అయ్యా! ‘మా’ మీద దయ చూపించండి!


కళని ఎవరూ ఆజ్ఞాపించలేరు. కళాకారుల్నీ క్రియేటర్స్‌నీ ఎవరూ ఎప్పుడూ నియంత్రించకూడదు. మామూలుగా జీవితంలో సాధారణమైన ఉపాధి మార్గాలు అనేకం ఉంటాయి. కానీ కళ అలాంటిది కాదు. అక్కడ డబ్బుతో పాటు కీర్తి లభిస్తుంది. అక్కడ అవకాశం అన్నదానికి టాలెంట్‌ కూడా కొలమానం అవుతుంది. అందుకే కళని ఉపాధి మార్గంగా కావాలని కోరుకునేవారు కార్మికచట్టాల మాదిరిగా డిమాండ్‌ చేస్తే బాగోదు. ఈరోజు వేషాలు లేకపోతే వేషాల్లేవని బీదార్పులు అరిచేవారే, అవకాశం దొరికి కాస్త పేరు రాగానే టాలెంట్‌ అంటూ కాలరెగరేయరన్న గ్యారంటీ లేదు.  కళ ఇచ్చే పొగరూ శక్తీ అలాంటివి. ఏదేమైనా – ఎటూ పోలేక తెలంగాణ లో చిక్కుబడిన టాలీవుడ్‌ లో – ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదన్నది పూర్తిగా నిర్మాత చేతిలో ఉందా అన్నది సందేహమే! టాలీవుడ్‌ లో ఒకప్పుడు చూపిన పక్షపాత వైఖరులు, ఏకచ్ఛత్రాధిపత్య ధోరణులు ఇప్పుడు ఆ పెద్దల పీకకే చుట్టుకుని వారిని శాసిస్తున్నాయా అనిపిస్తుంది. అవకాశాలు ఇవ్వండి అని అడగడం – పైకి బతిమాలినట్టే ఉన్నా.. రేపు ఇవ్వకపోతే దుష్పరిణామాలు చూడాల్సి వస్తుందన్నది సినీ పెద్దలకి కూడా తెలుసు. అదే నేటి సినీ విచిత్రం!

మ‌న తెలుగు సినిమాల్లో తెలుగువారికి అవ‌కాశాలివ్వాల‌ని, ముఖ్యంగా మా మెంబ‌ర్స్ అయ్యుండి అవ‌కాశాలు లేని ఆర్టిస్టుల‌ను ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటూ ఈరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్) త‌రఫున ప్రెసిడెంట్ డా.వి.కె.న‌రేష్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీమ‌తి జీవిత రాజ‌శేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్ డా.రాజ‌శేఖ‌ర్‌, వైస్ ప్రెసిడెంట్ హేమ‌, అలీ, రాజార‌వీంధ్ర‌, ఉత్తేజ్‌, సురేష్ కొండేటి, అనితా చౌద‌రి, జ‌య‌లక్ష్మి, అశోక్ కూమార్‌, టార్జాన్ త‌దిత‌రులు క‌లిసి తెలుగు ఫిలిం ప్రొడ్యూస‌ర్స్ సెక్ర‌ట‌రీ సుప్రియ గారిని, తెలుగు చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షులు ఎన్‌.శంక‌ర్ గారిని, తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షులు సి.క‌ల్యాణ్ గారిని, తెలుగు చ‌ల‌న చిత్ర ర‌చ‌యిత‌ల సంఘం అధ్య‌క్షులు ప‌రుచూరి గోపాల‌కృష్ణ గారిని క‌లిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించ‌డం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా మా అధ్య‌క్షుడు న‌రేష్ గారు మాట్లాడుతూ.. మా స‌భ్యులుగా ఉన్న చాలామంది వేషాలు లేక బాధ‌ప‌డుతున్నార‌ని వారి కోసం మేమందరం క‌లిసి ఈ నాలుగు ఆర్గ‌నైజేష‌న్ల‌ను క‌ల‌వడం జ‌రిగింద‌ని చెప్పారు. ఇదే సంద‌ర్భంగా జ‌న‌రల్ సెక్ర‌ట‌రీ జీవిత రాజ‌శేఖ‌ర్ గారు మాట్లాడుతూ.. మా మెంబ‌ర్స్‌గా ఉన్న వాళ్ళు చాలా మంది వేషాలు లేక ఖాళీగా ఉంటున్నార‌ని, మ‌రీ ముఖ్యంగా ఆడ‌వాళ్ళు కూడా వేషాలు లేక చాలా బాధ‌ల్లో ఉన్నార‌ని చెప్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్) కోసం మేము ప్ర‌త్యేకంగా వెబ్‌సైట్ కూడా ప్లాన్ చేస్తున్నామ‌ని, ఆ వెబ్‌సైట్‌లో దాదాపు అంద‌రి ఆర్టిస్టుల అడ్రెస్‌లు, ఫోన్ నెంబ‌ర్ల‌తో పాటు వాళ్ళు చేసిన 1 నిమిషం పెర్ఫార్మెన్స్ వీడియో త‌దిత‌ర వివ‌రాలు కూడా వెబ్‌సైట్‌లో ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నామ‌ని తెలిపారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హీరో డా.రాజ‌శేఖ‌ర్ గారు మాట్లాడుతూ.. మేము క‌లిసిన నాలుగు ఆర్గ‌నైజేష‌న్స్ వాళ్ళు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ న‌టీన‌టులంద‌రికీ స‌హ‌క‌రిస్తామ‌ని అంతేకాకుండా మేము నాలుగు ఆర్గ‌నైజేష‌న్స్ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా కి పూర్తి స‌హ‌కారం ఇస్తామ‌ని స‌హృద‌యంతో ప్ర‌తిస్పందించార‌ని, వాళ్ళంద‌రికీ ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu