పవన్‌ రేణులపై పాపిష్ఠి రాతలు!

SriRamaNavami

“అప్పుడు పవన్ అంగీకరించలేదు ఇప్పుడు నా కోరికలు తీర్చుకుంటా – రేణు దేశాయ్” ఇదీ వెబ్‌ లో ఓ ఆర్టికల్‌ టైటిల్‌. చదివిన ఎవరికైనా ఏమనిపిస్తుంది? సబ్జెక్టు దేనిగురించి అని అనిపిస్తుంది? నిజానికి ఈ వార్తలో తప్పుడు అర్థం ఏమీ లేదు. వార్త చదివితే ఆ విషయం అర్థమవుతుంది. చదివితే గానీ అర్థం కాదు. అదే నేటి సో-కాల్డ్‌ సోషల్‌ జర్నలిస్టుల రచనా చమత్కృతి!

వెబ్‌సైట్లూ, యూట్యూబ్ ఛానల్సూ రోజురోజుకీ ఎక్కువైపోయి, జర్నలిస్టుల అవసరం పెరిగిపోయి, నాలుగు అక్షరాలు తెలిసిన ప్రతీవాడూ తాను జర్నలిస్ట్‌నే అని భావిస్తున్న రోజులివి. అయితే జర్నలిజం అంటే జనాన్ని ఆకట్టుకునేలా వార్తలు రాయడం కాదు. దానికి కొన్ని పరిమితులుంటాయి.

మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్‌లో, వెబ్‌సైట్స్‌లో కూడా నిజాయితీ స్వచ్ఛత తగ్గిపోయినప్పటికీ ఇప్పటికీ అనేక మీడియా సంస్థలు కొన్ని కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయి. అయితే ఇప్పుడు కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చిన సోషల్‌ సైట్లు, యూట్యూబ్‌ ఛానెల్స్‌ లో రాస్తున్న చాలామంది – జర్నలిజం తాలూకు ప్రాథమిక శిక్షణ కూడా లేని వ్యక్తులే! ఏది నీతి, ఏది అతి, ఏది ఆకర్షణ, ఏది ఆక్షేపణ అనే అవగాహన లేని వీరిలో చాలామంది – భాష పట్ల కూడా కనీస జ్ఞానం లేని వ్యక్తులు. వీళ్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన మీడియా సంస్థల్లో చేరి – మొత్తం జర్నలిజాన్ని భ్రష్ఠుపట్టిస్తున్నారని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. దీనికి తాజా ఉదాహరణే ఈ టైటిల్‌.

ఆకర్షణ కోసం పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టే పద్ధతి ఈ మధ్యకాలంలో పెరిగింది. అది రాను రాను మరి వెర్రితలలు వేస్తోంది. రేణుదేశాయ్ తన రెండో పెళ్లి గురించి చెబుతూ ఒక వెబ్‌సైట్‌ ఈ ఘోరమైన టైటిల్ పెట్టింది. ఆ టైటిల్ ఏంటో తెలుసా? గతంలో పవన్ ను పెళ్లి చేసుకున్నప్పుడు రేణు దేశాయ్ – గ్రాండ్‌ గా మెహందీ ఫంక్షన్ చేయాలని అనుకుందట. కానీ అప్పుడు పవన్ ఒప్పుకోలేదట. ఇప్పుడు ఈ రెండో పెళ్లి ద్వారా అలాంటి చిన్న కోరికలు తీర్చుకోబోతున్నాను – అని రేణుదేశాయ్ చెప్పింది. అదీ విషయం!

అయితే ఈ చిన్న విషయాన్ని ఏదో బూతు అర్థం వచ్చేలా టైటిల్ పెట్టి ఆకర్షించే ప్రయత్నం చేశారన్నమాట సదరు జర్నలిస్ట్‌ గారు! అసలు బూతు టైటిల్స్ పెడితేనే జనం క్లిక్ చేస్తారు అనే పరిస్థితి నుంచి వెబ్‌సైట్లూ ఛానెల్సూ బయటపడాలి. అలాగే ఎంత ఆసక్తి కలిగించేలా ఉన్నప్పటికీ అశ్లీలంగా ఉన్న టైటిల్స్‌ని ప్రోత్సహించటం జనం కూడా మానుకోవాలి. టైటిల్‌ లో సూచించినదేదీ లోపల ఉండదని కనీసం కొంతకాలానికైనా గుర్తించాలి. ఆ వెబ్‌సైట్‌ లేదా ఛానెల్‌ ఎలాంటిదో అనుభవం ద్వారా గ్రహించి, వాటిని పూర్తిగా బహిష్కరించాలి. లేకపోతే జర్నలిజం రోజురోజుకీ భ్రష్ఠుపట్టిపోతుంది.

ఇంతకీ ఇంత నీచమైన టైటిల్‌ పెట్టిన ఆ వెబ్‌సైట్‌ ఏంటో తెలుసా? అదేం చిన్నా చితకా చిల్లరమల్లర సైట్‌ కాదు. దక్షిణాదిలోనే ప్రముఖమైన పేరున్న, కేరళకు చెందిన ఛానెల్ వారి తెలుగు వెర్షన్‌ వెబ్‌సైట్‌. మరి పేరున్న ఇలాంటి సంస్థలే ఇలాంటి నీచత్వాన్ని ప్రోత్సహిస్తుంటే చిల్లర మల్లర వెబ్‌సైట్స్‌ ఎంత చిందులేస్తాయో ఊహించడం కష్టం కాదు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu