పాపం ఎంత కష్టమొచ్చిందిరా నేతా…


ఎన్నికలొస్తే చాలు అందరూ లీడర్లను ప్రశ్నించేవాళ్ళే… పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? తమ పదవులు, హోదాల్ని కాపాడుకుని… సుఖభోగాల్ని అనుభవించాలంటే అందుకు తగ్గ వాతావరణం ఉన్న పార్టీలోకే కదా జంప్ చెయ్యాలి? ఏ పార్టీలోకి జంప్ అవ్వాలా… అని కాస్త తమ కాళ్ళు అటో.. ఇటో.. కదిపితే చాలు ‘జంప్ జిలానీ’ అని పేరు పెట్టేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతారో లేదో తెలీదుగానీ ఓటర్ల దృష్టిలో మాత్రం ముందుగా ‘జంప్ జిలానీ’లవుతారు.

మరి ఓటర్లు మాత్రం తక్కువ తింటున్నారా? ఎన్నికలప్పుడు ఏ పార్టీ నేత నుంచి ఎక్కువ అందితే ఆ పార్టీ వైపు జంప్ అయిపోవడం లేదా?… మందు, బిర్యానీ ప్యాకెట్, కాస్తయినా డబ్బులివ్వలేని అభ్యర్థికి ఓటివ్వరు సరికదా… నువ్వూ ఒక రాజకీయనాయకుడివేనా.. అంటూ ఛీత్కారంగా ఒక లుక్ ఇస్తారు. ఇలాంటి ‘మామూలు’ ఓటర్ల కోసమే కదా… పాపం మన రాజకీయ నాయకులు మూటలు మూటలుగా కరెన్సీని సర్దుబాటు చేసుకుని జనంతో నానా మాటలు పడాల్సి వస్తోంది?

ఓటర్లే గనుక అత్యాశ లేనివాళ్ళయి ఉంటే మన రాజకీయ నాయకులు అవినీతిపరులనే పేరు సంపాదించుకుని ఉండేవారు కారు కదా? ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వద్దామనుకుంటే… సంపాదించుకున్నది కాస్తా ఓట్ల కోసం పంచిపెట్టి గద్దెనెక్కాక… ఒక ఐదేళ్ళ పాటు కబ్జాలు చేసుకునో… దందాలు చేసుకునో… నానా గడ్డీ తినో కూడబెట్టేది ఎందుకు? మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు పంచడం కోసమే కదా… ఇంత త్యాగనిరతితో ఉన్న రాజకీయ నాయకుల్ని చెడ్డోళ్ళంటారేం?

మొన్నటికి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం జరిగింది? జనానికి డబ్బులు పంచి నాలుగు ఓట్ల సంపాదించండర్రా అని అభ్యర్థులు తమ అనుచరుల చేతికి డబ్బులిచ్చారట. వాళ్ళేమో అంతా పంచకుండా ఏవో నాలుగు కాసులు విసిరేసి, మరో నాలుగు రాళ్ళు వెనకేసుకున్నారట. ఈ విషయం ఎలక్షన్లయిపోయి, రిజల్ట్స్ వచ్చాక ఓటర్లకు తెలిసింది. అంతే అగ్గిమీద గుగ్గిలం లాగా అయిపోయారు. దుర్మార్గులారా… మల్లెపూల్లాంటి మా రాజకీయ నాయకులు మాకు పంచడం కోసం మీకు డబ్బులిస్తే… అవి మాకు అందకుండా మీరే మింగేస్తారా? అంటూ వాళ్ళ అనుచరుల్ని బొక్కలిరగదీసి తన్నారట. పోనీ గెలిచిన అభ్యర్థి అనుచరుల్ని మాత్రమే కొట్టారా… అంటే, అలాంటి తేడా ఏదీ చూపించలేదంట ఓటర్లు. ఓడిన అభ్యర్థి అనుచరుల్ని కూడా కుమ్మేశారంట.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE