జగన్‌ ప్రభుత్వం టైమ్‌ వేస్ట్‌ చేస్తోందా?


అసెంబ్లీలో జగనూ చంద్రబాబూ ఒకరినొకరు మాటలు అనుకుంటున్నారు. యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూసి చాలామంది ఆదర్శవంతులు చిరాగ్గా అసహనంతో ప్రతిస్పందిస్తున్నారు. “ఇది ప్రజల సమస్యలు డిస్కస్‌ చేయాల్సిన సమయం. మీరు తిట్టుకోవడం, కొట్టుకోవడం కాదు. సమయం వృథా చేయడం మానేసి, ప్రజల గురించి ఆలోచించండి”… అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

నిజమే! అసెంబ్లీ ఉన్నది తిట్టుకోడానికీ కొట్టుకోడానికీ కాదు. అయితే ఇప్పుడు జగన్‌ప్రభుత్వం నిజంగానే సమయం వృథా చేస్తోందా? – అన్నదే ప్రశ్న.

గతంతో పోల్చి చూస్తే ప్రస్తుతం ప్రతిపక్షానికి – తక్కువ సీట్లున్నా విలువ బాగానే ఉందని చెప్పవచ్చు. జగన్‌ చెప్పినట్టు – గెలిచిన వారిలోంచి కొందరిని వైసీపీ లాగేసి ఉంటే – చంద్రబాబుకి ప్రతిపక్షహోదా కూడా ఉండేది కాదన్నది కూడా నిజం! ఆ విషయంలో జగన్‌ ఔదార్యంతోనే ప్రవర్తించారని చెప్పాల్సి ఉంది. అయితే వీటిని గొప్పగా చెప్పుకోవడం మాత్రం కరెక్ట్‌ కాదు. ఎప్పుడూ అధికార పక్షం ప్రతిపక్షానికి విలువ ఇవ్వాల్సిందే! అయితే ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరూ అంతే దూరం అన్న సంగతి జనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.

తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు – ప్రతిపక్షానికి అరవైకి పైగా సీట్లు ఉన్నప్పటికీ – అసెంబ్లీ సెషన్స్‌లో ఎప్పుడూ వారికి విలువ ఇవ్వలేదు. తరవాత ప్రతిపక్షం అసెంబ్లీనే బహిష్కరించిందనుకోండి. అలాంటప్పుడు – తమకి అవకాశం దొరికినప్పడు అధికార పార్టీ దాన్ని ఉపయోగించుకోవడం సహజంగా జరిగే విషయం. అది మరీ మితిమీరి ప్రజాసమస్యలన్నీ పక్కన పడిపోతే విమర్శించాలి గానీ – ప్రభుత్వం మొదలయ్యీ అవ్వగానే తిట్టేయడం కరెక్ట్‌ కాదు.

అఖండమైన ప్రజాదరణ కలిగిన తన తండ్రి ముఖ్యమంత్రిగా చనిపోతే – ఆ పదవిలోకి ఆనాడే రాగల జగన్‌, స్వపక్ష ప్రతిపక్షాల రాజకీయాల వల్ల ఎన్నో కష్టాలు పడి, అయినా పట్టుదలతో విజయం సాధించాడు. ఒకనాడు తన తండ్రి కూర్చున్న సీట్లో ఈనాడు తాను కూర్చుని – ఎందరో అసాధ్యం అనుకున్న తనని కల నిజం చేసుకున్న జగన్‌ – కొంత ఆవేశాన్నీ దెబ్బకు దెబ్బ అనే తత్వాన్నీ ప్రదర్శించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. అందులోనూ యువకుడు. కాబట్టి కాస్త సరిపెట్టుకోవాలి. కానీ మొత్తం పనులన్నీ పక్కన పెట్టి ఇంకో ఏడాది గడిచినా ప్రతిపక్షాన్ని ఇలాగే ఆయన విమర్శిస్తూ కూర్చుంటే – అప్పుడు అనాలి. అంతేగానీ అప్పుడే – టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నాడంటూ ఆరోపణలు ఎందుకు?

ఆరునెలలు ప్రభుత్వానికి టైమ్‌ ఇస్తానన్న చంద్రబాబు – ప్రభుత్వం మీద దాడి చేయడానికి నెల రోజులు కూడా ఆగలేకపోయారు. ప్రతిపక్షనాయకుడి లాగే ఓటేసిన ప్రజలు కూడా వెంటనే విమర్శలు ప్రారంభిస్తే ఎలా? ప్రభుత్వానికి కాస్త ఊపిరాడనివ్వాలి కదా?

జగన్‌ పరిపాలన మొదలై నెలన్నర మాత్రమే అయింది. సాధారణంగా ప్రభుత్వం నిలదొక్కుకోవడానికే మొదటి మూడు నాలుగు నెలలూ ఖర్చయిపోతుంది. కానీ జగన్‌ అందరూ ఊహించినదానికంటే ముందే పనిని ప్రారంభించారు. వేగవంతం కూడా చేశారు. వచ్చీరాగానే ఢిల్లీ వెళ్లి హోదా పరిస్థితిని అంచనా వేసుకుని రావడం, కేసీఆర్‌తో కలిసి కూర్చుని నీళ్ల పంచాయతీలు తేల్చడం.. ఐదుగురు డిప్యూటీ సీఎంల్లాంటి నిర్ణయాలతో … పరిపాలనలోనూ కొత్త పుంతలు తొక్కడం. ఇలా ఎక్కడ చూసినా ఓ స్పీడ్‌ కనిపించింది. ఇప్పటికీ జగన్‌ నిర్ణయాల్లో ఆ వేగం, రాష్ట్రాన్ని దారిలో పెట్టాలన్న తపన కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో చర్చలు జరిగినప్పడు నాలుగు మాటలనుకున్నంత మాత్రాన – సమయం వృథా అయిపోతోందన్నది ఓవర్‌ కామెంట్‌ అని చెప్పాలి. అసలు ఆరు నెలల్లో తనది మంచి పాలన అని నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్‌ తనకి తానే తనమీద పెట్టుకున్న విషయం మరిచిపోకూడదు. కాబట్టి – జగన్‌ తన లిమిట్స్‌ లో తానుంటాడన్నది సులువుగా ఊహించవచ్చు.

ఏదేమైనా – ప్రభుత్వం ప్రతిపక్షాన్ని చీటికీ మాటికీ తిట్టకూడదు. అలాగే ప్రభుత్వం చేసిన ఏ పనినీ మెచ్చుకోలేని లోపం, ఓర్వలేని తనం ప్రతిపక్షంలో కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. కాబట్టి టైమ్‌ వేస్ట్‌ గురించి మాట్లాడాల్సి వస్తే – జగన్‌ ఒక్కడి గురించే కాదు.. దొందూ దొందే అని చెప్పాల్సి వస్తుంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu