తెలుగువాడు తెలంగాణ భాష వాడకూడదా?


‘ఇస్మార్ట్‌ శంకర్‍’లో పూరి జగన్నాథ్‍ – రామ్‍ క్యారెక్టర్‍ని పక్కా తెలంగాణ క్యారెక్టర్‍గా మలిచే ప్రయత్నం చేశాడు. సినిమా క్వాలిటీ గురించీ సినిమాలోని మాస్‍ కమర్షియల్‍ ట్రిక్స్‌ గురించీ ఇక్కడ మాట్లాడవద్దు. జస్ట్‌.. భాష గురించి మాట్లాడుకుందాం.

సినిమాలో లాంగ్వేజ్‌ చూశాక – ‘విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం బ్యాచ్‍ అయిన పూరి జగన్నాథ్‍ అంత తెలంగాణ భాష ఎలా రాయగలిగాడు?’ అని చాలామంది ఆశ్చర్యపోయారు. తనకి తెలంగాణ మిత్రులు ఎక్కువగా ఉండడం వల్లే ఇది సాధ్యమయిందని పూరి చెప్పాడు. చాలామంది తెలంగాణ సోదరులు కూడా పూరి ప్రయత్నాన్ని అభినందించారు. కానీ కొందరు తెలంగాణ వీరాభిమానులు మాత్రం పూరిని తిట్టిపోస్తున్నారు. అదే విశేషం!

నేర్చుకుంటే తిట్టాలా?
ఈ భాషాభిమానులు సినిమా క్వాలిటీ గురించో మాస్‍ మసాలా విషయాల గురించో విమర్శిస్తే పరవాలేదు. కానీ వారి అభ్యంతరం అంతా – పూరి సినిమాలో వాడిన తెలంగాణ భాష గురించే! పూరి వాడిన తెలంగాణ భాషలో తప్పులున్నాయట. అది అసలు తెలంగాణ భాషే కాదట. అసలైన పట్టణ తెలంగాణ భాష ‘మల్లేశం’ సినిమాలో ఉందట. తెలంగాణ పల్లె భాష ‘దొరసాని’ సినిమాలో ఉందట. పాపం పూరి ఈ సినిమాలు చూడలేదనుకుంటా. ఇవేవీ తెలియక – తనకి తెలిసిన హైదరాబాదీ తెలంగాణ భాషనే తన పాత్రకి రాశాడు. అదే ఆయన చేసిన మహాపరాధమని కొన్ని ప్రముఖ తెలంగాణ వెబ్‌సైట్లు ముచ్చటించాయి.

మా భాష మాకే సొంతం!
తెలంగాణ భాషపట్లా సంస్కృతి పట్లా వీరాభిమానం ఉండడం మంచిదే. కానీ వాటిని తెలంగాణేతరులెవరూ వాడకూడదన్న సంకుచితత్వం ఈ వ్యాఖ్యానాల్లో స్పష్టంగా కనిపించడమే బాధాకరం. ఎప్పుడైనా భాష డెవలప్‍ కావాలంటే – దాన్ని నలుగురూ మాట్లాడేలా ప్రోత్సహించాలి. అందులో తప్పులూ ఒప్పులూ ఉన్నా సరే… కాస్త సరిదిద్ది ప్రయత్నాన్ని వెన్నుతట్టాలి. అప్పుడే వారు మరింత ఆత్మవిశ్వాసంతో ఆ భాషని మాట్లాడతారు. భాషకీ ప్రాచుర్యం లభిస్తుంది. అంతేగానీ ఇతరులయితే తప్పులు మాట్లాడతారు కాబట్టి… మా భాష మేము మాత్రమే మాట్లాడుకుంటాం … అని ఎవరి నూతిలో వాళ్లు కూర్చుని ముసుగేసుకుంటే – ఏ భాషా ఏ యాసా ఎప్పటికీ పైకి రాదు.

అచ్చం హిందీవారి మార్గంలోనే!
ఇంతకాలం తెలంగాణ భాషని పట్టించుకోకపోతే విమర్శించినవారున్నారు. పోనీ కష్టపడి నేర్చుకుంటే – వేళాకోళం చేసి అవమానించడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌… ఇది ఘోరమైన విషయం. హిందీ వాళ్లు కూడా అచ్చం ఇలాగే ప్రవర్తించడాన్ని గమనించవచ్చు. తెలుగువారికి – హిందీ రానివారికి – పార్లమెంటులో అక్కడ ఏమాత్రం ప్రాధాన్యం ఉండదు.  దక్షిణాది భాషలతో పోలిస్తే హిందీ – సాహిత్య పరంగా చరిత్ర పరంగా  చాలా కింది స్థాయి భాషగా లెక్కకు వస్తుంది. కానీ తప్పనిసరి చేయడం వల్ల – దాన్ని కష్టపడి నేర్చుకుంటే – కాస్త అటూ ఇటూగా మాట్లాడితే, వాళ్లు ప్రోత్సహించరు సరికదా వెక్కిరించి వేళాకోళం చేస్తారు. అందుకే ఎన్ని హిందీ ప్రచార సభలు పెట్టినా దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ హిందీ ఓ సుదూర భాషగానే మిగిలిపోయింది. హిందీ ఉర్దూల్లోనే నిత్య జీవితాన్ని సాగిస్తూ మాతృభాషకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని తెలంగాణ లాంటి ప్రాంతాల్లో తప్ప – ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ ఎంతమాత్రం గుర్తింపు పొందలేదు. విద్యావ్యవస్థలో ఇప్పటికీ హిందీ ఓ అనవసరమైన బరువుగానే మిగిలిపోయింది.చిరంజీవి, హరికృష్ణ లాంటివాళ్లకి భాషాపరంగా జరిగిన అవమానాలు చూస్తే అసలిది మన దేశమేనా అని బాధ కలుగుతుంది.

“మాది చాలా గొప్ప భాష, గొప్ప యాస… అని అనుకోవడం, చెప్పుకోవడం ఆత్మగౌరవ సూచికే కావచ్చు. కానీ మా భాష మాకే సొంతం. దానిని ఎవరూ నేర్చుకోకూడదు, ఒకవేళ నేర్చుకున్నా – మొదలుపెట్టీ పెట్టేయగానే అసలు తప్పన్నదే లేకుండా మాట్లాడేయాలి” – అని అనడం పూర్తి స్థాయి అజ్ఞానం. ఇలాగే ఇంగ్లీష్‍ వాడూ అనుకుని ప్రపంచాన్ని చూసి నవ్వి ఉంటే – ఈరోజు ప్రపంచంలో ఇంగ్లిష్‍ ఇంతలా ప్రాచుర్యం పొంది ఉండేదే కాదు. పూరి రాసిన తెలంగాణ యాసని తప్పు పట్టేవాళ్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఆమాత్రం అభినందించలేరా?
నిజానికి పూరి జగన్నాథ్‍ ప్రయత్నాన్ని యావత్‍ తెలంగాణ అభినందించాలి. తప్పులుంటే సరిదిద్దవచ్చుగానీ భాష పూర్తిగా మా సొంతం అని దాన్ని సొంత డబ్బాలో వేసి దాచేసుకోవడం – కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే అవుతుంది. ఇలాంటి విమర్శలు చూస్తుంటే – తెలంగాణ యాస, భాష ఇంతకాలం ఇందుకే ప్రాచుర్యం పొందలేదా అనిపిస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి సంకుచితమైన ముచ్చట్లు మాని జనజీవన స్రవంతిలోకి వస్తే, భాషని తెస్తే – తెలంగాణకీ భాషకీ మరింత గౌరవం లభిస్తుంది.

ఎందుకింత కన్ఫ్యూజన్‌?
తెలంగాణలోని సినీ విమర్శకులు కొందరిలో ఇలాంటి ద్వంద్వ వైఖరి కనిపించడం బాధాకరం. తెలంగాణ భాషని విలన్లకీ కమెడియన్లకే ఎందుకు పెడతారు? – అని ఒకప్పుడు తప్పులు పట్టిన వీరు – ఇప్పుడు హీరోకి తెలంగాణ భాష పెడితే మరో రకంగా విమర్శిస్తున్నారు. భాషకి గుర్తింపు వస్తోందని సంతోషించాల్సింది పోయి – తప్పులెన్నుతూ వంకలు పెడుతున్నారు. కమర్షియల్‍గా తెలంగాణ సినిమా ఎదగడం లేదంటూ ఓ పక్క బాధపడతారు. తెలంగాణ బేస్‍తో కమర్షియల్‍ హిట్‍ తీస్తే మాత్రం – ఇదీ వీళ్ల తీరు. తమ భాషని ఇతరులు గౌరవించాలా? పట్టించుకోకూడదా? నేర్చుకోవాలా? నేర్చుకోకూడదా? నేర్చుకుంటే మొదటే అద్భుతంగా మాట్లాడాలా? అసలు ఇతరులు తమ భాషని మాట్లాడకూడదా? అసలు ఇతరులెవరు? – ఇలాంటి విషయాల్లో తమకే క్లారిటీ లేని ఓ అయోమయ ధోరణి తెలంగాణ సినీ విమర్శకుల్లో, భాషా విమర్శకుల్లో కనిపిస్తోంది. ఈ అయోమయ ధోరనివల్లే తెలంగాణ భాషా యాసా జనానికి ఇంతకాలం దూరమయ్యాయేమో అని అనిపిస్తుంది.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE