ఏం, టిక్‌ టాక్‌ ఒక్కటే దొరికిందా?

టిక్‌ టాక్‌… ఈ యాప్‌ ఈ మధ్య తెగ పాపులర్‌ అయిపోయింది. ఓపెన్‌ చేస్తే చాలు… వగలు పోయే అమ్మాయిలు.. కబుర్లు చెబుతూ వివిధ శరీర భంగిమలు ప్రదర్శి్స్తూ… కొన్ని ముచ్చటగా కనిపించినా.. కొన్ని సార్లు అసభ్యత.. అశ్లీలత.. అనేకసార్లు హద్దులు మీరిన వీడియోలు… ఇదీ టిక్‌టాక్‌ ప్రపంచం!

అసలే యూట్యూబులూ ఫేస్‌బుక్కులంటూ ఫోనుల్లో దూరిపోతున్న కొత్తతరానికి ఈ వగలుపోయే వలపురాణుల వీడియోలు కూడా అందులోనే ఉంటే – ఇంక బయటికి వచ్చే ఛాన్సే లేదు. పొద్దుటనుంచి అవే వీడియోలు చూస్తూ మానసిక వికారాలకి లోనుకావడం ఇప్పుడు ఓ అలవాటుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. మరి ప్రమాదాన్ని పసిగట్టిందో ఏమో… మద్రాస్‌ హైకోర్ట్‌ మదురై బ్రాంచ్‌ నిషేధించడానికి ముందుకొచ్చింది. ఏప్రిల్‌ 16 న తదుపరి విచారణ జరగనున్న నేపథ్యంలో – ఈ టిక్‌ టాక్‌ వీడియోల్ని మెయిన్‌ మీడియాలో కూడా ప్రసారం చేయవద్దంటూ మీడియా సంస్థలకి కోర్టు సూచించింది.

నిజమే! టిక్‌టాక్‌ ని నిషేధించడం ఓ సామాజిక బాధ్యతగా కూడా కొందరు ఫీలవుతున్నారు. అయితే టిక్‌ టాక్‌ ఒక్కటే ఈ పని చేస్తోందా? పొద్దుట లేస్తే – ఫ్రీ వీడియో షేరింగ్‌ పేరుతో జనానికి ఆకర్షణనీ అసభ్యతనీ పంచిపెట్టే యాప్స్‌ మరెన్ని లేవు? Kwai, Voot, Viu, togetU, VigoVideo, VivaVideo… ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. టిక్‌ టాక్‌ మీద పరిమితులు విధించే ముందు వీటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. చెప్పండి, వీటినేం చేద్దాం మరి?

This post is also available in: ఇంగ్లిష్‌