కేసీఆర్‌ జగన్‌ స్నేహం ఎవరికి ఇబ్బంది?


ఇంటర్‌నెట్‌ సాయంతో ఎక్కడెక్కడో ఉన్న వ్యక్తులతో స్నేహం చేసే మనిషి – తన ఇరుగుపొరుగున ఉన్నవాళ్లతో మాత్రం సఖ్యంగా ఉండలేడు. ఫారిన్‌వాళ్లతో సైతం పడి చచ్చేంత మిత్రత్వం వెలగబెట్టినా – పక్కవాటావాళ్లతో తగాదాకు దిగుతూ ఉంటాడు. ఇది మనిషి నైజం. ఎందుకంటే – దూరాన ఉన్నవాళ్లు మనతో దేనికీ పోటీకీ వాటాకీ రారు. హాయ్‌ అనో ఓయ్‌ అనో.. అప్పుడో సారీ ఇప్పుడో సారీ పలకరిస్తే సరిపోతుంది. కానీ ఇరుగు పొరుగు అలా కాదు కదా? ఎన్నో సర్దుబాట్లు ఉంటాయి. అవసరాలుంటాయి. పక్కవారితో సఖ్యత కోసం మనం కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా చేయలేకపోతే – ఎంతో విలువైన మనశ్శాంతిని త్యాగం చేయాల్సి ఉంటుంది. బయట ఎంత సాధించినా ఇంట్లోనూ ఇరుగు పొరుగునా శాంతి లేకపోతే – ఆ జీవితం దుర్భరమే అవుతుంది.

ఊహించని స్నేహం

సాధారణంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహితులు కాలేరు. పొరుగు రాష్ట్రాలవారికయితే అది మరీ కష్టం. ఒకవేళ కాగలిగినా – మరీ కేసీఆర్‌ జగన్‌ మధ్య ఏర్పడ్డంత సఖ్యత అయితే ఏర్పడే అవకాశం చాలా తక్కువ. కాబట్టి – కేసీఆర్‌, జగన్‌ల మధ్య పరిఢవిల్లిన, పరిఢవిల్లుతున్న స్నేహం నిజంగా గొప్పదనే చెప్పుకోవాలి. ఇది చాలామంది ఊహించని విషయం.

పెద్దన్నగా కేసీఆర్‌

తెలంగాణ వచ్చేవరకూ ఆంధ్రోళ్లు అంటూ పొరుగురాష్ట్రం ప్రజల్ని తిట్టిపోసిన కేసీఆర్‌, రాష్ట్రం ఏర్పడ్డాక వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు. చివరికి వాళ్ల దృష్టిలో కూడా- “కేసీఆర్ మాట కరుకే గానీ.. మనిషి మంచి” అని మంచి పేరు తెచ్చుకోవడం విశేషం. నిన్నటి వరకూ మీకు మీరే, మాకు మేమే అన్న వ్యక్తి అల్లా ఇప్పుడు – ఒకరికి ఒకరు తోడుగా సాయంగా ఉండాలని అనడం, ఆ విధంగా జగన్‌ కూడా కేసీఆర్‌ ను పెద్ద అన్నలా గౌరవించడం – నిజంగా మెచ్చుకోదగిన విషయం. ఎందుకంటే ఎప్పుడూ ఇరుగుపొరుగుతో స్నేహం ఎంతో గొప్పది. ఎంతో అవసరమైనది. ఇది తెలిసినా ఈ సఖ్యతను అందరూ సాధించలేరు. కానీ కేసీఆర్‌, జగన్ సాధించారు. నిజానికి ఈ స్నేహంలో వీరి గొప్ప ఏమీ లేదనీ, కేవలం ఇద్దరికీ చంద్రబాబు పట్ల ఉమ్మడిగా ఉన్న ద్వేషమూ వ్యతిరేకతే – వీళ్లని కలిపాయనీ అనుకునేవాళ్లు ఉన్నారు.

మీడియాకు ఓకేనా?

సరే. జగన్‌ కేసీఆర్‌ స్నేహానికి కారణాలు ఏవైనా – ప్రతిస్పందన మాత్రం విభిన్నంగా ఉంటోంది. వీరి స్నేహం కొందరికి ఇది చూడముచ్చటగా ఉంటే – కొందరికి మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తోందట. ఆ ఇబ్బంది ఎవరికి? ప్రజలకా? ప్రాంతీయ వాదులకా? ప్రధానికా? ప్రత్యర్థి మీడియాకా? – ఆలోచించి చూస్తే సామాన్య ప్రజలకి వీరి స్నేహం చూడముచ్చటగానే ఉంది. అయితే ప్రాంతీయవాదులకి కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. గతంలో తమని ఘోరంగా తిట్టిపోసిన కేసీఆర్‌తో – సీఎం చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాడనీ, జగన్‌ పట్ల కొందరు ఆంధ్రులు గుర్రుగా ఉండే అవకాశం ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని – ఆంధ్రుల ఆస్తుల్ని జగన్‌ స్నేహం పేరుతో తెలంగాణకి తాకట్టు పెడుతున్నాడని ప్రత్యర్థి వర్గాలు ప్రచారాలు ప్రారంభించాయి. కాబట్టి ఉమ్మడి శత్రువయిన చంద్రబాబు వర్గాలకు కేసీఆర్‌ జగన్‌ స్నేహం కంటగింపుగానే ఉందని అనిపిస్తుంది.

తెలంగాణ సై..

అయితే గమనించి చూస్తే – ఆంధ్రుల కంటే తెలంగాణ వారికి కేసీఆర్‌ జగన్‌ స్నేహం పట్ల పెద్దగా అభ్యంతరాలు కనిపించడం లేదు. ఆంధ్రులలో కూడా కొందరు ఈ స్నేహాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.  అయితే మిగిలినవారికి ఇబ్బందిని కూడా తీసి పారేయలేం. ఎందుకంటే – విభజన వల్ల ఆంధ్రులకి రాజధాని పోయి అపార నష్టం కలిగింది. కానీ తెలంగాణకి అలాంటి నష్టమేమీ జరగకపోగా ఎంతో లాభం కలిగింది. రాష్ట్రం వచ్చేశాక ఇప్పుడు తగవు పెట్టుకోవడం అనవసరం అనే భావం  వారిలో ఉండడం సహజం. అలాగే నష్టపోయిన ఉక్రోషంలో ఉన్న ఆంధ్రులు కొందరికి – ఈ స్నేహం ఇరిటేషన్‌ కలిగించడమూ సహజంగానే తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్న రెండు రాష్ట్రాలూ – ఇప్పుడు ముఖ్యమంత్రుల స్నేహం వల్ల సామరస్యధోరణితో సాగుతున్నాయి. దీనివల్ల కోర్టుల్లో ఎలాంటి వైఖరి అనుసరించాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

నరేంద్రుడికి ఇబ్బందే!?

ఇక ప్రధాని మోదీకి కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్నేహం వల్ల ఇబ్బందే! ‘విభజించి పాలించు’ అనే బ్రిటిష్‌ సూత్రంతో కర్ణాటకలో పార్టీని నిలబెట్టుకున్న బీజేపీ, దక్షిణాదిలో పట్టు సాధించడానికి – తమిళనాడులో కూడా తంపులు పెట్టింది. ఇప్పుడు తెలుగునాడు లోనూ తెలంగాణలోనూ కూడా గొడవలు తీసుకువచ్చేందుకు పథకం రచించకపోదు. ఈ నేపథ్యంలో – ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్‌, జగన్‌ స్నేహంగా ఉండడమే రెండు రాష్ట్రాలకూ మంచిది! దక్షిణాదికి ఏమాత్రం విలువనీయని జాతీయ పార్టీలు రాష్ట్రాలతో తమ ఇష్టంమేరకు ఆడుకోకుండా ఉండాలంటే – ఇక్కడి ముఖ్యమంత్రులంతా ఒక్కటి కావడం – నిజంగా ఒక చారిత్రక అవసరం. దాన్ని ముందుగానే గుర్తించిన కేసీఆర్‌, జగన్‌ ఎంతయినా అభినందనీయులు!

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE