బీజేపీయే వాస్తుని వెక్కిరిస్తే ఎలా?


కేసీఆర్ ఎంఐఎంని సపోర్ట్ చేసినప్పటికీ హిందూ ధర్మాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. పైగా ఆయనే ఎంతో నమ్ముతారు. పైగా మతపరంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఎంతో సామరస్య ధోరణిలో సాగుతుంటారు. తెలంగాణలో ఉన్న మతపర భావాల ఆధారంగా హిందుత్వ పేరుతో ఇక్కడ పాదుకోవాలని చూసే బీజేపీకి – తెలంగాణలో కేసీఆర్ వైఖరి కొరుకుడుపడడం కాస్త కష్టమే! అయినప్పటికీ దేశమంతటా తామే ఉండాలన్న విషయంలో కృతనిశ్చయానికి వచ్చినట్టున్న బీజేపీ – కర్ణాటక తరవాత తన కాలు మోపాడానికి తెలంగాణలో తన శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది.

అయితే ఇక్కడ కేసీఆర్ వ్యతిరేకత ఎంత ఉంది? కరడుగట్టిన హిందూవాదుల్లోనే తప్ప – కానివారిలో ఇంకా కేసీఆర్ పట్ల పెద్దగా వ్యతిరేకత ఉన్నట్టు కనిపించడం లేదు. అలాగని పూర్తిగా జనం కేసీఆర్‌ వైపే ఉన్నారనీ అనుకోలేం. ఎందరో కలలు గన్న ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్‌. ఒకప్పుడు ఎలాంటి గుర్తింపూ లేని తెలంగాణకీ, యాసకీ భాషకీ ఇంత పేరూప్రతిష్ఠా తీసుకొచ్చిన కేసీఆర్‌ పట్ల – ఇప్పుడు ప్రజలకున్న భావం ఏమిటి? తెలంగాణలో మతసామరస్యం చక్కగా పరిఢవిల్లుతున్న ఈ పరిస్థితుల్లో – మతపర నిర్ణయాలు తీసుకునే బీజేపీని వాళ్లు ఎంచుకుంటారా? నిజంగా 2023 లో కేసీఆర్‌ నే మళ్లీ తెలంగాణ పీఠాన్ని ఎక్కిస్తారా? తెలంగాణ బిడ్డనే పీఠం ఎక్కించడం తమ బాధ్యత అని తెలంగాణ ప్రజలు భావిస్తారా? లేక రెండు సార్లు గెలిపించాం చాల్లే అని ఊరుకుంటారా? ఈ విషయాన్ని కాలమే తేల్చి చెప్పాల్సి ఉంది.

అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం వాస్తు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, వాస్తు సరిగ్గా లేదని సెక్రటేరియెట్​ బిల్డింగ్​ను కూల్చడం గురించి కేసీఆర్‌ని విమర్శించారు. వాస్తు సెంటిమెంట్‌ తప్పని 2023 లో నిరూపిస్తాం అన్నారు. హిందూ ధర్మాన్నీ విశ్వాసాల్నీ గౌరవిస్తామని చెప్పే బీజేపీ కేసీఆర్‌ని విమర్శిస్తే విమర్శించవచ్చు. కానీ ఆ విశ్వాసాల్ని విమర్శించడం కరెక్టా? – అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఒకవేళ రేపు కేసీఆర్‌ ఓడి బీజేపీ గెలిస్తే – వాస్తు అన్నదానికి పవర్‌ ఏమీ లేదని బీజేపీయే చెప్పినట్టవుతుంది. దీనికి వారు ఏమంటారో మరి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu