నిజామాబాద్‌లో యు టర్న్


నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణ ఎన్నికల సంఘానికి కత్తిమీద సాములా మారింది. క్షణం విరామం లేకుండా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, సిబ్బంది కుస్తీ పడుతున్నారు. ఆ నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందువల్ల ప్రతీ పోలింగ్ కేంద్రంలో పన్నెండు ఈవీఎంలను నెలకొల్పాల్సి వస్తోంది. రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో 1788 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు, సమయాన్ని ఆదా చేసుకునేందుకు గతంలో పేర్కొన్న యు ఆకారంలో ఈవీఎంలను, వీవీప్యాట్ యంత్రాన్ని నెలకొల్పాలన్న ప్లాన్ లో స్వల్ప మార్పులు చేసిన ఎన్నికల అధికారులు ఎల్ ఆకారంలో ఒక వైపు ఆరు ఈవీఎంలను, ఆ తర్వాత వీవీ ప్యాట్ ను, మరో దిశలో ఆరు ఈవీఎంలను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వివరించారు. యు ఆకారానికి బదులుగా ఎల్ ఆకారంలో ఈవీఎంలను అమరుస్తున్నట్లు స్పష్టం చేశారు.

మూడు రోజుల ముందుగానే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు

సాధారణంగా ఒక్క రోజు ముందుగానే ఈవీఎంలు అసెంబ్లీ నియోజక వర్గాలకు చేరుకుంటాయి. ఆ తర్వాత రాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. కానీ నిజామాబాద్ విషయంలో మాత్రం ఈ నెల 7, 8 తేదీకల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాలకు తరలించి తొమ్మిదవ తేదీకల్లా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. కేవలం ఈ ఒక్క నియోజకవర్గం కోసమే రెట్టింపు సంఖ్యలో బ్యాలట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలను సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య 1788 అయినప్పటికీ 3530 కంట్రోల్ యూనిట్లను, 3651 వీవీప్యాట్ యంత్రాలను, 27,185 బ్యాలట్ యూనిట్లను రప్పిస్తున్నామని తెలిపారు.

7వ తేదీన రెండో స్థాయి తనిఖీలు

ఈవీఎంలను హెచ్చు సంఖ్యలో వినియోగిస్తున్నందున వాటిని అభ్యర్థులు, రాజకీయ పార్టీల సమక్షంలో తనిఖీలు చేపట్టడం (సీల్ ఓపెన్ చేయడం), బ్యాలట్ పేపర్ బ్యాలట్ యూనిట్ పై అతికించడం, మాక్ పోలింగ్ నిర్వహించడం తదితర అవసరాల కోసం సుమారు 200 మందికి పైగా సరిపోయేంత స్థలం ప్రభుత్వానికి చెందిన విభాగాల దగ్గర లేనందువల్ల తగిన భద్రత కల్పించి ప్రైవేటు ఫంక్షన్ హాళ్ళను నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలో వినియోగించనున్నట్లు రజత్ కుమార్ వివరించారు. ఏడవ తేదీన ఈ ప్రక్రియను పూర్తి చేసి వారి సమక్షంలోనే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించేలా రెండవ స్థాయిలో రాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని, తొమ్మదివ తేదీ నాటికి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మూడవ రాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.

నేడు మళ్ళీ సీఈఓ పర్యటన

ఎన్నికల సందర్భంగా కీలకమైన నియోజకవర్గాల్లో రాష్ట్ర సీఈఓ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించడం ఆనవాయితీ అయినా, నిజామాబాద్ నియోజకవర్గంలో ఏకంగా 185 మంది పోటీ చేస్తున్నందున ఇప్పటికే ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన చేసిన రజత్ కుమార్ శుక్రవారం మళ్ళీ పర్యటించనున్నారు. మరే నియోజకవర్గంకంటే నిజామాబాద్ ఏర్పాట్లు ఎన్నికల సంఘానికి సవాలుగా మారాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా అది దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తుందన్న భయం ఎన్నికల సిబ్బందిని వెంటాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తుండడంతో అధికార పార్టీ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా అంతే దృష్టి చూపుతున్నారు.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE