ఎలక్షన్ దెబ్బ.. యూట్యూబ్ అబ్బా!

భారతదేశంలో ఎలక్షన్స్ కాదు గానీ, ఆ బరువంతా పాపం యూట్యూబ్ మోయాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా – దానిని వీడియో రూపంలో యూట్యూబ్‌కు అప్‌లోడ్ చేయడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది. ఇటీవలి కాలంలో ప్రతి రోజూ 40 వేల నుంచి 50 వేల వరకూ వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంటాయి. మరి నిత్యం ఇన్నేసి వీడియోలు వచ్చి కలుస్తుంటే – వాటిని యూట్యూబ్ సర్వర్లు ఎలా భరిస్తున్నాయో… మెమొరీ మేనేజ్‌మెంట్‌ కోసం వాళ్లు ఏ టెక్నాలజీ అమలు చేస్తున్నారో… ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే!

ఇటీవల భారతదేశంలో అనేక విడతల్లో ఎలక్షన్స్ జరిగిన సందర్భంగా  గమనిస్తే – సాధారణ పరిస్థితుల్లో భారతదేశం నుంచి యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యే వీడియోల సంఖ్యకంటే- దాదాపు 10 నుంచి 15 రెట్లు ఎక్కువ వీడియోలు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయ్యాయట. ఎలక్షన్ క్యాంపెయినింగ్ నుంచి మొదలుపెట్టి, ఓటింగ్ వీడియోలు, లైవ్‌లు, ఛానెల్స్ ప్రోగ్రాములు, తాజాగా ఎగ్జిట్ పోల్స్ – ఇవన్నీ కలుపుకుని చూస్తే – ఊహించలేనన్ని వీడియోలతో యూట్యూబ్ సర్వర్లను నింపేశారు మన భారతీయులు. ఇప్పుడు ప్రతి ఎగ్జిట్ పోల్ మీదా చర్చలు మొదలయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ తరవాత నాయకుల హడావిడీ రకరకాల రూపాలు తీసుకుంది. మరి ఇన్ని రకాల విశేషాల్ని ప్రేక్షకులకి చేరవేయాలంటే – ఒకే ఒక్క ఆయుధం యూట్యూబ్‌!  ఈ విశాల విశ్వంలో ఏ మూల ఏం జరిగినా వీడియో రూపంలో అది యూట్యూబ్‌ టార్గెట్ కావడం నిజంగా గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. రాను రాను యూట్యూబ్‌ తన మెమొరీ మేనేజ్‌మెంట్‌ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి!

This post is also available in: ఇంగ్లిష్‌