మ్యావ్‌ మ్యావ్‌ డే.. బాగా జరిగింది!


ఆగస్ట్ 8 వ తారీకు ప్రత్యేకత మీకు తెలుసా? మార్చి 8 అంటే విమెన్స్ డే … ఆగస్ట్ 15 అంటే స్వతంత్ర దినోత్సవం… అని తెలుసు కానీ, ఈ ఆగస్ట్ 8 ఏమిటి? – అనుకోకండి. ఇది అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం. “ఏమిటీ? పిల్లులకు కూడా ఒక రోజుందా ?” అవును, ఉంది.  ప్రతి కుక్కకీ ఓ రోజుంటుంది.. Every Dog has its own day అంటారు గానీ.. పాపం.. పిల్లులకి కూడా ఓ రోజు.. కానీ ప్రతి పిల్లికీ కాదు… పిల్లులన్నిటికీ కలిపి ఓ రోజుంది. అదే ఇంటర్నేషనల్ క్యాట్ డే. బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాల్లో ఈ పిల్లుల దినోత్సవాన్ని జరుపుకుంటుంటారు. పిల్లుల్ని పెంచుకునేవారంతా ఈ రోజును పాటిస్తుంటారు. అలాగే, ఈ రోజు దిక్కులేని, అనాథలుగా ఉన్న పిల్లుల్ని కొత్తగా దత్తత తీసుకుని పెంచుకుంటుంటారు.

ఇంటర్నేషనల్ క్యాట్ డే #InternationalCatDay అనే హ్యాష్ ట్యాగ్‌తో మీరు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే ఇది ఇంగ్లాండ్‌లో ఎంత పెద్ద పండగో మీకు అర్థమవుతుంది. చెప్పాలంటే ఇది పెంపుడు పిల్లుల పండుగ. పండగ సరే. ఎలా జరుపుకుంటారు? ఏముంది? ఇష్టంగా పెంచుకునే పిల్లులకి రోజూ కంటే మంచి ఆహారం పెట్టడం… వాటితో కాస్త ఎక్కువ సేపు ఆడుకోవడం… ఇవి మాత్రమే కాదు. బయట పిల్లుల్ని రక్షించే సంస్థలుంటాయి. అక్కడి పిల్లుల్ని సాకేందుకు వారికి సపోర్ట్‌ గా… డబ్బు, ఆహారం, దుప్పట్లూ దానంగా ఇవ్వడం కూడా చేస్తుంటారు. అలాగే ఎక్కడైనా రోడ్డు మీద ఓ అనాథ పిల్లి కనిపిస్తే – దానికి ఆశ్రయం కూడా కల్పిస్తారు.

అసలు కేవలం ఇంగ్లాండ్‌లోనే 80 లక్షల పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఇతరదేశాల్లో కంటే పిల్లుల్ని ఇంగ్లాండ్‌ వాళ్లు ఎక్కువ ప్రేమగా చూస్తారనే పేరూ ఉంది. అయితే, మళ్ళీ ఇందులో చిన్న మతలబుంది. పిల్లుల్ని పెంచడం, వాటిని సాకడం, దిక్కు లేని పిల్లులకి సాయం చెయ్యడం, అనాథ మార్జాల ఆశ్రమాల్లో వాటిని చేర్పించడం… ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆ భూతదయకి సలాం చేయాల్సిందే! కానీ, దీంట్లోనే ఒక తేడా ఉందండోయ్. పిల్లులు నల్లగా ఉంటే మాత్రం ఎక్కువ మంది పెంచుకోవడం లేదట. నల్లపిల్లులు మంచివి కాదనే సెంటిమెంట్ ఒక కారణమైతే, మరో విచిత్రమైన కారణం కూడా ఉంది. ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చిన తరవాత- పెంపుడు జంతువుల్ని పెంచుకునేవాళ్ళు వాటిని సాకేటప్పుడూ వాటితో ఆడేటప్పుడూ సెల్ఫీలు తీసి రోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓ అలవాటుగా మారింది. అలా చేసేటప్పుడు ఈ నల్లపిల్లులు సెల్ఫీల్లో సరిగ్గా పడటం లేదట. అంటే ఫొటోజెనిక్‌ గా లేవన్నమాట! అందువల్ల చాలామంది పిల్లిప్రియులు – పిల్లుల్ని చేరదీసినప్పటికీ – నల్లరంగు పిల్లుల్ని కాకుండా వేరే రంగుల పిల్లుల్ని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారట. అంటే, పేరుకు భూతదయే కానీ ఇందులో కొంత స్వార్థం కూడా ఉందన్నమాట! పాపం.. మనం మరి ఈ పిల్లుల దినోత్సవం సందర్భంగా – పిల్లులకి శుభాకాంక్షలు చెబుదాం. నల్ల పిల్లుల మీద కొంచెం జాలి పడదాం!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu