కేసీఆర్‌ అంత గొప్ప లీడరా?


తాజా ప్రెస్ మీట్‌లో కేసీఆర్ మొత్తానికి రెండు విషయాలను కచ్చితంగా నిర్ధారణగా చెప్పారు. అవేంటంటే – టీఆరెస్ ఎవరితోనూ కలిసి పోటీ చెయ్యడం లేదని! రెండవది.. బీజేపీ, కాంగ్రెస్ రెండిటి ప్రసక్తీ లేని – ఒక ఫ్రంట్ స్థాపన దిశగా పనులు జరుగుతూనే ఉన్నాయని! ఈ రెండు విషయాలనూ ఆయన రూఢిగా చెప్పారు.

నిజమే, “తెలంగాణ ఇచ్చింది మేమే!” అని కాంగ్రెస్ ఎన్ని కబుర్లు చెప్పినా… ఇప్పటికే కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని బాగా ఆకట్టుకున్నారు. 2024లో వచ్చే ఎన్నికల సంగతేమో గానీ, 2019లో వచ్చే ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ తప్ప మరొకరు వచ్చే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులంటున్నారు. కేసీఆర్ అయితే తమకి 100కి పైగా సీట్లు వస్తాయని చెబుతున్నారు. అయితే మరీ 100 సీట్లు రాకున్నప్పటికీ, కచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ పదవిలోకి వచ్చే అవకాశం ఉందని ఓ అంచనా.

ఇకపోతే, కేసీఆర్ ఏంటి?.. కాంగ్రెస్‌కి, బిజేపీకీ వ్యతిరేకంగా పెద్ద ఫ్రంట్ రూపొందించి జాతీయస్థాయిలో నాయకత్వం వహించడం ఏంటి? అంత సీన్ ఈయనకుందా? – అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ మరోసారి తన సంకల్పాన్ని నిర్ధారణగా చెప్పారు. ఇటు కాంగ్రెస్‌కి కానీ, అటు బీజేపీకి గానీ సంబంధం లేకుండా మూడో ఫ్రంట్ అనేది కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. అసలు మూడో ఫ్రంట్‌ అని దాన్ని పిలవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అదే భారతరాజకీయాల్లో గొప్ప ప్రత్యామ్నాయం అవుతుందని ఆయన బలంగా నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే – ఇదేదో అల్లాటప్పాగా నాలుగైదు పార్టీలు కలిపి మహాకూటమిలాగో.. ఇంకో కూటమి లాగానో తాత్కాలిక అవసరాల కోసం చేసేది కాదని ఆయన గట్టిగా చెబుతున్నారు.

దేశం కోసం ఒక ప్రత్యామ్నాయాన్ని తయారు చేసే గొప్ప పని సుదీర్ఘమైన ప్రణాళికతో జరుగుతోందన్నట్టుగా ఆయన చెప్పారు. నిజంగా అలా జరిగితే మంచిదే. ఎందుకంటే – స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్లు దాటిపోయినా – ఇప్పటికీ భారతీయులు – కాంగ్రెస్ కాకపోతే బీజేపీ… బీజేపీ కాకపోతే కాంగ్రెస్ అంటూ ఇటూ అటూ గంతులేయాల్సిందే తప్ప మరో ప్రత్యామ్నాయం లేని స్థితిలోనే ఉన్నారు.

మరి జాతీయస్థాయిలో నాయకత్వం వహించగల సామర్థ్యం కేసీఆర్‌కు ఉందా అంటే.. ఆయనకీ ఓ చరిత్ర ఉంది. తన సొంత చేతుల మీద హింస అన్నది ఎక్కడా జరగకుండా ఒక కొత్త రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత ఆయనకుంది. అసలు కేసీఆర్ మాటకారితనంతోనే ఎన్నో అసాధ్యాలు సుసాధ్యం అయిపోతాయంటారు ఆయన అభిమానులు. అంతేకాకుండా – అవసరమైతే గొడవ పెట్టుకోవడానికి కూడా కేసీఆర్ ఎప్పుడూ వెనుకాడరు. ఈ లక్షణాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే, దక్షిణాదిలో బీజేపీ, కాంగ్రెస్ రెండిటితోనూ పోరాడగలిగే దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ తప్ప మరొకరెవరూ కనిపించడం లేదు. వీరుడిలా ప్రవర్తించే జగన్‌ కూడా కేసుల కారణంగా బలహీనుడయ్యారనిపిస్తుంది. అందుకే – ఇప్పుడు బీజేపీ వైపుంటూ కాంగ్రెస్ ని వ్యతిరేకించేవారు… లేదా బీజేపీని వ్యతిరేకించడం కోసం కాంగ్రెస్‌లోకి దూరేవారే తప్ప, రెండిటినీ ఎదిరించి మూడో ఫ్రంట్ నడుపుతాననగలిగే దమ్ము కేసీఆర్ లో తప్ప ఎవరిలోనూ కనిపించడం లేదు.

నిజంగా కేసీఆర్ మహానాయకుడా అని సందేహం వెలిబుచ్చేవారికి … సింపుల్‌గా ఒక్క మాటలో జవాబు చెప్పవచ్చు. కేసీఆర్ మొదటి నుంచీ చంద్రబాబుతో వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. అయినప్పటికీ తెలంగాణను వ్యతిరేకించిన కారణంగా వైఎస్‌కి కూడా దూరంగానే ఉంటూ ఉండేవారు. అసలు వైఎస్‌ బతికుంటే తెలంగాణయే వచ్చేది కాదని ఇప్పటికీ జనం అనుకుంటూ ఉంటారు. అప్పట్లో – చంద్రబాబును కాదని వైఎస్‌కు సానుకూలంగా ఉన్నా… వైఎస్‌ని కాదని చంద్రబాబుకు సానుకూలంగా ఉన్నా… కేసీఆర్‌కి వ్యక్తిగతంగా, రాజకీయంగా లాభం కలిగేది. అయినప్పటికీ ఆయన ఇద్దరితోనూ పోరాటం చేశారు తప్ప, ఏనాడూ వీళ్ళ గురించి భయపడి ఆ శిబిరంలోనూ, వాళ్ళ గురించి భయపడి ఈ శిబిరంలోనూ చేరలేదు. ఈ లక్షణమే రేపు థర్డ్ ఫ్రంట్ తయారీలో కేసీఆర్ కి సహకరిస్తుందని విశ్లేషకులంటున్నారు. ఆయన పోరాట మనస్తత్త్వానికి, విభిన్నమైన ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తూ మంచి ప్రత్యామ్నాయం లభిస్తే – అందరికీ మంచిదే మరి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu