తెలుగు అంటే తమిళమే అంటున్న గూగుల్‌!

SriRamaNavami

మనం ముందు భారతీయులం. తరవాత దక్షిణాదివారం. ఆ తరవాత తెలుగువారం. అయితే – దక్షిణాదివారిని సెకండ్‌ రేట్‌ భారతీయులుగా ట్రీట్‌ చేసినప్పుడు సమస్య వస్తుంది. పై పెచ్చు – దక్షిణాది అంతటినీ ‘మదరాసీలు’ అంటూ ఒకే గాటన కట్టి మాట్లాడడం గతకాలపు ఉత్తరాది అహంకారానికి నిదర్శనం అని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. ఇలా అవమానాలు పొందిన అనుభవం దక్షిణాదిలో ప్రబలంగా ఉంది. ఇలాంటి అనుభవాల వల్లే – దక్షిణాదిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఎంతోకొంత ఆదర్శాలున్న పార్టీ అనుకున్న బీజేపీ కూడా ఇప్పుడు పూర్తి ఉత్తరాది పార్టీగానే ప్రవర్తిస్తూ – దేశసమగ్రతకే తూట్లు పొడిచేలా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుండడం అత్యంత బాధాకరమైన విషయం.

దక్షిణాదిలో తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ సంస్కృతులు నాలుగూ పూర్తిగా విభిన్నమైనవి. వాటిని ఏమాత్రం గుర్తించకుండా – విడిగా పేర్లు కూడా తెలుసుకోకుండా సౌత్‌వాళ్లంతా తమిళులే అన్నట్లు మాట్లాడడం – దక్షిణాది సంస్కృతి పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. ఉత్తరాదిలో హిందీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకూ రాష్ట్రాలకూ చెందినవారిలో ఈ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రముఖ ఆన్‌ లైన్‌ సంస్థ గూగుల్ కూడా – తన ట్రాన్స్‌లేషన్ లో తెలుగు, తమిళం రెండూ ఒకటే అన్నట్టు చూపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఉదాహరణకి గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ వెబ్‌ సైట్‌ (translate.google.com) లోకి వెళ్లి – ఎడం పక్క మూలభాషగా తెలుగుని ఎంచుకుని, “తెలుగువాళ్ల ముందు” టైప్ చేశామనుకోండి. కుడిపక్క టార్గెట్‌ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్ సెలక్ట్‌ చేసుకుని ట్రాన్స్‌ లేట్‌ చేయమంటే ఏం జరుగుతుందో తెలుసా? నిజానికి “తెలుగువాళ్ల ముందు” అనే పదబంధాలకి ఇంగ్లిష్‌లో అనువాదం ఏమని చూపించాలి? “Infront of The Telugus” అనో “Before The Telugus” అనో చూపించాలి. కానీ గూగుల్ ట్రాన్స్‌లేషన్‌ ఏం చూపిస్తుందో తెలుసా? “Before The Tamils” అని చూపిస్తుంది.

మనం తెలుగుభాషలో బహువచనం వాడే చోట ‘లు’ అంటాం. దానికి తమిళంలో కళ్‌,గళ్‌ అని వాడతారు. ఆఖరికి ఈ ఆర్టికల్‌ ని గూగుల్‌లో ట్రాన్స్‌ లేట్‌ చేయబోయినప్పుడు కూడా – ‘మదరాసీలు’ అన్న పదాన్ని ‘madrassikal’ అంటూ తమిళంలోకి ట్రాన్స్‌ లేట్‌ చేస్తోంది గూగుల్‌. ఎంత బాధాకరమో చూడండి!

తెలుగు తమిళం ఒకటి కాదనీ, ఎవరికి వారికి ప్రత్యేక అస్తిత్వం ఉందనీ ఎప్పుడో ముప్ఫయ్యేళ్ల క్రితం ఎన్టీఆర్‌ గోలపెట్టాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉండడం విచారకరం. తెలుగు అంటే తమిళం కాదని ప్రతి తెలుగువాడూ గూగుల్‌కి తెలియజెప్పాల్సి ఉంది. ఇలాంటి వాటిని గూగుల్ తక్షణమే కరెక్ట్‌ చేసుకుంటే మంచిది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu