ఎన్టీఆర్‌ ఇమేజ్‌ డౌన్‌ డౌన్‌!?


ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఏ ముహూర్తంలో స్టార్ట్‌ చేశారో గానీ, అప్పటినుంచీ ఎన్టీఆర్‌ ఇమేజ్‌ పడిపోవడం ప్రారంభమయిందనే విమర్శలు జోరుగా వినవస్తున్నాయి. ఆ బయోపిక్‌ ప్రకటించగానే పోటీగా మరో రెండు బయోపిక్‌లు మొదలయ్యాయి. రెండింటిలోనూ – ఎన్టీఆర్‌ అభిమానులు ఆయన చరిత్రలోంచి చింపేయాలని భావించే – ఎన్టీఆర్‌ రెండోపెళ్లి ప్రకరణమే ముఖ్యపాత్ర వహించడం – ఇక్కడ గుర్తించదగిన విషయం. ఈ విధంగా – ఒక పక్క లక్ష్మీస్‌ ఎన్టీఆర్ తీస్తున్న రామ్‌గోపాల్‌ వర్మ, లక్ష్మీస్‌ వీరగ్రంథం బయోపిక్‌ తీస్తున్న కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎన్టీఆర్‌ ఇమేజ్‌ని అప్రయత్నంగానే దెబ్బతీశారు. అయితే వీరు ఎన్టీఆర్‌ మీద గౌరవభావం ప్రదర్శిస్తున్న వ్యక్తులే అయినప్పటికీ – ఎన్టీఆర్‌ జీవితంలోని దేన్నయితే ఎవరూ టచ్‌ చేయకూడదని ఎన్టీఆర్‌ అభిమానులు భావిస్తారో వాటినే వీరు ప్రస్తావిస్తూ ఉండడం వల్ల – ఈ తరంలో ఎన్టీఆర్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ కావడం ప్రారంభమయిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్‌ ఇమేజ్‌ పెంచాలని తీసిన బయోపిక్‌ కి కలెక్షన్లు లేకపోవడం ఇంతకు మించిన విషాదం.

పోటీ బయోపిక్‌లకి తోడు – యూట్యూబ్‌ ఛానెల్స్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌కి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చెప్పే కథనాలు కూడా – ఈ తరంలో ఎన్టీఆర్‌ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీశాయి, తీస్తున్నాయి. ఎన్టీఆర్‌ని ఈ తరానికి ఒక దైవస్వరూపంగా చూపించాలని భావించేవారికి ఇది ఓ ఎదురుదెబ్బ. ఇప్పుడు జర్నలిజం కొందరి చేతుల్లోంచి జనం చేతుల్లోకి వచ్చేసింది. పాతకాలం నాటి ఎన్టీఆర్‌ సన్నిహితులు మాట్లాడుతుంటే – ఎన్నో యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఎగబడి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. అవే ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి అతి పెద్ద బెడదగా తయారయ్యాయి. ఎన్టీఆర్‌ ఏమీ మరీ అంత గొప్ప వ్యక్తి కాదనీ, కేవలం మీడియా సపోర్ట్‌ వల్లే ఆయనకి ఇంత ఫోకస్‌ వచ్చిందనీ – కొత్త తరం ఇప్పుడు భావిస్తున్నారంటే – అందులో యూట్యూబ్‌ ఛానెల్స్‌ పాత్ర చాలా ఉంది. ఒక పక్క నాగబాబు బాలకృష్ణ గొడవ కూడా ఎన్టీఆర్‌ ఇమేజ్‌ ని పరోక్షంగా దెబ్బతీస్తోంది.

ఇక పోతే – మరికొందరు మరింత ముందుకి పోయి – ఎన్టీఆర్ జీవితంలోని వివాదాస్పద విషయాల్ని ఏమాత్రం మొహమాటం లేకుండా చెబుతున్నారు. ఎన్టీఆర్‌కి నేర ప్రవృత్తి ఉందనీ, ఆయన కొన్ని హత్యలు చేయించాడనీ నాదెండ్ల భాస్కరరావు లాంటివారు అనేస్తుంటే – ఔత్సాహికులైన వంగవీటి నరేంద్ర లాంటి యువకులు – ఇంకా ముందుకి పోయి, ఎన్టీఆర్‌ శవపూజల గురించీ, చీర కట్టుకుని స్త్రీవేషాలు వేయడం గురించీ కూడా బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. ఒకనాడు ఎన్టీఆర్‌ వేషం వేసినందుకే కోట శ్రీనివాసరావుని కొట్టారని అంటారు. అలాంటిది ఇప్పుడు ఇంత ఓపెన్‌ గా ఎన్టీఆర్‌ని తిడుతుంటే – ఏమీ చేయలేని పరిస్థితి ఉంది.

మొత్తం మీద ఎలక్షన్ల ముందర ఎన్టీఆర్‌ మీద దాడి ప్రారంభమయిందని చెప్పవచ్చు. ఇంతకాలం – తెలుగుదేశం వ్యతిరేకులు కూడా – విమర్శలు చేసేటప్పుడు ఎన్టీఆర్‌ విషయంలో కాస్త ఔదార్యంతో ఉండడం సంభవించేది. వాళ్లు తెలుగుదేశాన్ని విమర్శించేటప్పుడు – ఎన్టీఆర్‌ గొప్పవాడే కానీ, చంద్రబాబే ద్రోహి అన్నట్టు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారిపోయింది. ఏం? ఎన్టీఆర్‌ మాత్రం తప్పులు చేయలేదా? వాటిని కృష్ణ సినిమాలుగా తీయలేదా? ఎందుకు ముసుగులో గుద్దులాట? ఎన్టీఆర్‌ ఇమేజ్‌ గురించి మనం ఎందుకు బాధపడాలి? నిజాలు పచ్చిగా మాట్లాడదాం. తప్పేముంది? – అనే ధోరణి జనంలో- ముఖ్యంగా సోషలో మీడియాలో కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకీ, ఒక వర్గానికీ అసలు ఆయువుపట్టు అయిన ఎన్టీఆర్‌ ఇమేజ్‌ దెబ్బ తింటే తెలుగుదేశం ఇక లేవలేదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. అసలే తెలంగాణలో చావుదెబ్బ తిన్న టీడీపీకి ఇది దుర్వార్తే! ఇంతకాలం ఎన్ని విమర్శలున్నా – ఎన్టీఆర్‌ ఇమేజ్ మీద లాక్కొస్తున్న ఆ పార్టీకి – ఈ కొత్త ధోరణి – మూలిగే నక్క మీద తాటిపండు లాంటిదే!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu