ఇండిపెండెన్స్‌ డే రోజు డాలర్‌ డిపెండెన్సీ!


స్వాతంత్ర్య దినోత్సవం వచ్చింది. భారతదేశమంతా సంతోషంగా జరుపుకునే వేడుక ఇది. దేశంలో ఉన్న పౌరులందరూ స్వాతంత్ర్య సమరయోధుల్నీ, వాళ్లు మనకి సాధించిపెట్టిన విజయాల్నీ గుర్తు చేసుకుని వాళ్ళ త్యాగాలకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. నిజమే. అయితే ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు, స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఇప్పుడు ఒక విధమైన వేలం వెర్రిలా.. వెల్లువలా రెచ్చిపోతున్నాయి.

గతంలో ఈ స్వాతంత్ర్య దినోత్సవ ఫ్లేవర్ గూగుల్ డూడుల్స్ లో మాత్రమే కనిపించేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ పెరిగిపోయి… ఫేస్ బుక్, వాట్సాప్ వాడకం బాగా ఎక్కువై.. ప్రతి ఒక్కరూ మహా దేశభక్తులై కనిపిస్తున్నారు. దేశభక్తి గురించి గొప్ప గొప్ప కొటేషన్లు షేర్ చెయ్యడం, స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను వీడియోలు, ఇమేజ్‌ల రూపంలో జనానికి పంచిపెట్టడం, ప్రబోధించడం – గతంకంటే కంటే ఎన్నో రెట్లు పెరిగిపోయింది.

నిజంగా జనంలో ఇలా దేశం పట్ల చైతన్యం కలిగి ఉండడం మంచిదే. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే – ఈ పోస్టుల్లో షేరుల్లో – చాలావరకూ ‘ఆగస్ట్‌ 15’ అనే ఈవెంట్‌కి ఉన్న క్రేజ్‌ని వాడుకోవాలన్న ఉద్దేశం మాత్రమే కనిపిస్తోంది. చరిత్ర మరచిపోయిన మహావ్యక్తుల, త్యాగధనుల మాటలు మీమ్‌ లు చేసి పెడుతున్నారు. స్వాతంత్ర్య యోధుల జీవితాల గురించి వెతికి వెతికి పరిశోధనలు చేసి మరీ యూట్యూబ్‌లో వీడియోలు నింపుతున్నారు. ఇదంతా ఆ పెద్దలమీద ప్రేమేనా? అంటే చెప్పలేం. మన వీడియోకి నాలుగు హిట్స్ రావాలి… మన ఛానెల్‌కి సబ్‌స్క్రైబర్లు, వ్యూస్ పెరగాలి. యూట్యూబ్‌లో యాడ్ రెవెన్యూ పెరిగి డాలర్స్ రావాలి… ఇవే చాలామంది లక్ష్యాలుగా కనిపిస్తోంది. తెలిసీ తెలియక వీళ్లు పెట్టే పోస్టుల్లో చరిత్ర పరంగా ఎన్నో తప్పులూ, దోషాలూ కనిపిస్తున్నాయి. ఈవెంట్‌ చల్లారిపోకుండా.. తొందరగా ఏదో ఒకటి పోస్ట్‌ చేసేయాలన్న తాపత్రయమే ఇందుకు కారణం కావచ్చు.

సరే, ఏదేమైనా వాళ్లంతా చేస్తున్నది మంచిపనే కదా.. దేశభక్తే కదా? – ఇలా అనుకుని అడ్జెస్ట్ అవుదామంటారా? ఓకే ఏం చేస్తాం? అంతకుమించి మాత్రం ఏం చెయ్యగలం? శుభాకాంక్షలు చెప్పడం తప్ప? అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu