బయోపిక్స్… చరిత్రని చూపేందుకా? మార్చేసేందుకా?

SriRamaNavami

ఇప్పుడు బయోపిక్‌ సీజన్‌ నడుస్తోంది. ‘మహానటి’ హిట్‌ తో ఈ స్పీడ్‌ పెరిగిపోయింది. అక్కడ హిందీలో సంజయ్‌ దత్‌ బయోపిక్‌… ఇక్కడ ఓ పక్క వైఎస్సార్‌ బయోపిక్‌… మరో పక్క ఎన్టీఆర్‌ బయోపిక్‌… ఇలా ఎన్నో! వీటిలో మరొక్క రెండు బయోపిక్స్‌ హిట్‌ గానీ అయ్యాయా… ఇక అంతే సంగతులు. ఇక అక్కడినుంచి – ఎవరు పడితేవాళ్లు ఎవరిమీద పడితే వాళ్ల మీద బయోపిక్‌ లు తీసేయడం ఖాయం.

బయోపిక్‌ అంటే పొగడ్తలు మాత్రమేనా?

అయితే ఈ బయోపిక్‌ లు ఎందుకు తీస్తున్నారు? – అని ఆలోచిస్తే ఎన్నో కోణాలు ఆలోచించాల్సి వస్తుంది. పాత వ్యక్తుల జీవితాల్ని … ఒక బయోపిక్ లాగా తీసి పడేస్తే – అది ఓ పుస్తకం మాదిరిగా చరిత్రగా నిలిచిపోతుందన్నది కొందరి ఉద్దేశం. మనం గొప్పవాళ్లనుకునే అందరి జీవితాలూ నిజంగా ప్రతి క్షణం గొప్పగా ఉన్నాయని అనుకోలేం. అయితే – జనంలో వాళ్లకున్న ఇమేజ్‌ని ఆధారంగా చేసుకుని ఓ బయోపిక్‌ తీసేయడం వల్ల ఏం జరుగుతుందంటే – వాళ్ల జీవితంలో జరిగిన కొన్ని నిజాలు కప్పుబడిపోయి, అందమైన అబద్ధాలు కొన్ని రిజిస్టర్ అయిపోయి, నిజాల్లాగ మారిపోయి చరిత్రలో పడి ఉండిపోతాయి. అందుకే చరిత్రలోని సత్యాసత్యాల్ని పట్టించుకోకుండా – కేవలం పొగడ్తలతో అతిశయోక్తులతో బయోపిక్స్‌ తీసేస్తుంటే – వారిని జనం గమనించాల్సి ఉంది.

ఈ బయోపిక్స్‌ లో నిజాయతీ ఉందా?

బయోపిక్స్ తీయడం మంచిదే, వాటితో జనానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడమూ మంచిదే! కానీ ప్రతి మనిషి జీవితంలోనూ మంచీ, చెడూ రెండూ ఉంటాయి. అయితే, నిజాయితీగా బయోపిక్ తీయగలిగేవాళ్లు, తీస్తున్నవాళ్లు ఎవరు? ఒకవేళ నిజాయితీగా ఒకరి బయోపిక్‌ తీద్దామన్నా – ఆ వ్యక్తిలోని చెడుని చూపించే పరిస్థితి లేదు. ఒక వ్యక్తి జీవితంలోని చెడు పాయింట్లని ఏ మాత్రం సినిమాలో చూపించినా… వాళ్ళ బంధువులో అభిమానులో నానా గొడవ చేస్తారు. పొగిడితే మాత్రం – ఇదే అసలైన బయోపిక్‌ అని మెచ్చుకుంటారు. కాబట్టి బయోపిక్స్‌లో ఇప్పుడు మేనేజ్‌మెంట్‌ ఎక్కువయింది. అందుకే వీటిలో నిజంగా నిజాయితీ ఉందా… అని ప్రశ్నిస్తే, కచ్చితంగా లేదనే చెప్పాల్సి వస్తుంది.

టైటిల్‌ రోల్‌ జస్టిఫికేషన్‌ కోసం మిగతా కారెక్టర్లు బలి!

ఉదాహరణకి ‘మహానటి’ విషయం తీసుకుందాం. సావిత్రి సినిమా టైటిల్‌ రోల్‌ కాబట్టి ఏమో… ఆమె పాత్రని సినిమాలో మరీ గొప్పగా చూపించారు. నటన విషయం వరకూ ఆమె గ్రేటే! కానీ వ్యక్తిగతంగా చూస్తే సావిత్రి పొరబాట్లు ఇన్నీ అన్నీ కావని – తెలిసినవాళ్లు అంటారు. బయోపిక్‌ ఆమె పేరు మీద ఉంది కాబట్టి – ఆ పాత్రనొక్కదాన్నీ ఎలివేట్‌ చేసేందుకు – మిగిలిన పాత్రల్నీ సత్యాసత్యాల్నీ తొక్కేయడం కరెక్టా? ఉదా.కి సావిత్రి తన ఇంటి చుట్టూ మల్లెపూలు పూయించేదనీ, ఆ మల్లె తీగల బాగోగుల్నే తప్ప – తన ఇంటిలోని మనుషుల బాగోగుల్ని పట్టించుకునేది కాదనీ గతంలో ఒక జర్నలిస్ట్‌ ఒక పత్రికలో రాశాడు. సావిత్రి ఎప్పుడూ సినిమాల్లో బిజీ కావడం వల్ల – జెమినీ గణేశనే తన పిల్లల బాగోగులన్నీ చూసుకునేవాడనీ, పిల్లలకి నిత్యం స్నానం చేయించడం, జడ వేయడం దగ్గర్నించీ ఆయనే చూసుకోవాల్సి వచ్చేదనీ కూడా పత్రికల్లో వచ్చింది. మరి ఎంతో బిజీగా, అందువల్ల బాధ్యతారహితంగా ఉన్న సావిత్రికి ఎంతో సపోర్టిచ్చిన జెమినీ గణేశన్‌ – తన పిల్లల పట్ల బాధ్యతతోనే ఉన్నాడన్న విషయాన్ని – మహానటి సినిమాలో కనీసం ప్రస్తావించనే లేదు. ఎందుకంటే సినిమా సావిత్రినే హీరోయిన్‌గా చూపాలి కాబట్టి!

ఒక వైపే చూడాలా?

అలాగే రేపు ఎన్టీఆర్‌ సినిమా రాబోతోంది. దానినిండా ఎన్టీఆర్‌ ఇంతటివాడు, అంతటివాడు అంటూ పొగడ్తలు… దాదాపు అవతారపురుషుడే అన్న స్థాయిలో అతిశయోక్తులు తప్పనిసరిగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్‌ నిజంగా గొప్పవాడే! కానీ ఆయన జీవితంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ మంచి మాత్రమే ఉందా? ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదా? కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేయలేదా? అసలు సూపర్‌ స్టార్‌ కృష్ణ – ఎన్టీఆర్‌ చర్యల్ని వ్యతిరేకిస్తూ తీసిన సినిమాలే ఎన్నో ఉన్నాయి. నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, కలియుగ విశ్వామిత్ర, సాహసమే నా ఊపిరి, గండిపేట రహస్యం, రిక్షావాలా, రాజకీయ చదరంగం – ఇలా ఏది చూసినా అప్పట్లో ఎన్టీఆర్‌ కి ఉన్న రెండో పార్శ్వం కనిపిస్తుంది. మరి ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఎవరు తీసినా ఈ విషయాల్ని… కనీసం టచ్‌ అయినా చేయనిస్తారా? లేదని నిర్ద్వంద్వంగా చెప్పచ్చు. రామ్‌ గోపాల్‌ వర్మలాంటి దమ్మున్న వ్యక్తి ముందుకొచ్చినా – లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీయే ఆగిపోయింది. ఇక అఫిషియల్‌ గా తీసే బయోపిక్‌ లో అతిశయోక్తులూ పొగడ్తలూ కాక – విమర్శలూ నిష్పక్షపాతమైన కామెంట్లూ ఉంటాయని అనుకుంటే – అది వట్టి భ్రమ!

బయోపిక్‌ ఎందుకు? భజన చాలు!

అయితే ఇక్కడ కొందరు ఓ మాట అంటున్నారు. పోయినోళ్లు అందరూ పూర్తి మంచోళ్లేమీ కాదు. కానీ గొప్పవాళ్ల చరిత్ర మననం చేసుకునేటప్పుడు – వాళ్లలోని చెడుని గుర్తు తెచ్చుకోవడం ఎందుకు? కేవలం నాలుగు మంచి మాటలు చెప్పుకుంటే సరిపోతుంది కదా? – అన్నది వాళ్ల వాదన.
ఎలాంటి వ్యక్తి అయినా – మరణించిన రోజున ఎవరూ వారి గురించి చెడుగా మాట్లాడరు. కానీ కాలం గడిచేకొద్దీ కామెంట్స్‌ బయటికి వస్తాయి. ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా – చరిత్రలోని సత్యాలు మారవు కదా? కేవలం వాళ్లలోని మంచి విషయాలే చెప్పుకుంటూ సినిమా తీస్తే – అది భజన అవుతుంది తప్ప బయోపిక్‌ అవ్వదు. బయోపిక్‌ అన్నది ఒక జీవితంలోని మంచి చెడుల్నీ వెలుగు నీడల్నీ – రెండింటినీ చూపాలి తప్ప – గ్రేట్‌ గ్రేట్‌ గ్రేట్‌ గ్రేట్‌ అంటూ భజన చేయకూడదు. ఇపుడు బయోపిక్స్‌ పేరుతో జరుగుతున్నది ఇదే !

బయోపిక్‌ అంటే కథ… చరిత్ర కాదు!

కాబట్టి – నేటి బయోపిక్స్‌ని జనం కేవలం ఏదో వినోదంగా చూడాలి తప్ప, ఇవి ఏదో చరిత్రకు ప్రతీకలు, నిజమైన చారిత్రక సత్యాల్ని రికార్డ్ చేసిన న్యూస్‌పేపర్‌లాంటి మాధ్యమాల లాంటివని అనుకోకూడదు. ప్రస్తుతం బయోపిక్స్‌ తీసేవాళ్ల ఉద్దేశం ఒక్కటే! – ఎవరినీ నొప్పించకుండా, ఏ గొడవా రాకుండా సినిమా తీయడం, వాళ్ల జీవితంలో ఏవైనా కాంట్రవర్సీలుంటే టచ్ చేయకుండా ఉండడం, మరీ టచ్‌ చేయకపోతే జనానికి ఆసక్తి ఉండదనుకుంటే – గోడమీద పిల్లిలా – వాళ్ల తప్పులు కూడా కరెక్టే అని అనిపించేలా ఏదో రీజన్‌ చూపించి మేనేజ్ చేయడం, ఆ విధంగా సినిమాను ఆడించుకోవడం, ఫైనల్‌ గా … వాళ్లకి జనంలో ఉన్న ఇమేజ్‌ తో డబ్బులు సంపాదించుకోవడం! మరి ఇలాంటి లక్ష్యాలతో తీసే బయోపిక్స్‌ లో నిజాయతీ ఎలా ఉంటుంది? అందుకే అవి జస్ట్‌… అబద్ధాల ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాకేజిల్లా మిగిలిపోతున్నాయి.

తీయరు… తీయనివ్వరు!

పోనీ ఎవరైనా రాంగోపాల్ వర్మ లాంటి ధైర్యం, దమ్మూ ఉన్న వ్యక్తులు ఫ్రాంక్‌గా ఎవరి బయోపిక్ అయినా తీస్తామని అన్నా… వాళ్ళకు ఎన్నో అడ్డంకులు ఎదురవడం ఖాయం. మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని అన్నప్పుడు – తెలుగుదేశం లీడర్ల నుంచి ఎన్టీఆర్ అభిమానుల వరకూ అందరూ వర్మ మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు లేటెస్ట్ గా “సంజయ్ దత్ మీద అసలైన బయోపిక్ నేను తీస్తాను.. నేను చెప్పబోయేదే నిజమైన స్టోరీ!” అంటూ వర్మ ధైర్యంగా ప్రకటించాడు. అదుగో… అప్పటినుంచీ బాలీవుడ్ అంతా ఆయన మీద విరుచుకుపడుతోంది.

చరిత్ర మార్చేస్తారు, జాగ్రత్త!

నిజానికి బయోపిక్ అన్నది ఒక నిజమైన జీవిత చిత్రణలాగా ఉండాలి. గడిచిపోయిన ఆ వ్యక్తి జీవితం ఎలా ఉండేదో ప్రేక్షకుడు ఫీల్ అవడం కోసం అక్కడక్కడా కొంచెం డ్రామా యాడ్ చేసినా ఫరవాలేదు కానీ, పూర్తిగా సత్యాన్ని వక్రీకరించి, అసత్యాన్ని చరిత్రలో శిలాక్షరంగా మార్చేయాలనే ఉద్దేశంతో బయోపిక్స్‌ తీస్తున్న వాళ్లని మాత్రం జనం తిప్పికొట్టాల్సిందే. అలాగే – వర్మలా ధైర్యంగా బయోపిక్స్ తీసేవారికి స్వాగతం పలకాలి. లేకపోతే రేపు చోటామోటా లీడర్ల నుంచి గల్లీ రౌడీల వరకూ అందరూ తమ గురించీ తమ కుటుంబాల్లోని వ్యక్తుల గురించీ బయోపిక్స్ తీయించుకుని – చరిత్రలో మహాత్మాగాంధీకి కూడా పోటీ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే – జనం కూడా తమ దృక్కోణాన్ని మార్చుకోవాలి. ఇప్పుడొస్తున్న బయోపిక్స్‌ని ఏదో ఓ కథలా ఎంజాయ్ చెయ్యాలి. అంతేగానీ అదేదో చరిత్ర .. అందులో అన్నీ నిజాలే అనే భ్రమ కలిగించుకోకూడదు. అవన్నీ యథాతథంగా ఒప్పుకోకూడదు. అలా ఒప్పుకుంటే – క్రమంగా చరిత్ర మొత్తం మార్చేయడానికి బయోపిక్‌ క్రియేటర్లంతా సిద్ధంగా ఉన్నారు. తస్మాత్‌ జాగ్రత్త!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu