ఇండియా కోసం కొట్టుకుంటున్న శామ్‌సంగ్‌, షియామీ!


ఒకప్పుడు ఒక దేశం కోసం రాజులు యుద్ధాలు చేసుకోవడం జరిగేది. అయితే ఇప్పుడు ఒక దేశపు మార్కెట్‌ మీద పట్టుకోసం ఫోన్‌ కంపెనీలు కొట్టుకుంటున్నాయి. అవే – శామ్‌ సంగ్‌ షియామీ.

శామ్‌సంగ్‌ నిన్నమొన్నటిదాకా ఇండియన్‌ మార్కెట్లో – టాప్‌ గా ఉండేది. ఫోన్‌ అనగానే భారతీయులకి శామ్‌ సంగే మొదట గుర్తుకొచ్చేదంటే ఆశ్చర్యం కాదు. కొత్తగా శామ్‌సంగ్‌ గెలాక్సీ ఫోన్స్‌ మార్కెట్లోకి వచ్చినపుడు – ఆ ఫోన్‌ కలిగి ఉండడమే ఓ స్టేటస్‌ సింబల్‌ అన్న స్థాయిలో శామ్‌ సంగ్‌ భారతీయుల హృదయాల్ని దోచింది. అయితే ఈ మధ్య కాలంలో ఇండియాలో షియామీ ( Xiaomi) ఫోన్లకి విపరీతంగా ఆదరణ పెరిగింది. దాన్నే ఇప్పుడు శామ్‌సంగ్‌ జీర్ణించుకోలేకపోతోందట.

షియామీ కంపెనీ ఫోన్లకి ‘ చైనా యాపిల్’ అని పేరు. ఇవి ఇండియాలో రిలీజైన మొదట్లోనే ఆదరణ పొందాయి. అయితే తరవాతి కాలంలో వీటిమీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్లు వాడితే భారతీయుల డేటా తస్కరణకు గురవుతోందనీ, ఫోన్ వాడుతున్నప్పుడే మన వివరాలన్నీ చైనా సర్వర్లకి చేరిపోతున్నాయనీ మిలటరీ కోణంలోంచి కూడా విమర్శలు రావడంతో – కొనేవాళ్లు కొంత వెనకడుగు వేశారు. అయితే కాలం గడిచే కొద్దీ Mi ఫోన్ల నాణ్యత పెరుగుతూ వచ్చింది. వేడెక్కడం లాంటి సమస్యల నుంచి పూర్తిగా దూరమై, బలమైన నిర్మాణంతో యాపిల్ ఫోన్‌ల మాదిరిగానే ఇవీ తయారుకావడం మొదలయింది. పైగా జనం డేటాకి ఎలాంటి ప్రాబ్లెం లేదంటూ షియామీ హామీ ఇచ్చింది. దాంతో డేటా సెక్యూరిటీ గురించి బాధపడడం తగ్గించి – జనం వీటి వెంటపడ్డారు.

Mi ఫోన్‌లకి మంచి ఆదరణ రావడానికి చాలా కారణాలున్నాయి. ఫోన్‌తో పాటే అతి ముఖ్యమైన యాప్స్ అన్నిటినీ ఇచ్చేయడం.. వివిధ డివైజెస్‌తో రిమోట్‌గా కూడా వాడుకునేలా ఉండటం.. వీటిలో ముఖ్యమైనవి. డిఫాల్ట్ గా వివిధ పనులకోసం జెశ్చర్స్‌ సిద్ధంగా ఉండటం కూడా షియామీలో ప్లస్‌ పాయింట్‌. ఉదాహరణకి వేరే కంపెనీల ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే.. వాల్యూం ప్లస్ బటన్, పవర్ బటన్ ఒకేసారి కలిపి నొక్కాల్సి ఉంటుంది. ఇదే Mi ఫోన్‌లో అయితే – మూడు వేళ్లతో స్క్రీన్ మీద రాస్తే చాలు, అదొక స్క్రీన్ షాట్‌గా సేవ్‌ అవుతుంది. ఇలాంటి ఎన్నో షార్ట్ కట్స్ Mi ఫోన్లలో లభిస్తున్నాయి. అలాగే షియామీ ఫోన్లలో థీమ్స్‌ , వాల్‌ పేపర్లలో కూడా ఎంతో వెరైటీ లభిస్తుంది.

శామ్‌ సంగ్‌ ఫోన్లు డిస్‌ ప్లేకి ఎంతో పేరెన్నికగన్నవి. అయితే అవి కాస్త డెలికేట్‌ గా ఉంటాయని చెప్పవచ్చు. శామ్‌సంగ్‌ ఫోన్లలో బ్యాటరీ కూడా – ఇప్పుడు కాస్త మెరుగయినప్పటికీ – గతంలో ఎంతో ఇబ్బంది పెట్టేది. కానీ షియామీ ఫోన్స్‌ అలా కాదు. ఇవి యాపిల్‌ ఫోన్లలాగ బలంగా ఉంటాయి. పైగా రెడీమేడ్‌ ఫీచర్స్‌ ఎక్కువ. ఇలాంటి కారణాల వల్ల ఇప్పుడు ఇండియన్‌ మార్కెట్లో షియామీ రాజ్యమేలుతోంది. మరి దీన్ని తగ్గించి తిరిగి తన మార్కెట్‌ పెంచుకోవడానికి శామ్‌సంగ్‌ సరికొత్త వ్యూహాలు రచిస్తోందని వినికిడి. వ్యాపారం కదండీ? అలాగే ఉంటుంది మరి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu