బాబూ తనీష్‌, మలయాళంలోకి పోమ్మా!


తనీష్‌

హీరో కావాలనుకునేవాడు అమితాబ్‌లా సన్నగా ఉండాలి. అంజాద్‌ఖాన్‌లా కాదు. అమితాబ్‌ అంజాద్‌ఖాన్‌ అయితే – ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ షోలే అవ్వదు. బిగ్‌ డిజాస్టర్‌ ‘ఆగ్‌’ అవుతుంది.

అప్పుడెప్పుడో మన్మథుడు సినిమాలో చిన్న పిల్లాడిగా కనిపించిన తనీష్‌ హీరోగా సక్సెస్ కాలేకపోవడానికి – ఆయన శరీరం కూడా కొంత కారణమే అని ఒప్పుకోక తప్పదు. నిజమే. లావుగా ఉండడాన్ని విమర్శించకూడదు. అది సంస్కారం కాదు. అది మనిషి శరీరం తీరుని బట్టి ఉంటుంది. కానీ సినిమా అన్నది కమర్షియల్‌ రంగం. వినోదరంగం. కళారంగం. ఇక్కడ కళగా ఉంటేనే తెరమీద కళకళలాడతారు. లేకపోతే తెరవెనక్కి పోతారు. ఏం? తనీష్‌కి మాత్రం ఈ సత్యం తెలీదా? మన్మథుడిలా మారాలని ఉండదా?

లావుగా ఉంటే హీరోలు కారా?

అవును, అసలు లావుగా ఉన్నవాళ్లు హీరోలు అవ్వకూడదా? వాళ్లమీద కామెడీ చేస్తారేంటి? – అనకండి. అలా అయితే వినాయకుడు అని పేరు పెట్టి – రామకృష్ణంరాజుని హీరోగా పెట్టి ( అదేనండీ కృష్ణుడు ) కామెడీ సినిమా ఎందుకు తీశారు? సీరియస్‌ సినిమా తీయచ్చుగా?

ఈ పెరామీటర్స్‌ ఇక్కడికే పరిమితం!

అయినా ఈ లావులూ, సిక్స్‌ ప్యాక్‌ లవ్వులూ మన టాలీవుడ్‌కీ అక్కడ బాలీవుడ్‌ లాంటి కొన్నిటికే పరిమితం. మోహన్‌లాల్‌ ఎంత లావున్నా మలయాళంలో టాప్‌ హీరో. కాదా? అక్కడ మాలీవుడ్‌ అనబడే మలయాళ సినిమా పరిశ్రమలో – హీరోలే కాదు కారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా కొబ్బరి నూనె వల్లో ఏమో – కాస్త కండపట్టి పుష్టిగా కళకళలాడుతూ ఉంటారు. అయినా వాళ్ల కెరీర్‌కి ఎలాంటి ప్రాబ్లెం లేదు. అది రిసీవ్‌ చేసుకునే ప్రేక్షకుల్ని బట్టీ, యాక్టర్‌ టాలెంట్‌ని బట్టీ కూడా ఉంటుంది.

ఉదాహరణకి – మరీ బక్కపలచగా ఉంటేనే ఏ అమ్మాయైనా బాలీవుడ్‌ హీరోయిన్‌ కాగలదు. కానీ కాస్త లావుగా ఉండకపోతే – సౌత్‌లో అస్సలు అంగీకరించరు. నిన్నమొన్నటివరకూ బక్కపలచగా ఉన్న పూజా హెగ్డే కూడా ఇప్పుడు కాస్త లావు అవుతుండడాన్ని మనం గమనించవచ్చు. మన హీరోయిన్లు హిందీవాళ్లకి అతి లావుగా కనిపిస్తారు. హిందీ హీరోయిన్లు మనకి అస్థిపంజరాల్లాగా అనిపిస్తారు – అని అంటారు. అది ఎవరి పొరబాటు? టేస్ట్‌లో భేదం. అంతే!

అందరూ దర్బార్‌ హీరోలా ఉండరు!

డెబ్భై వస్తున్నా సన్నగా చువ్వలా ఉండే రజనీలా ఉండడం అందరికీ సాధ్యం కాదు. తమిళంలో కమల్‌, రజనీ, సూర్య వీళ్లంతా ఫిట్‌ గా ఉండే హీరోలే! కానీ – శివాజీ గణేశన్‌ వారసుడు ప్రభు మాత్రం? మొన్నటిదాకా తమిళంలో హీరోగా లేడా? అక్కడ కూడా పార్దిపన్‌ లాంటివాళ్లంతా శరీరాన్ని పెద్దగా కంట్రోల్లో పెట్టనివాళ్లే! అయినా హీరోలయ్యారు. కాబట్టి మన తనీష్‌ – సెకండ్‌ ఆప్షన్‌గా తమిళం కూడా ట్రై చేయవచ్చు.

చరిత్ర సృష్టిస్తాడా? తిరగరాస్తాడా ?

బాడీ కంట్రోల్లో లేకపోతే నమిత ఐటెమ్‌ సాంగ్‌కయినా పనికొచ్చిందేమోగానీ… తెలుగులో మాత్రం ఎవరూ హీరోలు కాలేరు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ టాలెంట్‌ అతిగా ఉన్నప్పుడు ఇవేవీ పాయింట్లు కావు. చరిత్ర సృష్టించవచ్చు. తిరగేసి రాయచ్చు. చరిత్ర సృష్టించినా మేమే అంటూ తనీష్‌ – మరి లావు టాలెంటెడ్‌ హీరోగా – మోహన్‌లాల్‌ ఆఫ్‌ టాలీవుడ్‌ అనిపించుకుని – టాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాడా? అలా అయితే ఓకే. అంత టాలెంట్‌ మనోడికి ఉందా? ఏమో ఏం చెప్పగలం? పెంచుకోమని కుర్రవాణ్ణి ప్రోత్సహించడం తప్ప? ( పెంచమనేది బాడీ కాదు, టాలెంట్‌! అపార్థాలు వద్దు ప్లీజ్‌! )

కానీ తనీష్‌, ఒక్క విషయం. స్టార్‌ హీరోలని భావించే బాలకృష్ణలాంటివాళ్లే ఒళ్లు తగ్గించి – టామ్‌ హ్యాంక్స్‌ స్టయిల్‌ అంటుంటే – కుర్ర హీరోవి నీకు మాత్రం ఆ మాత్రం ఛాలెంజింగ్‌ మనస్తత్వం ఉండద్దా? ఒళ్లు తగ్గితే హీరోగా టాలీవుడ్‌లో కంటిన్యూ చెయ్‌. కుదరలేదా? అయితే మలయాళంలోకో తమిళంలోకో వెళ్లు. ఇంతకంటే బెస్ట్‌ సలహా స్ట్రయిట్‌గా ఎవరూ ఇవ్వరు నీకు! ఎందుకంటే జనానికి మొహమాటం ఎక్కువ. ఫ్రాంక్‌నెస్ తక్కువ. కానీ తెలుగువాడికి మొహమాటం తక్కువ. ఫ్రాంక్‌నెస్‌ మరీ ఎక్కువ. సో.. ఫాలో అయిపో!

65 / 100 SEO Score

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE