జగన్‌ని మీడియా మంచి చేసుకుంటోందా?


నిన్నటివరకూ సాక్షి తప్ప మరే మీడియా సంస్థా జగన్‌ని నెత్తికెత్తుకోలేదు. ఆయనకి ఎలాంటి సపోర్టూ ఇవ్వలేదు. మీడియా ఏ లీడర్నీ ఆదుకోవాల్సిన అవసరం లేదు. అలాగని ప్రయత్నపూర్వకంగా చెడు కూడా చేయకూడదు. జగన్‌ అత్యవసరమైన కష్టకాలంలో కూడా – ఆయన్ని మరిన్ని చిక్కుల్లో పడేసేలా  ప్రయత్నపూర్వకంగా కథనాలు రాసిన సంస్థలున్నాయి. అయితే నిన్నటిదాకా జగన్ని ఆడిపోసుకున్న ఈ మీడియా సంస్థలు ఇప్పుడు ఆయన్ని విపరీతంగా గౌరవిస్తున్నాయి. జగన్‌ ఏనాటికీ పదవిలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతో బలంగా పనిచేసిన సంస్థలు కూడా ఇప్పుడు ఆయన ప్రమాణస్వీకారాన్నీ ప్రతి స్టేట్‌మెంట్‌నీ హైలైట్‌ చేస్తున్నాయి. అది సబబే కదా? ఎంత కాదనుకున్నా – మీడియా అన్నది రాష్ట్రపరిపాలకుడికి ప్రాధాన్యం ఇచ్చితీరాలి కదా? లేకపోత రోజువారీ వార్తలే ఇవ్వడం కష్టం కదా? కాబట్టి – కేవలం అందుకోసమే జగన్‌కి అవి ప్రాధాన్యం ఇస్తున్నాయని అనుకోలేం. అంతకు మించిన ‘మంచితనం’ మీడియాలో కనిపించడాన్ని పరిశీలకులు గమనిస్తున్నారు.

మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా!

జగన్‌ నెగ్గీ నెగ్గగానే తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అలాగే విమర్శలు చేయకుండా ఆగుదాం, ప్రభుత్వానికి సమయం ఇద్దాం అంటూ చంద్రబాబు పెద్దరికం ప్రదర్శించారు. ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకుని మీడియా సంస్థలు మంచి కథనాల్ని వండివారుస్తున్నాయి. జగన్‌ ఇక అంతా మంచిగానే ఉండబోతున్నాడా? చంద్రబాబు కూడా గొడవ చేయడా? అబ్బ. అయితే రాజకీయాల్లో మంచి రోజులు రాబోతున్నాయి.. అంతా శుభమే అంటూ రాస్తున్నాయి. నిన్నటివరకూ జగన్‌ని ఒక తిట్టుకాకుండా తిట్టిన వీటి ధోరణిలో హఠాత్తుగా ఏమిటీ మార్పు?-  అని జనం ఆశ్చర్యానికి గురయేలా చేస్తున్నాయి.

ఏ గూటి మీడియా చిలకలు ఆ గూటివే!

ఇంతకాలం జగన్‌తో ఆటాడుకున్న మీడియా సంస్థలు – ఇప్పుడు జగన్‌ పవర్‌ చూసి ఆందోళనకు గురవుతున్నాయా? జగన్‌ నుంచి ప్రతికూల ధోరణి ఎదురుకాకుండా ఉండేందుకు – ముందునుంచే తమ అనుకూలతని ప్రదర్శిస్తున్నాయా? – అనిపిస్తుంది – వీరి కథనాలు చూస్తుంటే! అయితే జగన్‌ వర్గాలు వీరి సానుకూల వైఖరిని ఏమాత్రం నమ్మడం లేదు. ఇప్పుడు ఈ మీడియా సంస్థలు జగన్‌కి జై కొట్టినా – అది తాత్కాలికమే అని వారు అభిప్రాయపడుతున్నారు. రేపు జగన్‌ నిర్ణయాల్లో ఏ చిన్న పొరబాటు జరిగినా, వాటిని వ్యతిరేకించి చంద్రబాబు ఏ కాస్త పట్టు సాధించినా – మళ్లీ ఈ మీడియా చిలకలు తమ అసలు రంగుకి వచ్చేస్తాయనీ, మళ్లీ తమ గూటిపలుకే పలుకుతాయనీ వారు దృఢంగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే – తాము బలంగా ఉన్నప్పుడు శత్రువుని దెబ్బ తీయాలని తీవ్రంగా ప్రయత్నించినవారు – శత్రువు బలంగా ఉన్నప్పుడు అత్యంత అనుకూల ధోరణిలోకి మారిపోతే – అది సందేహాలకే తావిస్తుంది.

చంద్రబాబు మారిపోయాడొహో!

చంద్రబాబు కూడా ఇప్పుడు చాలా పాజిటివ్‌ గా మారిపోయాడని కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి. అది కూడా ఈ నాలుగైదు రోజుల్లోనే! ఇది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఎవరైనా – బలం లేనప్పుడు పాజిటివ్‌ గా మారిపోవడంలో అసలు గొప్పేం ఉందన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. బలం ఉన్నప్పుడు శత్రువుల పట్ల పాజిటివ్‌ ధోరణి ప్రదర్శించగలిగితే – అది నిజమైన గొప్పతనం. చంద్రబాబు పవర్లో ఉన్నంత కాలం జగన్‌ పట్ల అలాంటి పాజిటివ్‌ ధోరణి ప్రదర్శించిన దాఖలాలేమీ లేవు. పోనీ ఇప్పుడు అలాంటి ధోరణి జగన్‌లోనైనా ఉందా మరి? ఉందనే ఆశతోనే మీడియాలో ఈ అనుకూల ధోరణి కనిపిస్తోందా?

ఈ ‘జల్సా’ డైలాగ్‌ గుర్తుందా?

‘జల్సా’ లో పవన్‌కల్యాణ్‌ పలికిన త్రివిక్రమ్‌ డైలాగ్‌ ఒకటుంది. “చేతిలో కత్తి ఉండి – చంపడానికి ఎదుట శత్రువు ఉండి- చంపకుండా ఉండడమే మానవత్వం”! అని! ఇప్పుడు మీడియా సంస్థలు జగన్‌కి అదే ఉద్బోధిస్తున్నాయా? “బాబూ జగన్‌! నువ్వు మంచి పాలకుణ్ణవుతానని మాటిచ్చేశావ్‌. మరి చేతిలో పవర్‌ ఉండీ పగ తీర్చుకోకపోవడమే మంచి పాలకుడి లక్షణం” అంటూ జగన్‌కి చెబుతున్నాయా? “అప్పుడేదో అలా జరిగింది. మొత్తానికి నువ్వే గెలిచావ్‌గా? ఇక నిన్ను మేం ఏం అనం… నువ్వూ మమ్మల్ని ఏం అనద్దు” – అంటూ రాజీ ధోరణిలో కాకాపడుతున్నారా? ఆ విధంగా చేసి తమను తాము రక్షించుకోవడానికే ఇలాంటి కథనాల్ని వండి వారుస్తున్నారా? అని అనిపిస్తుంది.

కాకా – కాక

అసలు ఏ మీడియా సంస్థ అయినా పాలకవర్గాన్ని ఆకట్టుకోవాల్సిన పని ఉందా? లేనే లేదు. లేదు. మీడియా అన్నది ఎప్పుడూ ప్రతిపక్షంగానే ఉండాలి. పాలకులకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం మీడియా హక్కు. అది జగనైనా సరే, చంద్రబాబు అయినా సరే – మీడియా పాలకుల్ని కాకాపట్టకూడదు. మీడియా తమకే వత్తాసు పలకాలని పాలకుడు కూడా కోరుకోకూడదు, మీడియాని అణచివేయడానికి ప్రయత్నించకూడదు. కానీ ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వీటిని చూసే సామాన్యుడికి ఎంతో బాధకలుగుతుంది. ఒకప్పుడు ఎంతో పవర్‌ఫుల్‌ గా ఉండే తెలుగు మీడియాకి ఎందుకింత కర్మ పట్టింది? – అని ఆవేదన కలుగుతుంది. అయితే తెలుగు మీడియాకి ఈ దుస్థితి ఏర్పడడానికి కారణం ఒక్కటే! తమకు నచ్చిన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలక వర్గానికి మద్దతుగానూ, వ్యతిరేక ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతికూలంగానూ వ్యవహరించే పక్షపాత ధోరణే మీడియాకి ఈ ముప్పు తెచ్చిపెట్టింది. ఇది నిశ్చయంగా చెప్పవచ్చు.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE