ఆరు స్టెప్పుల్లో షిఫ్ట్‌… అమరావతి ఫినిష్‌ !!

జగన్‌కి తెలియదా రాజధాని ఎలా మార్చాలో !?


తెలుగువాడు చెప్పినట్టు గానే అమరావతి పని అయిపోయింది. ఆగస్ట్‌లో మేం చేసిన విశ్లేషణ జనవరి నాటికి పూర్తిగా నిజం కావస్తోంది. ఆ సందర్భంగా – అప్పుడు ఐదు నెలలకి ముందు – మేము రాసిందేంటో మళ్లీ ఓసారి చూద్దామా?

తను చెయ్యదల్చుకున్నదానిని ముందు ప్రజామోదయోగ్యంగా చేసి, ఆ తరవాత అమలులో పెట్టడమన్నది రాజకీయనాయకులు పాటించే విధానం. ఇలా చేయడానికి చాలా తెలివితేటలుండాలి. మనకి నచ్చేదాన్నే అందరికీ నచ్చేలా చేసి – తాను అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకునే ఈ సామర్థ్యాన్నే మనం సింపుల్‌గా ‘రాజకీయం’ అంటుంటాం. అయినా మన పిచ్చిగానీ.. జగన్‌కి తెలియదా? రాజధానిని స్మూత్‌గా ఎలా షిఫ్ట్‌ చేయాలో!

రాజధానిని మార్చి తీరాలన్నది జగన్ సంకల్పంగా కనిపిస్తోంది. అమరావతిలో పనులన్నీ తప్పులతడకలుగా సాగడం, అక్కడ చంద్రబాబు ఇమేజ్‌ అన్నది రాజధానితో ముడిపడి ఉండటం, ఇలాంటి కారణాలన్నీ వైసీపీని కచ్చితంగా కొత్త రాజధానివైపు ప్రేరేపిస్తాయన్నది తెలిసిన విషయమే. అయితే ఎన్నో లక్షల మందితో ముడిపడి ఉన్న రాజధానిని మరో చోటికి మార్చాలన్న సంకల్పాన్ని అమలు చెయ్యాలంటే – అది అంత సులువు కాదు. ఎన్నో మజిలీలు దాటుకుంటూ ప్రణాళికలో ముందుకి పోవాలి. రాజధాని మార్పు అనే ఈ మిషన్‌ని అమలు జరపడంలో బహుశా జగన్‌ అనుసరించబోయే స్టెప్స్ వరస క్రమం ఇలా ఉంటుందని అనుకోవచ్చు. ఇది ఒక విశ్లేషణ పూర్వకమైన అంచనా మాత్రమే!

ఒకటో స్టెప్‌ … ముందుగా ఫీలర్స్ వదలడం

ఇప్పుడు మనం చూస్తున్నాం… మంత్రి బొత్స లాంటి వాళ్ళందరూ వచ్చి – రాజధానిని మార్చేస్తారేమో… అన్న అభిప్రాయాన్ని కలిగించేలా – జనం ముందుకొచ్చి మాట్లాడటం. ఇంతలో కొడాలి నాని లాంటి మరొకరు ముందుకు వచ్చి “రాజధానిని మార్చేస్తామని మేం చెప్పామా.. ఎవరు చెప్పారు.. ఎవరూ కన్‌ఫర్మ్ చెయ్యలేదు కదా.. అమరావతిలో అవకతవకలు జరిగాయని మాత్రమే అన్నాం… అంతేగానీ మార్చేస్తామని మీకెవరు చెప్పారు? ” అని కొంతమంది మాట్లాడటం. ఇలా కొద్ది కొద్దిగా అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడిన తరవాత జనంలో మార్పు గురించి మానసికంగా ఒక విధమైన వేదిక ఏర్పడుతుంది. దాంతో పని సులువవడానికి ప్రథమ సోపానం ఎక్కినట్టే అవుతుంది.

ఆ తరవాత రెండో స్టెప్ … ఒక చోటే ఎందుకు?
అసలు ఒక్కచోటే రాజధాని ఎందుకు? అసలు కాన్‌సంట్రేషన్ అంతా ఒకే చోట చెయ్యడం వల్లే కదా సర్వనాశనమమయింది? మనదనుకున్న.. అన్నీ అనుకున్న హైదరాబాదును వదిలేసి అనాథల్లా వెనుదిరిగి రావాల్సి వచ్చింది? అనే ఫీలింగ్స్‌ ప్రాతిపదికగా మీడియాలో కొన్ని చర్చలు నడవడం… ఇదంతా జరుగుతుంది.

మూడో స్టెప్‌ .. సుస్పష్టంగా అవినీతి
… అక్కడ అమరావతిలో చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించినవి ఈ దశలో కొంత.. తరవాతి దశల్లో కొంత ఒక్కొక్కటిగా బయటపెట్టడం జరుగుతుంది. దేని తరవాత ఏది అన్న విషయంలో కూడా మంచి ప్రణాళిక ఉంటుంది. ప్రజలకు పూర్తిగా పాత రాజధాని చాలా ఘోరమైనదనే విషయాన్ని ఉదాహరణలతో నిరూపించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది.

ఇక నాలుగో స్టెప్‌… ప్రజారాజధాని అందరిదీ కావాలిగా?
వేరే ప్రాంతాలు ఏవేవి రాజధానికి ఆమోదయోగ్యమన్నది – నేరుగా ప్రజల నుంచే రాబట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు రాజధాని మార్పు అనగానే అమరావతివాళ్ళు ముందుకొచ్చి “మాకు రాజధాని అని చెప్పి ఆశపెట్టారు, ఇక్కడి నుంచి రాజధాని తీసుకుపోతే ఎలాగ?” అని సహజంగానే గొడవ చేస్తారు. దీనిని ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరిగిపోతోందంటూ చంద్రబాబు అనుకూల మీడియా వాడుకోవడమూ సహజం. అయితే, ఎప్పుడైతే మరి కొన్నిచోట్ల కూడా రాజధాని వచ్చే అవకాశముందని చెప్పామో.. ప్రజల్లో చీలిక కచ్చితంగా వస్తుంది.

ఉదాహరణకి – “విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు ఇలా కొన్ని ప్రాంతాల్ని రాజధాని ప్రాంతాలుగానూ, రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాలుగానూ అభివృద్ధి చేస్తాం” అని అన్నారనుకోండి. అమరావతి ప్రజల్లాగే ఆయా ప్రదేశాల్లోని స్థానిక ప్రజలు కూడా సంతోషిస్తారు. తమ భూముల రేట్లు పెరుగుతాయనీ, ఆస్తులు వస్తాయనీ, అభివృద్ధి జరుగుతుందనీ ఆశపడటం, ఆనందపడటం సహజం. దాంతో ప్రజల్లోనే ఒక విధమైన చీలిక వస్తుంది. “ఏం? అమరావతి వాళ్ళకు మాత్రమే రాజధాని అని రాసిచ్చారా?… మాదీ ఆంధ్రప్రదేశే… మాక్కూడా అభివృద్ధి కావాలి” ఈ ప్రాంతాలవారు కూడా ముందుకు రావడం జరుగుతుంది. దాంతో ఒక విధంగా ప్రజావ్యతిరేకతను ప్రజలతోనే మళ్ళీ అణచివేయడం జరగడంతో సానుకూల వాతావరణం ఏర్పడి రాజధాని తరలింపుకు వేదిక సిద్ధమవుతుంది. ఇప్పటికే విశాఖని రాష్ట్రానికి ఆర్థిక రాజధాని చేయాలన్న డిమాండ్‌ కొందరు వినిపించారు.

ఆ తరవాత… ఐదో స్టెప్‌… వివరాలు – విశేషాలు
కమిటీలు వేయడం, ఈ కమిటీలు అమరావతి నిర్మాణంలో లోపాలన్నిటినీ ప్రజల ముందు పెట్టడం, ఆ తరవాత – అమరావతిలో రక్షించుకున్న సొమ్మును ఎంతెంత ఎలా ఎలా ఏ ప్రాంత అభివృద్ధికి మరలిస్తున్నాం… ఎక్కడెక్కడికి తరలిస్తున్నాం… ఏయే నగరాల్ని రాజధాని స్థాయి నగరాలు చేస్తున్నాం వగైరా వివరాలు బలంగా చెప్పడం జరుగుతుంది.

అయితే ఈ ఐదో దశలో కొంత సమస్య వస్తుంది. ఏమిటంటే, మా ప్రాంతాన్ని కూడా రాజధానిగా చెయ్యండి.. మాది కూడా చెయ్యండి.. ఇది వద్దు, అది కావాలి… అనే డిమాండ్లూ కలకలం ఏర్పడతాయి. వీటిని ఎదుర్కోవడానికి కొన్ని ప్రణాళికల్ని ఆలోచించాల్సి ఉంటుంది. బహుశా దానికి కూడా మొదటి నుంచే రంగం సిద్ధం కావచ్చు. ఇదైతే మంచిదనీ, అదైతే చెడ్డదనీ… చర్చలు జరుగుతాయి. ఆ సమయం వచ్చేసరికి ప్రజల నుంచే దాదాపు ఓ క్లియర్‌ అభిప్రాయం వస్తుంది. ఆ అభిప్రాయాన్ని తీసుకునే అంతా చేస్తున్నామనే ఫీలింగ్ ప్రజల్లో ఏర్పడేలా చేయగలిగితే, అంతా ఆమోదయోగ్యం అయిపోయినట్టే! ఆ దశలో రాజధానిని ఇక్కడ ఇక్కడ ఈ ఈ అభివృద్ధి చేస్తున్నామని కొన్ని పేర్లూ వివరాలూ ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది.

చివరి దశ ఆరో దశ… అక్కడ కూల్‌ ఇక్కడ హాట్‌
కొన్ని ప్రధానమైన చోట్ల, ప్రధానమని వాళ్ళనుకునే చోట్ల, ఇక్కడ బాగుంటుందని భావించిన చోట, వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకుంటూ నెమ్మదిగా.. వీలైతే పూర్తిగా… అమరావతిని తెరమరుగు చేసుకుంటూ మెల్లగా ముందుకెళ్ళే అవకాశముంది. ఈ దశకి వచ్చేసరికి జనం ఇక పూర్తిగా చల్లబడతారు. అమరావతినుంచి రాజధానిని ఎందుకు మార్చవలసి వచ్చిందో పూర్తిగా కన్విన్స్‌ అవుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే – ఏది చేసినా ఏదేమైనా ప్రజామోదయోగ్యంగానే ముందుకెళతారు తప్ప, “ప్రజలు కాదన్నా ముందుకెళ్ళారు” – అనే భావన అయితే కలగనివ్వరు. అది మాత్రం పక్కా.

సో.. ఆరు స్టెప్పుల్లో షిఫ్ట్‌ .. రాజధానిగా అమరావతి ఫినిష్‌! అయినా ఇంత నెగ్గుకొచ్చిన జగన్‌కి తెలియదా.. రాజధానిని అమరావతినుంచి సున్నితంగా ఎలా షిఫ్ట్‌ చేయాలో!

అయితే మరి తెలుగుదేశం వాళ్లు ఏం చేయబోతున్నారు? నిజానికి ఇలాంటి రాజకీయాలన్నీ తెలుగుదేశం పార్టీకి తెలియనివి కావు. లీడర్లు అమలుపరిచే రాజకీయ ప్రణాళికల పట్ల – ప్రజలకు లోతైన అవగాహన ఉంటుందని చెప్పలేం గానీ, తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో పండిపోయి ఉన్నారు కాబట్టి, ఇలాంటివి ఎన్నో చేసి ఉంటారు కాబట్టి, వైసీపీ ఇప్పుడు ఏం చెయ్యబోతోంది… తన సంకల్పంలో ఎలా ఎలా ముందుకెళ్ళబోతోంది… ఏ స్టెప్‌ వెనక ఏ రాజకీయం ఉంది? – అనే విషయాలు వాళ్లకి సులువుగానే అర్థమవుతాయి. ప్రభుత్వం ఏ చిన్న అడుగు వేసినా దాని వెనక ఉన్న ఉద్దేశాన్నీ, ఆ ప్రాసెస్‌లోని స్టెప్స్‌నీ ఊహించడం తెలుగుదేశానికి చిటికెలో పని. అందుకనే వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు.

జగన్‌ తీసుకుంటున్న కీలక నిర్ణయాల్ని పరిశీలిస్తే – ఇంక అమరావతి పనైపోయిందని వాళ్ళకు అర్థమైపోయి ఉండాలి. కానీ రాజకీయానుభవం లేని ప్రజలే ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. అమరావతిలో రాజధాని ఉంటుందా.. ఉండదా.. అని అనవసరమైన చర్చలు నడుపుతున్నారు. ప్రజల స్థాయిలో ఇలా ఉంటే ఉండచ్చు కానీ తెలుగుదేశం వాళ్ళకి స్పష్టంగా తెలుసు… రాజధాని మార్పు ఖాయం. కీలకమైన అడుగులన్నీ ఇప్పటికే పడిపోయాయి. అందుకే వాళ్లు వైల్డ్‌ గా రియాక్ట్‌ అవుతున్నారు.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE