దొంగతనం చేస్తున్న ‘పోలీస్‌ యాప్‌’!

SriRamaNavami

మీరు మ్యాక్‌ కంప్యూటర్‌ వాడుతున్నారా? అయితే అందులో యాడ్‌ రిమూవింగ్‌ కోసం ఏదైనా పాపులర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశారా? అయితే మీ సమాచారం చైనీస్‌ సర్వర్లలోకి చేరే ప్రమాదం ఉంది. జాగ్రత్త! పోలీస్‌ లా రక్షణ కల్పిస్తానని చెప్పే ఒక యాప్‌ … తనే సమాచారం దొంగిలించి చైనీస్‌ సర్వర్లకి చేరుస్తోంది! వివరాలేంటో తెలుసుకోండి మరి..

కంప్యూటర్‌తో పని చేసేటప్పుడు – అనేక యాడ్‌వేర్లు మనని ప్రకటనలతో విసిగిస్తుంటాయి. అలాగే అంటే, కంప్యూటర్‌కి చెడు చేసే మాల్‌వేర్లు కూడా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఈ యాడ్‌వేర్‌నీ, మాల్‌వేర్‌నీ గుర్తించి తొలగించే పనిని- కంప్యూటర్‌లోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లు చేస్తుంటాయి. అయితే ఇవే నమ్మకంగా పనిచెయ్యకపోతే ఏమిటి పరిస్థితి? కంచే చేను మేసినట్లుగా.. కాపాడాల్సిన సాఫ్ట్‌వేరే మనల్ని మోసం చేస్తే ఎలా? ఇప్పుడు యాపిల్‌ మ్యాక్‌ ( Apple Mac)యూజర్లకి ఇదే సమస్య ఎదురవుతోంది.

విండోస్‌ కంప్యూటర్లలోకి వచ్చినంతగా – యాపిల్‌ మ్యాక్‌ కంప్యూటర్లలోకి వైరస్‌లు రావనేది ఎప్పటి నుంచో గొప్పగా చెప్పుకునే విషయం. అయితే ఎలాంటి కంప్యూటర్లకైనా యాడ్‌వేర్లతో ఇబ్బంది తప్పదు. వీటిని తొలగిస్తామని చెప్పే ఒక ప్రముఖ యాప్ ఒకటుండేది. “నెంబర్ వన్ యాడ్‌వేర్ రిమూవల్ టూల్” గా పేరు తెచ్చుకున్న ఆ యాప్ పేరు – ‘యాడ్‌వేర్‌ డాక్టర్‌’ ( Adware Doctor). ఇది యాపిల్ యాప్‌ స్టోర్‌లో దొరుకుతోంది. చిత్రమేంటంటే ఇది యాడ్‌వేర్‌, మాల్‌వేర్‌ తొలగిస్తానని చెబుతూనే… ఆ సాకుతో – చాటుగా యూజర్ల సమాచారాన్నీ, బ్రౌజింగ్ హిస్టరీనీ దొంగిలిస్తోందట. దొంగిలించిన సమాచారాన్ని నేరుగా చైనాలో ఉన్న సర్వర్లకు పంపుతోందట.

తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఏమిటంటే – ఈ మధ్య యాపిల్‌ కంపెనీ ఈ విషయాన్ని గుర్తించి యాడ్‌వేర్‌ డాక్టర్‌ యాప్‌ తయారుచేసిన కంపెనీని హెచ్చరించింది. ఇలా సమాచారాన్ని తరలించే కోడ్‌ని తొలగించమని హెచ్చరించింది. ఇది జరిగి నెల రోజులైనప్పటికీ వాళ్ళు ఈ యాడ్‌వేర్‌ డాక్టర్‌’ యాప్‌లోంచి – ‘సమాచారం దొంగిలించగల థెఫ్ట్‌ కోడ్‌’ని తీసేయలేదట!

యాడ్‌వేర్‌ డాక్టర్‌ యాప్ – మ్యాక్‌ స్టోర్‌ లోని పెయిడ్ యాప్స్‌ (Paid Apps)లో లిస్ట్‌లో నంబర్‌ వన్‌ పొజిషన్లో ఉంది. దీని ఖరీదు 4.99 డాలర్లు. మోస్ట్‌ పాపులర్‌ యాప్స్‌ లో నాలుగో స్థానంలో ఉంది. అయితే యూజర్స్‌ దీన్ని ఎంతో నమ్మి, ఇంత పైకి వచ్చేలా దీన్ని ఆదరిస్తే – ఈ యాప్‌ చేసే పని ఇదీ! పోలీసే దొంగతనం చేసినట్టుగా – యాడ్‌వేర్‌ని తొలగించి భద్రత కల్పించే కారణంతో సమాచారాన్ని దొంగిలించి అదే సమాచారభద్రతకి గండికొట్టడం నిజంగా ఘోరమైన విషయం. పైకి మంచిగా నటిస్తూ వెనక చెడు చేసే ఇలాంటి యాప్స్‌ ని కంప్యూటర్ పరిభాషలో ‘రోగ్‌ సాఫ్ట్‌వేర్‌ (Rogue Software) ‘ అంటారు. మరి ఈ ‘యాడ్‌వేర్‌ డాక్టర్‌’ మీద యాపిల్‌ ఏ చర్య తీసుకుంటుందో… యాప్‌ స్టోర్‌ నుంచి దాన్ని నుంచి తొలగిస్తుందో లేదో.. చూద్దాం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu