఆకట్టుకుంటుందో ఎంతో ఆలోచించి ఓ గైడ్‌లైన్‌ ఏర్పరచాడు నాగ్‌ ఆశ్విన్‌. క్రిష్‌ ఆ గైడ్‌లైన్స్‌ ఫాలో అయాడంతే! నిజం మనకి తెలియదు గానీ – బయోపిక్‌ తీసే విషయంలో – బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌ ట్రాన్సిషన్స్‌, లైటింగ్‌, యాక్టర్స్‌ సెలక్షన్‌ – ఇలా అన్ని కోణాల్లోనూ క్రిష్‌ నాగ్‌ అశ్విన్‌నే ఫాలో అయ్యాడా అనిపిస్తుంది.

బుర్రా మాధవ్‌ రాసిన మాటలు బాగున్నాయి. “మీ తుపాకులు నిజమైనవి కావచ్చు. కానీ ఇది సినిమా గుండె. షూటింగ్‌కి భయపడదు” – అన్నది ఈ సినిమాలో బెస్ట్‌ డైలాగ్‌ అని చెప్పవచ్చు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu