ఏపీటీ 41… ఈ పేరు వింటేనే దడ!

‘ఏపీటీ 41’ అనే పేరు వింటే అమెరికన్లు హడలి పోతున్నారట. అబ్బే.. దీనికీ మన ఏపీకీ సంబంధం లేదు. ఇది ఒక చైనా హ్యాకర్ గ్రూప్ పేరు.

“ఫైర్ ఐ” అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకి చెందిన ఎక్స్‌పర్ట్స్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ మీద పరిశోధనలు చేస్తూ నేరస్తుల్ని కనిపెడుతుంటారు. ఇటీవల ఏపీటీ 41 అనేది అత్యంత సమర్థతతో పనిచేసే చైనీస్ గ్రూపుల్లో ఒకటట. ఇటీవల చైనీస్ సర్వర్స్ మీద చేసిన రకరకాల పరిశోధనల్లో ఈ ఏపీటీ 41 గురించి ఎన్నో వివరాలు బయటపడ్డాయి.

చైనా ప్రభుత్వమే స్వయంగా ఇతరుల సమాచారం కోసం, తన దేశ అవసరాల కోసం ఎన్నో హ్యాకర్ గ్రూపులను పెంచి పోషిస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే వీటన్నిటిల్లో ‘ఏపీటీ 41’ అనేది చాలా శక్తిమంతమైందని ఫైర్ ఐ ఇంటెలిజెన్స్ వర్గాలంటున్నాయి.

2012 నుంచీ ఏపీటీ 41 చాలా చురుకుగా ఉంది. ఇది ముఖ్యంగా వీడియో గేమ్ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంటుంది. వీళ్ళు క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్‌ చేసిన దాఖలాలు కూడా కొన్ని ఉన్నాయి. గత ఏడేళ్ళలో ఈ ఏపీటీ 41 హ్యాకర్ గ్రూపు ఎంతో బలిష్ఠంగా తయారయిందట.

ఈ గ్రూపు ప్రత్యేకత ఏమిటంటే, వీళ్ళు నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉంటారట. ఎవరినైనా టార్గెట్ చేసుకుంటే దానిని సాధించే వరకూ వదలరట. చాలాసార్లు ఎవరినైనా టార్గెట్ చేసి ఆ సమాచారాన్ని దొంగిలించాలని అనుకుంటే… ఒకోసారి అక్కడున్న డిజిటల్‌ సెక్యూరిటీ ఏర్పాట్ల వల్ల అది సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇతర హ్యాకర్లయితే – “ఇది కాస్త ఇబ్బందిగా ఉంది. దీని సంగతి తరవాత చూద్దాంలే” అని వదిలేస్తారు. కానీ ఈ ఏపీటీ 41 గ్రూపు అలా కాదట. పని అయ్యే వరకూ పదే పదే పదే రకరకాల మాల్‌వేర్లు తయారు చేసి, అనుకున్న టార్గెట్ సాధించి తీరుతారట. అదే వీళ్ళ ప్రత్యేకత అట. ఈ ఆదర్శంతోనే వీళ్లు – ఒక టార్గెట్‌ను ఛేదించడం కోసం కేవలం ఒక్క ఏడాది కాలంలో 150 వరకూ రకరకాల మాల్‌వేర్ కోడ్స్ వాడారని ఫైర్ ఐ వాళ్ళ పరిశోధనలో తేలింది.

చైనా ప్రభుత్వమే పెంచిపోషిస్తున్న ఈ హ్యాకర్ గ్రూపు – తమ సర్కారు తమకు అప్పగించిన పనితో పాటు – మధ్య మధ్యలో స్వామి కార్యం… స్వకార్యం అన్నట్టుగా తాను కూడా కొన్ని సొంత హ్యాకింగ్‌ పనులకు పాల్పడుతోందట. వాటిని అధికారులు చూసీచూడకుండా వదిలేస్తున్నారట. మరేం చేస్తాం, దొంగలనంటూ పెంచి పోషించడం మొదలుపెట్టిన తరవాత – వాళ్ళను కాస్త ఉదారంగా చూసుకోవాలి మరి. లేకపోతే రేపటిరోజున వాళ్ళు మన ఇంటికే కన్నం వేసినా ఏం చెయ్యలేం కదా! ఇదీ చైనాలో స్పాన్సర్డ్ హ్యాకింగ్ పరిస్థితి!

This post is also available in: ఇంగ్లిష్‌