జగన్‌కి టైమ్‌ ఫిక్స్‌ చేసిన చంద్రబాబు!


చంద్రబాబు జగన్ కి టైమ్‌ ఫిక్స్‌ చేశారు. అదేంటీ, చంద్రబాబు ప్రస్తుతం ఓడిపోయిన వ్యక్తి కదా, జగన్‌ది పై చేయిగా ఉంది కదా, మరి జగన్ కి చంద్రబాబు టైమ్‌ ఫిక్స్‌ చేయడం ఏంటి? అనుకోకండి. ఏపీ రాజకీయాల్లో అంతే. ప్రజాక్షేత్రంలో ఎవరిది పై చేయిగా ఉన్నా సీనియర్లు తమ సత్తా చాటుకుంటారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు బొక్కబోర్లా పడ్డా వెంటనే పైకి లేచారు. లేవగలిగినా లేకపోయినా లేవడం మాత్రం తప్పనిసరయింది. దానికి ఎన్టీఆర్‌ జయంతి ఓ సదవకాశంగా లభించింది. మరింకేం? ఈ ఘోరమైన ఓటమికి తెలుగుదేశం శ్రేణులు శాశ్వతంగా చతికిలపడిపోకుండా – వాళ్లని ఉత్సాహపరచే కర్తవ్యభారం భుజస్కంధాల మీద ఉంది కాబట్టి – చంద్రబాబు ఉత్సాహం ఉన్నా లేకపోయినా మీడియా ముందుకి వచ్చారు. ఇంతటి ఘోరమైన ఓటమి తరవాత మొహం చాటేసి మరెప్పుడో జనానికి ముఖం చూపించే కంటే – తొందరలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదన్న విషయాన్ని ఆయన సీనియర్‌ బ్రెయిన్‌ గుర్తించి ఉంటుంది. అందువల్ల పైకి లేచి వెంటనే తన సేనను ఉత్సాహపరిచారు. పరచడంతోపాటు జగన్ కి టైం కూడా పెట్టారు.

“మనం ఆగుదాం. కొత్త ప్రభుత్వాన్ని ఏమీ అనవద్దు. మనని మనం సమీక్షించుకుందాం. ఏం చేయాలో ఆ తరవాత ఆలోచిద్దాం” అని ఆయన శ్రేణులతో అన్నారు. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సిందీ ఏమీ లేదు, ఏం చేయాలో కూడా తెలియదు కాబట్టి – ఆలోచించుకోవడానికి కాస్త సమయం అవసరమే! అందుకే ఈ లోపు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం అని చంద్రబాబు అన్నారు. నిజంగా ఆయన ఔదార్యానికి మన సంతోషించాల్సిందే. కొంతకాలం పాటు విమర్శించకుండా ఉంటామని ఆయన అనడం- నిజంగా జగన్‌కి ఆయన ఇచ్చిన గొప్ప ఓపెన్ అవకాశం!

ఇది చంద్రబాబు ఔదార్యం కాదా?

చంద్రబాబు తలచుకుంటే ఈరోజు నించే.. చెప్పాలంటే ఈ క్షణం నుంచే జగన్‌ని విమర్శించి చీల్చి చెండాడగలరు. ఆయన వందిమాగధులూ సపోర్టర్లూ, పరాజయ విషాదంలో ఉన్న కార్యకర్తలూ ఆ విమర్శలకి ఉత్సాహంగా ఊతం ఇవ్వగలరు. కానీ చూస్తే ఇంకా జగన్ కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. ఏ ఒక్క ఫైలూ సంతకం కూడా చేయలేదు. మరి అలాంటప్పుడు ఏదైనా విమర్శించాలన్నా అవకాశం లేదు. విమర్శించినా జనం చిరాకుపడతారు. అన్ని ఓట్లేసి జగన్‌ని గెలిపించుకుంటే – అంతలోనే ఈ పోరేంటి? – అని అన్నా అంటారు. బహుశా అందుకే చంద్రబాబు తెలివిగా చక్కటి ఔదార్యాన్ని ప్రదర్శించారు. జగన్‌ ప్రజల అభిమానాన్ని చూరగొని ఉండవచ్చు గాక … జగన్ని అఖండమైన మెజారిటీతో జనం గెలిపిస్తే గెలిచి ఉండవచ్చు గాక! కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబుకి కృతజ్ఞుడుగా ఉండాల్సిందే! ఎందుకంటే వారి మధ్య ఉన్న రాజకీయ వైరం దృష్ట్యా – జగన్‌ పాలన ఎలా ఉన్నా చంద్రబాబు, రాబోయే కాలంలో తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా విమర్శించడం ఖాయం! – ఈ విషయం ఏపీలో చిన్నపిల్లవాణ్ణి అడిగినా చెబుతాడు. అందులోనూ చంద్రబాబు కి ఉన్న మీడియా బలం ఇంతా అంతా కాదు అన్నదీ అందరికీ తెలిసిన విషయమే! రేపు జగన్ ఏ పని చేసినా అందులోని తప్పొప్పుల్ని తూర్పారబట్టడానికి ఆయన సంబంధిత మీడియా అంతా సిద్ధంగా ఉందన్నది లోకవిదితం. మరి అంతటి బలం ఉన్న చంద్రబాబు – కనీసం పోన్లే కొంతకాలం జగన్‌ని ఏమీ అనవద్దు అని ఆఫర్‌ ఇవ్వడం నిజంగా ఔదార్యం కాక మరేమిటి?

ఇంతకీ గడువు ఎంతకాలం?

అయితే – చంద్రబాబు పెట్టిన గడువు కొంతకాలమే! ఆ కొంతకాలం ఎంతకాలం అన్నదే తెలియదు. నెలరోజులా? రెండు నెలలా? లేక ఆరు నెలలా? అంత సమయం ఉండకపోవచ్చు. ఒకటి రెండు నెలల్లోనే చంద్రం బాబు మీడియా జగన్ పై విరుచుకు పడడం ప్రారంభం కావచ్చునన్నది రాజకీయ విశ్లేషకుల ఊహ. కొంచెం వెయిట్ చేద్దాం అని అనడంలోనే – విమర్శించడానికి చంద్రబాబు ఎంత ఉత్సుకతతో ఉన్నారు అన్నది అర్థమవుతోంది. ఏదో మరీ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా విమర్శలు మొదలుపెట్టేస్తే బాగుండదని ఆగారేమో గానీ.. వాతావరణం చూస్తుంటే – రేపు జగన్‌ ఏం చేసినా దాన్ని విమర్శలతో మోత మోగించడానికి రంగం సిద్దంగా ఉన్నట్టే అనిపిస్తోంది.

అది ప్రతిపక్షం హక్కు!

సరే. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు. కాబట్టి దాన్ని ఎవరూ కాదనలేం. మరి విమర్శలు మొదలుపెడితే ఎక్కడినుంచి స్టార్టవుతాయి? ఇది కూడా చెప్పడం సులువే! “మోదీకి కేంద్రంలో తగినంత బలం ఉంది కాబట్టి – స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో కేంద్రంలో మరీ గట్టిగా డిమాండ్‌ చేయలేం” – అని జగన్‌ మరీ చిన్నపిల్లాడిలా ఓపెన్‌గా చెప్పేసిన నేపథ్యంలో – పసుపు పార్టీ విమర్శలు ఆ పాయింట్‌ నుంచే ప్రారంభం కానున్నాయని ఊహించవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం దృష్టిలో ఇది కచ్చితంగా జగన్‌ రాజకీయ అపరిపక్వతే! నిజమే. స్పెషల్‌ స్టేటస్‌ వస్తుంది వస్తుంది అని నాలుగేళ్లూ ఊరించి నలగబెట్టి – చివర్లో నై అనాలి గానీ… ఇలా వచ్చిన వెంటనే ఉన్న అవకాశాల గురించి స్ట్రయిట్‌ గా ఉన్నదున్నట్టు చెప్పేయడం … అదేం రాజకీయం? అందుకే ఆ పాయింట్‌నుంచే విమర్శలు స్టార్టవుతాయని చెప్పవచ్చు. అంతే కాదు, ప్రమాణ స్వీకారం తరవాత జగన్‌ తీసుకునే ప్రతి నిర్ణయం మీదా విమర్శల దాడి తథ్యమన్నది కూడా సులువుగానే అంచనా వేయవచ్చు. సో… జగన్! బీ రెడీ! చూద్దాం ఎలా నెగ్గుకు వస్తావో!

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE