ఫేస్‌ బుక్‌ మనిషికి ఇచ్చే విలువ పది పైసలు!


ఒక మనిషిగా మీకు ఫేస్‌బుక్ ఇచ్చే విలువ ఎంతో తెలుసా? కేవలం 10 పైసలు. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం. ఫేస్‌బుక్ తన కస్టమర్ల నంబర్‌నే కాదు,  వారి సోషల్ బిహేవియర్‌ని, వాళ్ళ ఆసక్తులనూ కూడా సొమ్ము చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు మీకు ఫేస్‌బుక్‌లో ఒక పేజీ ఉందనుకోండి, గతంలో అయితే ఆ పేజీ ఫ్రీగా అందరికీ చేరువయ్యేలా స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండేది. ఇప్పుడలా లేదు. పేజీకి లైక్స్ కావాలంటే, అంతా ఫేస్‌బుక్ నియంత్రణ మీద ఆధారపడాల్సిందే! అది ఎంత పబ్లిక్‌ ప్లాట్‌ ఫాం అయినా పగ్గాలు మొత్తం ఫేస్‌బుక్‌ చేతిలోనే ఉన్నాయిప్పుడు.

అదీ మన విలువ!

మన పేజ్‌ ఒకవేళ ఒక లిమిట్ దాటి ఎక్కువమందికి రీచ్‌ అవుతోందనుకోండి. ఫేస్‌బుక్‌ కోడ్‌ దాన్ని నియంత్రించి మరింత ఎక్కువ మందికి చేరకుండా ఆపేస్తుంది. సాధారణంగా ఈ పరిమితి ఎంత ఉంటుందీ అంటే – మీ పేజ్‌ లైక్స్‌ ఎన్ని ఉన్నాయో అందులో పదో వంతు మాత్రమే! అంటే ఉదాహరణకి మీ ఫేస్‌ బుక్‌ పేజీకి 1000 లైక్స్‌ ఉన్నాయనుకోండి. మీరు పోస్ట్‌ చేసిన ఎంత గొప్ప పోస్ట్‌ అయినా వందకు మించి జనానికి చేరదు. అలా చేరాలంటే మనం ఫేస్‌బుక్‌ కి డబ్బుకట్టి ఆ పోస్ట్‌ని ప్రమోట్‌ చేయాలి. పోస్టులకి మాత్రమే కాదు, పేజ్‌ ప్రమోషన్‌కి కూడా ప్రత్యేకించి డబ్బు కట్టాల్సిందే!  అలాగే మీకు ఒక వెబ్‌సైట్‌ ఉండి, దానికి సంబంధించి ఒక ఫేస్‌బుక్‌ పేజ్‌ క్రియేట్ చేసి, ఫేస్‌బుక్‌ లైకర్స్ ద్వారా వెబ్‌సైట్‌ ప్రమోట్‌ చేసుకోదలచుకున్నా పరిమితులు తప్పవు. దానికీ ప్రత్యేకంగా డబ్బు పే చేయాల్సిందే!

ఇవీ ఫేస్‌బుక్‌ విలువలు!

డబ్బులు కడితేనే మన పేజీలూ పోస్టులూ ప్రమోట్ అయ్యేలా చేస్తూ ఫేస్‌బుక్‌ మొత్తం అన్ని సహజమైన మార్గాలనూ అదుపుచేసి పడేసింది. ఉదాహరణకి 20 డాలర్లు కడితే – మీ ఫలానా పోస్టు మరో 14 వేల మందికి చేరే అవకాశం ఉందని ఫేస్‌బుక్ చెబుతుంది. అంటే 14 వేలమందికి చేరాలంటే మనం 20 డాలర్లు కట్టాలి. అంటే ఒక డాలర్‌ ఖర్చుకి మీ పోస్టు 700 మందిని చేరుతుంది. ఒక డాలర్ అంటే, మన భారతీయ కరెన్సీలో దాదాపు 70 రూపాయలు. ఇంత చెల్లిస్తే 700 మందికి మీ పోస్ట్ చేరుతుంది. అంటే మనం ఒక రూపాయి కడితే మనకి వచ్చే లైక్స్‌ 10. అంటే వాడు అడిగిన 20 డాలర్లు .. అంటే 1400 రూపాయలు మనం కడితే 14000 లైక్స్ వస్తాయి. ఈ ఈ లెక్కన చూస్తే – ఫేస్‌బుక్‌ లైక్‌ల ప్రకారం ఒకొక్క మనిషి విలువ 10 పైసలన్నమాట. ఒక మనిషిగా మీకు ఫేస్‌బుక్ ఇచ్చే విలువ ఎంతో తెలుసా? కేవలం 10 పైసలు. అన్నాం కదా అని అది పెరగాలని కోరుకోకండి. ఆ రేటు పెరిగితే లైకులూ ప్రమోషన్ల పేరు చెప్పి మిమ్మల్నీ మీ టేస్ట్‌నీ మరింత రేటుకి అమ్ముకుంటాడు ఫేస్‌బుక్‌ వాడు.

ఇలా చేయడం సోషలా?

సోషల్ ప్లాట్‌ఫాంలు నిజంగా ఎంతో గొప్పవి. మామూలు ప్లాట్‌ఫాంలు లేనివాళ్లకి అవి కచ్చితంగా గొప్ప మార్గాలు. ఎందుకంటే కోట్లు ఖర్చుపెట్టి ఒక ఛానెల్‌ పెట్టలేనివాడు ఒక యూట్యూబ్‌ ఛానెల్లో తన అభిప్రాయాలు చెప్పవచ్చు. ఒక పేపర్లో ఆర్టికల్ రాసే అవకాశం లేనివాడు ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. సామాన్యుడికి లభించిన ఈ స్వాతంత్రమే సోషల్‌ మీడియాకి ఎంతో విలువను పెంచింది.  అవి ఇంతగా ఎదిగేందుకు దోహదపడింది. కానీ అక్కడ కూడా డబ్బు తాలూకు పరిమితులు ఏర్పరచడం కరెక్ట్‌ కాదు. ఒకడు ఒక సమాచారాన్ని పోస్ట్ చేసినప్పుడు దాన్ని ఫ్రీగా వదిలేస్తే – అది ఎంతమందికి రీచ్‌ అవుతుందన్నది దాని లోని విషయాన్ని బట్టి ఉంటుంది. రీచ్‌ అయినవారికి నచ్చితే అది షేర్‌ అయి మరింత పాపులర్‌ అవుతుంది. అంతే గానీ… అసలు పేజ్ లైక్‌ చేసినవారందరికీ కూడా రీచ్‌ కాకుండా రీచ్‌ కాకుండా బలవంతంగా ఆపేయడం, మీరు డబ్బు కడితేనే  ఇతరులకు చేరుస్తాం – అనడం కంటెంట్‌ విలువను కిల్‌ చేయడమే! ఇది సోషల్‌ మీడియా స్ఫూర్తికే విరుద్ధమని చెప్పాలి.

మనం ఏం చేయాలి?

అయితే ఇప్పటికీ సోషల్ మీడియా స్వేచ్ఛాయుతమైనదే. ఎవరైనా అలాంటి మరో ప్లాట్‌ఫాం పెట్టి పాపులర్‌ కావచ్చు. కానీ ఒక్కసారి దిగ్గజాల్లా ఎదిగిన తరవాత వాటికి పోటీగా కొత్తవి పెట్టినా – జనంలోకి తీసుకువెళ్లడం కష్టమవుతుంది. అదే ఫేస్‌బుక్‌కీ, గూగుల్‌కీ తిరుగులేని బలంగా మారుతోంది. కాబట్టి – జనం చేయాల్సింది ఏంటీ అంటే – ఏ కొత్త సోషల్‌ ప్లాట్‌ఫాం వచ్చినా – దాంట్లో నిజాయతీ, కొత్తదనం, ప్రజలకి ఉపయోగపడే విషయం కనిపిస్తే – అది చిన్నదా పెద్దదా అని చూడకుండా దాన్ని ప్రోత్సహించాలి. ఇదే మనం చేయగలిగింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఎదిగింది కూడా ఇలాగే కదా మరి?

 

56 / 100 SEO Score


ADVERTISE HERE