నంబర్‌ మారదు! నిర్ణయం మారదు!

SriRamaNavami

మొన్న చెప్పిన 105 అభ్యర్థులే ఫైనల్‌ అని కేసీఆర్ మళ్లీ చెప్పారు. అసలు 105 సీట్లలో ఒక్కసారిగా అభ్యర్థులను ప్రకటించడం ఒక సంచలనమైతే, ఒక దశ ప్రచారం పూర్తయ్యే సమయానికి – మారతాయనుకుని అనుమానించిన సీట్లలో మార్పులేవీ ఉండవంటూ ఖరారు చేసి – “నో మార్పు… ఇవే ఫైనల్ ! “- అని చెప్పడం మరో సంచలనం అని చెప్పాలి.

ముందస్తు ఎన్నికల వ్యూహంతో సీట్లలో ఏకంగా 90 శాతం వరకూ అభ్యర్థుల్ని ముందస్తుగా ప్రకటించేయడం నిజంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వ ప్రతిభకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే – అంతమందిని ఒక్కసారి ప్రకటించడం జరిగిన తరవాత అంతర్గతంగా అల్లకల్లోలం జరిగి, పార్టీయే ఛిన్నాభిన్నం అయిపోయే పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కానీ, కేసీఆర్ అంత ఓపెన్‌గా, అంత స్పష్టంగా – అన్ని ఎక్కువ సీట్లను ప్రకటించినప్పటికీ, ఏవో లోపల చిన్న చిన్న లుకలుకలూ, అసంతృప్తి వెలిబుచ్చడాలూ తప్ప – పైకి గట్టిగా మాట్లాడిన అభ్యర్థులే లేరు. దీన్ని బట్టి కేసీఆర్‌కి పార్టీ మీద ఎంత నియంత్రణ ఉందో అర్థమవుతోంది.

సాధారణంగా పార్టీ లీడర్లు ఫలానా సీటు ఇతనికా.. అతనికా.. అనే సందిగ్ధం మెయిన్‌టెయిన్ చేస్తూ, చివరివరకూ ఊరిస్తూ ఎవరినీ కోల్పోకుండా బుజ్జగిస్తూ – ఏవో ప్లాన్స్ వేస్తుంటారు. మొన్న కూడా కేసీఆర్ ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు అదొక సంచలనమని భావించినప్పటికీ, చాలామంది – ఇలా చేస్తే పార్టీలో ఎన్నో లుకలుకలు బయల్దేరతాయి.. అసంతృప్తులందరూ జంపింగులు మొదలుపెడతారు.. టీఆరెస్ అల్లకల్లోలం అయిపోతుందని భావించారు. కేసీఆర్ కచ్చితంగా కొన్ని స్థానాలయినా మార్చక తప్పదు… ఏదో సంచలనం కోసం మొదట 105 అని ప్రకటించారు గానీ, తరవాత కొన్నయినా మార్చుకోక తప్పదు… అనే భావన వెలిబుచ్చారు. కానీ వాళ్ల ఊహలన్నీ తప్పని నిరూపిస్తూ కేసీఆర్ తను చెప్పిన 105 నే ఫైనల్ చేశారు. ప్రతిపక్షాలు ఇదొక నియంతృత్వ ధోరణి అని విమర్శిస్తే విమర్శించవచ్చు గాక. కానీ ఒక నాయకుడికి తన పార్టీలో ఎలాంటి పట్టు ఉండాలో కేసీఆర్ చేసి చూపించారని కూడా అనుకోవచ్చు.

తమ దగ్గర అంతర్గత ప్రజాస్వామ్యం అమితంగా ఉందని చెప్పే కాంగ్రెస్, అభ్యర్థుల ప్రకటన విషయం వచ్చేసరికి అల్లకల్లోలం అయిపోతూ అనేకానేక గందరగోళాలకు లోనవుతుంటుంది. కేసీఆర్‌ది నియంతృత్వమనో… లేదా దొరతనమనో పేర్లు పెడితే పెట్టవచ్చు గాక, కానీ ఒక నాయకుడి మాటకు ఒక పార్టీలో ఉండే విలువ – ఆ పార్టీ విలువను కచ్చితంగా పెంచుతుంది. బహుశా ఇదే కేసీఆర్ ఆలోచన కావచ్చు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా తమ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిల్లరమల్లర గొడవలు తగ్గించుకుని, తొందరగా సీట్ల విషయంలో నిర్ణయాలకు రావాలి. లేకపోతే వాళ్లు అభ్యర్థుల్ని ప్రకటించేటప్పటికే పుణ్యకాలం గడిచిపోతుంది. ఈలోపు టీఆరెస్ అభ్యర్థులు నిలదొక్కుకుంటారు. అసలే సీట్లలో ఎప్పటినుంచో అదే సీట్లలో ఉన్నవాళ్లు మరి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu