బాలకృష్ణ ఎన్టీఆర్‌లా ఉన్నాడా లేదా?


నిబద్ధతతో నిజమైన ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీసి ఈ తరం జనానికి అందించాలని అనుకుంటే – కథలోని ప్రతి దశలోనూ నటించేందుకు ఎన్టీఆర్‌ పోలికలున్న ఒక్కో వ్యక్తిని తీసుకుని సినిమా తీయాలి. కావాలంటే – సెకండ్‌ హాఫ్‌లో – వయసు మీరిన ఎన్టీఆర్‌ పాత్ర వచ్చేసరికి బాలకృష్ణ రావచ్చు. కానీ – వయసుతో నిమిత్తం లేకుండా – ఎన్టీఆర్‌ చిన్ననాటినుంచీ ప్రతి దశలోనూ ఎన్టీఆర్‌ గా తానే దర్శనమిస్తానంటే ఏమవుతుంది? అంగీకరించడం ప్రేక్షకుడికి కష్టమవుతుంది. అదే జరిగింది.

ఎన్టీఆర్‌ పోలికలున్న కొత్త నటుల్ని ఎవరినైనా – తీసుకువచ్చి ఉంటే – వారిని ఎన్టీఆర్‌ పాత్రలో ఒప్పుకోవడం ప్రేక్షకులకి సులువయ్యేది. లేదూ కొంతకాలంగా తెరమరుగైన ఎవరైనా నటుడుగానీ, లేదా ఎన్టీఆర్‌ కుమారుల్లోనూ మనవల్లోనూ ఆ పోలికలున్న వ్యక్తులుగానీ ఎన్టీఆర్‌ వేషం వేసుకుని తెరమీదకి వచ్చి ఉంటే – జనం వారిలో ఎన్టీఆర్‌ని చూసి ఉండేవారు. కానీ ఇంతకాలం బాలకృష్ణగానే మనకి పరిచయం ఉన్న బాలకృష్ణ – “ఇదుగో ఎన్టీఆర్‌లాగ మారిపోయాను చూడండి ” అంటే ఎలా? అతనేమీ కొంతకాలంగా తెరమరుగైన నటుడు కూడా కాదు. నిత్యం ఏదో సినిమా చేస్తూ బాలకృష్ణగానే జనం అలవాటుపడ్డ వ్యక్తి. అలాంటివాడు హఠాత్తుగా – “నేను నేను కాదు, మా నాన్నని. కాసేపు నన్ను మా నాన్న అనుకోండి” – అంటే ఎలా? అక్కడికీ ఫస్ట్‌ హాఫ్‌ లో ప్రతి పాత్రా బాలకృష్ణ దగ్గరికి వచ్చీ రాగానే – అతన్ని “రామారావ్‌, రామారావ్‌, రామారావ్‌, రామారావ్‌” అని పిలుస్తూ – “ఇతను బాలకృష్ణ కాదు సుమా, ఎన్టీఆర్‌ ” అని జనం అనుకునేందుకు హిప్నటైజ్‌ చేస్తుంటారు. కానీ మొదటి సగం సినిమా మొత్తం వయసు మీరిన బాలకృష్ణలో జనం యంగ్‌ ఎన్టీఆర్‌ని చూడలేకపోయారు. అసలు దర్శకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే – ఎదురుగా కనిపిస్తున్న బాలకృష్ణని మనసులో కొట్టేసి – ఇతను బాలకృష్ణ కాదు, ఎన్టీఆర్‌ అని ప్రతి క్షణం భావిస్తూ ఉండడం – ప్రేక్షకుడికి ఓ పెద్ద మానసిక శ్రమ. ఇదే ఈ సినిమాను దారుణంగా దెబ్బ తీసింది.

అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి – హిప్నాటిజం వర్కవుట్ అయిందో లేదోగానీ, వయసు మీద పడ్డ పాత్రలో బాలకృష్ణ కొన్ని సార్లు ఎన్టీఆర్‌ని గుర్తుచేయగలిగాడని చెప్పవచ్చు. దానవీర శూరకర్ణలాంటి సీన్స్‌లో డైలాగున్ని బాలకృష్ణ చేత చెప్పించడం కాకుండా – అక్కడ డైరెక్ట్‌గా ఎన్టీఆర్‌ వాచకాన్నే పెట్టడం కొంత ఎఫెక్ట్‌ తీసుకువచ్చింది. ఏదేమైనా సినిమా మొత్తం ఎన్టీఆర్‌లాగా కనిపించాల్సిన బాలకృష్ణ – కేవలం ఒకటిరెండుచోట్ల మాత్రమే ఎన్టీఆర్‌ని తలపించడం విషాదకరం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu