తెలుగువారికి వికారం పుట్టిస్తున్న బీజేపీ రాజకీయ చేష్టలు!


ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు తగ్గిస్తారట. తెలంగాణ ఆర్టీసీ గొడవల్లో కూడా వారే వేలు పెడతారట.అసలు బీజేపీ ఏం ఆలోచిస్తోందో తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది. ఒకప్పటి ఆదర్శవంతమైన బీజేపీయేనా ఇది? కాంగ్రెస్‌కి మరో రూపమా? అనిపిస్తోంది. “ఏదో సందుచూసుకుని ఏపీలోనూ తెలంగాణాలోనూ మేం ఉన్నామని చూపించుకోవాలి. మతాల గొడవలు పెట్టయినా ఇక్కడ మనకంటూ ఓ స్థానం సంపాదించాలి. ప్రజలు మెచ్చి పెద్ద మెజారిటీలు ఇచ్చి తెచ్చుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఇక్కడున్నా సరే… వాటిమీద పెత్తనం చేయడానికి సిద్ధపడిపోవాలి. వాళ్ల శత్రువులు ఎలాంటి పాలసీలూ లేనివారైనా చేతులు కలపాలి. ఎంత మాత్రం బలం లేని హిందీ బలవంతపు సంప్రదాయాల్ని ఇక్కడ కూడా మోపాలి. సానుకూలంగా సాగిపోతున్న రాష్ట్రాల్లో ఐక్యభారతం పేరుతో అలజడి సృష్టించాలి. అభివృద్ధి కోసం జనం వేసిన ఓటును కాలరాసి అయినా – కలతలు రేపాలి. అధికారం సాధించాలి. ఆపై మనుగడ సాధించాలి. “- ఇదే దక్షిణాదిలో ప్రస్తుతం బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకప్పటి ఆదర్శవంతమైన బీజేపీయేనా ఇది? కాంగ్రెస్‌కి మరో రూపమా? అనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఎప్పుడెప్పుడు కూలదోసి పీఠం ఎక్కేద్దామా అన్నట్టు ఉంది బీజేపీ వ్యవహారం. మన నిజమైన అవసరాల్ని గుర్తించకుండా కేవలం పదవే ధ్యేయంగా – బీజేపీ వేస్తున్న వేషాల్ని తెలుగు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మనం అఖండమైన మెజారిటీలు ఇచ్చి గెలిపించుకున్న మన ప్రభుత్వాలకి కుంపటి పెట్టి కూలదోసే ప్రయత్నం చేయడం అంటే – ఓటేసిన ప్రజల్ని అవమానించడమే! ఇటు జగన్‌ కానీ, ఇటు కేసీఆర్‌ గానీ ప్రజల అభిమానం చూరగొన్న నేతలు. వారికి అవకాశం ఇచ్చింది ప్రజలు. మరి నమ్మి పీఠం మీద కూర్చోబెట్టాక వాళ్లు ఎంత గొప్పగా పరిపాలిస్తారన్నది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. రేపు సంతృప్తి లేకపోతే వాళ్లే ఓడిస్తారు. కానీ మధ్యలో ఈ బీజేపీ ఎవరు? మనం ఓటేసి గెలిపించుకున్న నేతల సీట్ల కింద నిప్పు పెట్టి అనుక్షణం వేధించడానికి వీళ్లెవరు? పాలకులకి తగినంత టైమ్‌ ఇవ్వద్దా?

రేపు ఆంధ్రాకి బీజేపీ స్పెషల్‌ స్టేటస్‌ ఇచ్చినా బీజేపీకి తెలుగు ప్రజలు దాస్యం చేయరు. ఆ విషయాన్ని బీజేపీ గుర్తించాలి. ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తే – భవిష్యత్తులోనైనా బీజేపీకి ఆశ ఉంటుంది. దక్షిణాది ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా, వారి అవసరాల్ని తీర్చకుండా, ఎలక్షన్లలో తమ తమ రాష్ట్రాల్లో వారిచ్చిన తీర్పుల్ని అవమానపరుస్తూ – వారు ఎంతో మెజారిటీతో గెలిపించుకున్న నాయకుల ప్రభుత్వాల కింద – ప్రజాస్వామ్య విరుద్ధంగా కుంపట్లు పెడుతూ – బీజేపీ ఇలా నీచంగా పదవి కోసమే దేవిరిస్తూ ఉంటే చాలా అసహ్యకరంగా ఉంటోంది. కాంగ్రెస్‌ బాటలోనే పోతూ విలువలు వదిలేస్తున్న ఆ పార్టీ ఇదే తరహా కొనసాగిస్తే ఇక బీజేపీ ఎప్పటికీ దక్షిణాది మీద ఆశ వదులుకోవాల్సిందే! ఇక్కడ పీఠం సంపాదించడం తరవాత – ముందు ఇక్కడి ప్రజల మనోభావాల్ని గౌరవించడం నేర్చుకోవాలి. అవసరం లేని హిందీ రుద్దడం కాదు. ప్రజల అవసరాలు తీర్చాలి. వారి తీర్పుకి విలువ ఇవ్వాలి. వారు ప్రజాస్వామ్య బద్ధంగా పదవులు కట్టబెట్టిన నాయకులకు తగిన సమయం ఇవ్వాలి. లేదంటే శాశ్వతంగా – గుడ్‌ బై బీజేపీ! అంటారు తెలుగు ప్రజలు. తగిన బుద్ధి చెబుతారు. విలువలు లేని బీజేపీని నెత్తికెక్కించుకునే మూర్ఖులు కారు తెలుగువారు.

ఉత్తరాదిలో మంచి మెజారిటీతో నెగ్గిన బీజేపీకి దక్షిణాదిని చూస్తుంటే నిద్రపట్టడం లేదల్లే ఉంది. తనవల్లే దక్షిణాది రాష్ట్రాలన్నీ బతుకుతున్నాయన్నట్టూ, పాపం తను ఇక్కడ లేకపోవడం వల్ల అభివృద్ధిలో వెనకబడిపోతున్నట్టూ, వీటిని కూడా ఏదోలా తన జ్యోతిలో విలీనం చేసుకోకపోతే వీటికి మోక్షం లేదన్నట్టూ – చిత్రవిచిత్రమైన చేష్టలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణల్లో – రకరకాల స్ట్రాటజీలు ప్లే చేస్తూ భావిలో ఇక్కడ జెండా ఎగరేయచ్చుననే ఆశతో ఉంది.

బీజేపీకి తెలిసిన స్ట్రాటజీ ఒక్కటే!

స్ట్రాటజీ స్ట్రాటజీ అంటాంగానీ నిజానికి బీజేపీకి ఎప్పుడూ తెలిసిన స్ట్రాటజీ ఒక్కటే! మతపరమైన భావాలమీద ఆధారపడడం! కేరళలో అయ్యప్య గుడిని అడ్డుపెట్టుకుని, తమిళనాడులో నాయకత్వలేమిని అవకాశంగా తీసుకుని రాజకీయాలు చేసిన బీజేపీ, కర్ణాటకలో అయితే కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏనాడూ ఊహించనంత నీచ స్థాయి రాజకీయాలు చేస్తోంది.

అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల విషయంలో బీజేపీ చేష్టలు మరింత వికారం పుట్టిస్తున్నాయి. ఎంతో కొంత మతపరమైన గడబిడలు ఉన్న తెలంగాణలో – దాన్ని ఆసరాగా చేసుకుని పైకి రావచ్చనుకుంటున్న బీజేపీ – కేసీఆర్‌ని ఇరకాటంలో పెట్టేందుకు నానా ప్రయత్నాలూ చేస్తోంది. అయితే మతపరమైన విషయాలు మాట్లాడాలంటే – కేసీఆర్‌ ది బెస్ట్‌ అని చెప్పాలి. ఎవరు ఏమన్నా నిత్యం హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ యాగాలు చేసే ముఖ్యమంత్రి ఆయన. అయినప్పటికీ, ముస్లింలకూ సమప్రాధాన్యం ఇస్తూ చక్కటి తీరులో సాగిపోతున్నారు. అలాంటి సామరస్యాన్ని సాధించే మరో ముఖ్యమంత్రి సీఎం తెలంగాణకు దొరుకుతారని చెప్పలేం.

మతం ముఖ్యమా? అభివృద్ధి ముఖ్యమా?

ఇక ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి – మత మార్పిడుల్ని ప్రోత్సహించే ముఖ్యమంత్రిగా జగన్‌ని చూపే ప్రయత్నం మొదలుపెట్టింది బీజేపీ. జగన్‌ కి గతంలో క్రిస్టియన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ – ఇప్పుడు అదేం అంత ముఖ్యమైన విషయం కాదు. నిజానికి మతపరంగా జగన్‌ని ఇప్పుడు విమర్శించాలంటే – ఇటీవల ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్లి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న విషయాన్నే విమర్శించాల్సి ఉంటుంది.

ఇవి జాతీయ పార్టీలా? ఛీ ఛీ!

జాతీయ పార్టీలు దక్షిణాదిని ఎప్పుడూ తక్కువ చూపే చూడడం చరిత్ర చెప్పే సత్యం. కానీ కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి కాస్త విలువలున్నాయన్న భావం గతంలో ఉండేది. ఇప్పటి పార్టీ చేస్తున్న చేష్టలతో ఆ పేరు పూర్తిగా భ్రష్ఠుపడుతోందని చెప్పచ్చు. ఎంతో మత సామరస్యం ఉన్న ప్రాంతంలో మతపరమైన చిచ్చు పెట్టే చీప్‌ పనుల్ని బీజేపీ మానుకోవాలి. ఇలాగే పోతే దక్షిణాదిని గెలవాలన్న బీజేపీ ఆశ భ్రమగానే మిగిలిపోతుంది. ఎందుకంటే – బీజేపీ చేష్టలు సగటు దక్షిణ భారతీయుల మనోభావాలకి ఎంతమాత్రం సరిపడని రీతిలో ఉన్నాయి.

ఊహల్లో బతికేస్తే ఉరి వేసుకున్నట్టే!

కానీ ఇదేదీ గుర్తించకుండా బీజేపీ తన కలల ప్రపంచంలో విహరిస్తూ రోజురోజుకీ రెచ్చిపోతోంది. అసలు ఆంధ్రప్రదేశ్‌ గురించి బీజేపీ ఏదైనా మాట్లాడాలీ అంటే – ముందు స్పెషల్‌ స్టేటస్‌ ఇచ్చి మాట్లాడమనండి! – అంటున్నారు తెలుగు ప్రజలు. చంద్రబాబుని మాత్రమే కాదు, బీజేపీ జగన్‌నీ గౌరవించడం లేదు, ఇటు పక్క కేసీఆర్‌నీ గౌరవించడం లేదు. మనం ఓటేసి గెలిపించుకున్న నేతల్నీ, మన అవసరాల్నీ గుర్తించకుండా- బీజేపీ వేస్తున్న వేషాల్ని తెలుగు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు బీజేపీ స్పెషల్‌ స్టేటస్‌ ఇచ్చినా బీజేపీకి తెలుగు ప్రజలు దాస్యం చేయరు. ఆ విషయాన్ని కూడా గుర్తించి ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తే – భవిష్యత్తులోనైనా బీజేపీకి ఆశ ఉంటుంది. లేదంటే అంతే సంగతులు! కేసీఆర్‌ చెప్పినట్టు – ఆ బీజేపీవోడు నాలుగురోజులు అరుస్తాడు. ఆ తరవాత వాడే చల్లబడతాడు.

54 / 100 SEO Score

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE