మనుషుల గురించి తెలుసుకోవడానికి మరణం వరకూ ఆగాలా?

SriRamaNavami

మనకిప్పుడు హీరో హీరోయిన్లే ఆరాధ్య దైవాలు. ప్రస్తుత రాజకీయ నాయకులే మనకు సెలబ్రిటీలు. మనకు తెలిసిన వీళ్ళు పట్టుమని వంద మంది కూడా ఉండరు. నిజానికి ప్రపంచం నిండా ఎందరో గొప్పవాళ్లున్నారు. మనం సెలబ్రిటీలుగా కొలిచేవాళ్ల కంటే ఎంతో ఘనులున్నారు. అయినా వాళ్ల గురించి తెలుసుకోం. ఎప్పుడు తెలుసుకుంటున్నాం అంటే.. దురదృష్టవశాత్తూ వాళ్లు మరణించినప్పుడు మాత్రమే! ఇదీ నేటి పరిస్థితి! కారణం… మనకి మన నిత్యావసరాలు తీరాలి… నిత్యం ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలి… ఇదే జీవితం అనుకుంటూ ఇంత సంకుచితంగా మారిపోయాం.

ఇప్పుడు ఎవరెవరి కెరీర్‌లు, ఎవరెవరి వృత్తులు, ఎవరెవరి చదువుల్లో వాళ్లు పడి అసలు గొప్పవారి గురించి పట్టించుకోవడమే మానేశాం. పోనీ ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నవాళ్లయినా – ఈ పని చేస్తున్నారా అంటే అదీ లేదు. ఉదాహరణకి – నిత్య జీవితంలో ఎంతో స్వేచ్ఛని అనుభవిస్తాం గానీ.. ఇంత స్వాతంత్ర్యం తెచ్చిన గొప్పవాళ్లని ఎప్పుడూ తలచుకోం. అలాగే అనేక వస్తువులు కనిపెట్టిన సైంటిస్టుల విషయం కూడా! ఎవరినీ ఏనాడూ తలచుకోం. తమ అభిమాన హీరో కటౌట్‌ కి దండ వేసే తీరిక ఉన్నవాళ్లే తప్ప – అసలు సినిమా కనిపెట్టిన థామస్‌ ఆల్వా ఎడిసన్‌ని తలచుకునే విశాలహృదయం ఉన్నవాళ్లు ఎంతమంది?

దురదృష్టవశాత్తూ నేటి తల్లిదండ్రులెవరూ తమ పిల్లలకి గొప్పవాళ్ళ గురించి చెప్పడం లేదు. అందుకే వాళ్లకి గొప్ప అలవాట్లు రావడం లేదు. పిల్లలకి చెప్పే తీరిక ఎక్కడుంది? పేరెంట్స్‌ ఉద్యోగాల్లో బిజీ, పిల్లలు చదువుల్లో బిజీ! ఇందువల్ల – ఒక మనిషి గురించి ఈ తరంలో ఎవరైనా తెలుసుకోవాలీ అంటే. . ఆయన చనిపోయిన తరవాత మాత్రమే … ఇంకా చెప్పాలంటే ఆ చనిపోయిన రోజున మాత్రమే అతని గురించి తెలుసుకోగలుగుతున్నారు.

చనిపోయిన రోజే తెలుసుకోవడమా?

ఉదాహరణకి ఇటీవల కరుణానిధి చనిపోవడం జరిగింది. ఆయన ఎవరు, ఏ పార్టీ, ఏం చేశారు, ఏ విజయాలు సాధించారనే విషయాలు – ఈ తరంలో – తెలియనివాళ్లే ఎక్కువ. నిన్నటిదాకా కరుణానిధి అంటే ఏమీ తెలియదు. కానీ ఈరోజు వెబ్ సైట్లు, పేపర్లు, టీవీల నిండా ఆయన గురించే వార్తలు ఇచ్చాయి ఇప్పుడు చదివి, “అబ్బా! ఆయన ఇలాంటివాడా? ఇది చేశాడా.. ఇంత చేశాడా.. అనుకుంటున్నారు. అంటే చనిపోయినప్పుడు మాత్రమే వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నారు. తెలుసుకునే అవకాశం, తీరిక అప్పుడు మాత్రమే లభిస్తున్నాయి. ఇది దారుణమైన పరిస్థితి. కానీ, ఇది సరి కాదు. వివిధ వ్యక్తుల గురించిన అవగాహన ముందునుంచీ ఉండాలి. ప్రతి తరం వారూ ముందు తరాల చరిత్ర తెలుసుకుని తీరాలి. ఏ వ్యక్తినయినా వారు బతికున్నప్పుడే గుర్తిస్తేనే ప్రయోజనకరం. అంతే తప్ప, వారు చనిపోయాకో లేక చిట్టచివరి క్షణాల్లోనో వారి గురించి తెలుసుకుని మాత్రం ఏం చేయగలం? – నిట్టూర్చడం తప్ప మరేం చెయ్యలేం.

గతకాలంలో ఎన్నో విజయాలు సాధించిన గొప్పవారిని గురించి తెలుసుకోకుండా – ప్రస్తుతం మనకి తెలుసున్న పదిమంది సెలబ్రిటీల గురించీ ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటే – మనుషుల ఆలోచన వికసించదు. ఆలోచన వికసించాలంటే గతం తెలియాలి, గొప్పవారి గురించి తెలియాలి. మన జాతి గౌరవం, ప్రతిష్ఠ గురించి అవగాహన ఏర్పడాలి. ఈ అవగాహన ఉన్నప్పుడే ఈ తరం నిజమైన ఆత్మవిశ్వాసంతో ముందుకి వెళ్లగలుగుతుంది.

ఇందుకు ఏం చేయాలి?

గొప్ప చరిత్ర సృష్టించిన నాయకుల గురించీ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్పగొప్ప ప్రముఖుల గురించి ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడైనా ఆలోచించాలి. వికీ పీడియా చదివో పుస్తకం చదివో వాళ్ల గురించి తెలుసుకోవాలి. పెద్దవాళ్లు తమ ఇంట్లో పిల్లలకి – వివిధ రంగాల్లో గొప్పవ్యక్తుల గురించి ప్రాథమికంగానైనా చెప్పాలి. జాతీయ నాయకులు, గొప్ప గొప్ప పోరాటాలు చేసిన యోధులు, గొప్ప గొప్ప పరికరాలు కనిపెట్టిన శాస్త్రవేత్తలు, ప్రజల ఆలోచనా తీరును మార్చేసిన తత్త్వవేత్తలు, సమాజంలోని మూఢనమ్మకాల్ని పెకలించేందుకు కృషిచేసిన, విజయాలు సాధించిన గొప్ప వ్యక్తులందరి గురించీ ప్రతి తరం తెలుసుకోవాలి. ఈ హడావుడి చదువులతో పాటు పిల్లలకి కాస్త చరిత్ర గురించి, గొప్పవారి విజయాల గురించి చెబుతూ వారు బతికుండగానే వాళ్ళని ఈ తరం గౌరవించేలా చెయ్యాల్సిన బాధ్యత పెద్దలమీదా, టీచర్స్‌ మీదా కూడా ఉంది.

చనిపోయిన గొప్పవారు సరే సరి.. మన చుట్టూ చూస్తే – ఇప్పటికీ నిన్నటితరం గొప్ప వ్యక్తులు ఎందరో సజీవంగా కనిపిస్తారు. ముందు వాళ్ల గురించి తెలుసుకోండి. తెలుసుకోనివ్వండి. ఆ పని ఎప్పుడో కాదు, ఇప్పుడే మొదలు పెట్టండి. మనుషుల గురించి తెలుసుకోవడానికి మరణం వరకూ వెయిట్‌ చేయాలా ఏంటి?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu