తెలుగు నేర్చుకోం… బాబోయ్‌!

SriRamaNavami

ఈ మధ్య తెలుగు ఛానెల్స్ లో వస్తున్న తెలుగు ప్రోగ్రాములు చూస్తుంటే – ఆనందం కంటే బాధ ఎక్కువగా కలుగుతోంది. తెలుగుకి రోజురోజుకీ ఆదరణ తగ్గుతోందన్న భయంతో కొన్ని తెలుగు ఛానెల్స్‌ ప్రత్యేక ప్రోగ్రాములు ఇస్తున్నాయి. తెలుగు నేర్చుకోవడం గురించీ, తెలుగు గొప్పతనం గురించీ చెబుతూ తెలుగును ప్రమోట్ చేయాలన్నది వాటి తాపత్రయం. నిజమే! తెలుగు పట్ల జనంలో- ముఖ్యంగా కొత్త తరంలో ఆసక్తి కలిగించేందుకు ప్రోగ్రాములు తయారు చెయ్యడం, వాటిని వారం వారం ప్రసారం చెయ్యడం చాలా మంచి విషయం. ఇప్పుడు ఇవి జాతికి అత్యవసరం కూడా! కానీ, ఆ చేసే ప్రోగ్రామ్‌ సరిగ్గా ఉండకపోతే – సరైన రీతిలో చేయకపోతే – అది భాషకి మంచి చెయ్యకపోగా చెడు కలిగిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే!

మన టీవీ చానల్స్ లో వస్తున్న తెలుగు ప్రోగ్రామ్స్ చూస్తుంటే… అవి తెలుగు నేర్చుకోవడానికి ప్రోత్సహించే ప్రోగ్రాములుగా కాక జనాన్ని నిరుత్సాహ పరిచేలా, భాష అనగానే భయపెట్టేలా తయారవుతున్నాయి. తెలుగు భాష అన్నది ఓ పూర్తి స్థాయి చాదస్తపు విషయంగా చూపిస్తున్నారు. ఇదంతా ఏదో పాతకాలం విషయం… కానీ ఇది మన సంస్కృతి కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాలి – అన్నట్టు ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాముల్లో వచ్చే యాంకర్లు, వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోందంటే – “తెలుగనేది ఒక అత్యంత ప్రాచీనమైన విషయం కాబోలు, నేటి సమాజంతో దీనికి సంబంధం లేదేమో… ఈ కష్టమైన బ్రహ్మవిద్యని ఇష్టం లేకపోయినా నేర్చుకోవాలి… ఎందుకంటే ఇది మన సంస్కృతి కాబట్టి! ఏం చేస్తాం? తప్పదు మరి! ” ఒక్కోసారయితే “అమ్మో.. తెలుగు నేర్చుకుంటే ఇలా చాదస్తంగా తయారవుతామా… అనేంత భయం కలిగిస్తున్నాయి ఈ ప్రోగ్రాములు. తెలుగు బాగా వచ్చిన వాళ్లకి కూడా ఈ ప్రోగ్రాములు చూస్తే విసుగు పుడుతోంది.

నిజానికి తెలుగు భాష చచ్చిపోతోందంటూ వాదించేవారి వాదం కరెక్ట్ కానే కాదు. ఆలోచించి చూస్తే – గతంలో కంటే తెలుగు వాడకం బాగా పెరిగింది. అప్పట్లో కొందరే కావ్యాలు రాసేవారు. ఇంటర్‌ నెట్‌ వచ్చాక ప్రతి తెలుగువాడూ రచయితే! ఎంతో మంది తెలుగు బ్లాగ్స్‌ నడుపుతున్నారు. వెబ్‌ సైట్లు చదువుతున్నారు. వెబ్‌ లో మాత్రమే కాదు, యాప్స్‌లో కూడా తెలుగు వాడకం విపరీతంగా పెరిగింది. తెలుగులో యాప్స్‌ విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. ఇక వాట్సాప్‌ లో తెలుగు గ్రూపులు వేలకొద్దీ ఉన్నాయి. సినిమా రంగంలో తీసుకున్నా… బాహుబలి లాంటి తెలుగు చిత్రాలు దేశాన్నే ఊపేస్తున్నాయి. యూట్యూబ్‌ లో తెలుగు వీడియోలు పెరిగాయి. అలా ఇలా కాదు… కోట్లల్లోకి చేరాయి. మరి తెలుగు చచ్చిపోతోందనడం మూర్ఖత్వమే అనాలి. తెలుగు భాష – ఈ స్థాయిలో ప్రస్తుత ట్రెండ్‌తో పరుగులు తీస్తున్న ఈ సమయంలో.. ఇదేదో ప్రాచీనమన్నట్టూ, ఇది నేటి తరానికి ఎందుకూ పనికిరాదన్నట్టూ మాట్లాడడం ఎందుకు?

పాతకాలపు ఛందస్సునీ, పాతకాలపు సంధుల్నీ, సమాసాలన్నీ వివరించి చెప్పచ్చు. కానీ విసుగుపుట్టించేలా చెప్పడం ఎందుకు? ఇప్పటివాళ్ళకు అర్థంకాని రీతుల్లో ఏమాత్రం ఆకర్షణ లేని విధంగా ప్రోగ్రాముల్ని తయారు చేయడం ఎందుకు? అలా చేస్తే అది భాషా సేవ అనిపించుకోదు. అది తెలుగు మీద ఉన్న ఇష్టాన్ని చంపడమే తప్ప తెలుగును ప్రోత్సహించడం కాదు. దయచేసి టీవీల్లో తెలుగు ప్రోగ్రాములు తయారు చేసేవారంతా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రాములు ఉన్నది – తెలుగు భాష పట్ల జనంలో ఆసక్తి కలిగించడానికి.. భాషని ప్రమోట్‌ చేయడానికి! అంతేగానీ… తెలుగు మీద అభిమానంతో అలాంటి ప్రోగ్రాములు చూసే భాషాభిమానుల్ని ఎక్స్‌ ప్లాయిట్‌ చేసేందుకు కాదు. మీరు తెలుగు ప్రమోటింగ్‌ ప్రోగ్రాముల్ని చేయకపోయినా పరవాలేదు. కానీ చూసినవాళ్లకి “తెలుగు నేర్చుకోం… బాబోయ్‌!” – అనిపించేలా ఆ ప్రోగ్రాముల్ని తయారుచేయద్దు. మీ ప్రోగ్రాముల్ని మరింత మోడ్రన్‌గా, ఈ కాలం పిల్లలు ఇష్టంగా చూసేలా మార్చండి. లేకపోతే ఆ ప్రోగ్రాముల్ని వెంటనే ఆపెయ్యండి.. అదే అసలైన భాషా సేవ!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu