అయ్యప్ప కోపమే కేరళ వరదలకి కారణమా?

SriRamaNavami

2004 సునామీ ఎందుకొచ్చిందో తెలుసా? కంచి స్వామిని అరెస్ట్ చెయ్యడం వల్ల! 2013లో వరదలు ఎందుకొచ్చాయో తెలుసా? ఉత్తరాఖండ్ లో దారిదేవి విగ్రహాన్ని తొలగించడం వల్ల! మరి ఇప్పుడు తాజాగా కేరళను వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయో తెలుసా? శబరిమలలో స్త్రీల ప్రవేశానికి అనుమతినిచ్చేందుకు మేం సుముఖమేనని కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేయడం వల్ల! అవును. ఆ కారణంగానే – అయ్యప్పదేవుడు కోపించడం వల్లే – ఇప్పుడు కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. అబ్బే, ఇవన్నీ మేం చెబుతున్నవి కాదండీ… ఫేస్ బుక్ లో ఒక ప్రసిద్ధ జ్యోతిష్కుడు చేస్తున్న ప్రకటనలు!

తేల్చేయడానికి మనమెవరం?

అనగనగా ఒక ఫేస్‌ బుక్‌. అందులో ఒక జ్యోతిష్కుడు. ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ ఛానెళ్ళలో నాస్తికులతో వాదించి ఇబ్బందులు పడిన వ్యక్తి. దైవం మీద అపారమైన నమ్మకం ఉంది. మంచిదే. కానీ లోకంలో జరిగే ప్రతి చిన్న వార్తకీ, జ్యోతిష్యానికీ ముడిపెట్టి రాయడం ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతోంది. విమర్శలకూ గురి చేస్తోంది. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండటం మంచిదే. అయితే ఆగస్ట్ 14న తప్పు చేస్తే ఆగస్ట్ 15న శిక్షించెయ్యడానికి దేవుడేమీ మనం అనుకున్నట్టు ఒక కిందిస్థాయి గ్రామాధికారి లాంటివాడు కాదు. మంచికి మంచి ఫలం, చెడుకి చెడు ఫలం ఉంటుందని ఆధ్యాత్మిక శాస్త్రాలూ ఆస్తిక వాదాలూ చెబుతాయి. అంత మాత్రాన దైవాన్ని నమ్మేవాళ్లంతా – ప్రతి విషయానికీ ఫలితాలు ఊహించేసుకోకూడదు. దైవం పట్ల ఎంత గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి అయినా, “ఇదుగో, ఇందువల్ల ఇది జరిగింది ఇందువల్ల ఇది జరిగింద”ని కర్మలూ ఫలితాల లింకుల్ని కరాఖండిగా చెప్పేయలేడు. సంపూర్ణ భగవదవతారంగా జనం కొలిచే శ్రీకృష్ణ పరమాత్ముడే – హిందూ మూల గ్రంథమైన ‘భగవద్గీత’ లో “గహనా కర్మణో గతిః” అన్నాడు. దీనర్థం – కర్మలు ఫలితాలుగా ఎలా ఎలా పరిణమిస్తాయో తెలుసుకోవడం అత్యంత లోతయిన విషయం” అని! సాక్షాత్తూ ఆయనంతటివాడే అంత మాటన్నాక – “ఇందువల్ల ఇలా జరిగింది” అని సింపుల్‌ గా చెప్పేయడానికీ, తేల్చేయడానికీ మనమెవరం? ఎంతటివాళ్లం?

పేపర్లోకి రానివి ఎన్నో ఉంటాయి!

పేపర్లో వచ్చేది మాత్రమే వార్త కాదు. లోకంలో మనకి తెలియని కర్మలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. పైకి కనిపించకుండా మానసికంగా జరిగేవీ కోటానుకోట్లు ఉంటాయి. కార్యరూపం దాల్చినప్పుడు మాత్రమే పైకి కనిపించేవీ, బీజరూపంలో ఉన్నవీ ఎన్నో ఉంటాయి. ఇదేదీ పట్టించుకోకుండా – రెండు న్యూస్‌ ఐటెమ్స్‌ తీసుకుని – రెండింటికీ ఏదో లింకు మనమే ఊహించేసుకుని, కార్యకారణ సంబంధం అంటగట్టేసి, ఇదుగో, ఇందువల్లే ఇలా జరిగింది సుమా! … అని తేల్చి చెప్పేయడం ఎంత హాస్యాస్పదం! నిజంగా ఎవరికైనా అలా చెప్పగలిగే శక్తి ఉన్నా – లోకానికి బహిర్గతం చేయడం తప్పే అవుతుంది. ఎందుకంటే అలాంటి విషయాలు – లోకం నడిచే తీరుని డిస్టర్బ్‌ చేస్తాయి.

పాపుల్ని దేవుడు శిక్షిస్తాడా, లేదా అనేది – తరవాత విషయం. అసలు ఏది పాపం? ఏది పుణ్యం అన్నది కూడా కొన్ని సార్లు మనం నిర్ణయించగలిగే విషయం కాదు. ఇవన్నీ కిందిస్థాయిలో చర్చించగలిగే విషయాలు కావు. పాపం- పుణ్యం, కర్మ- కర్మఫలం లాంటివి నిజంగా ఉంటే – అవి నిజమైన ఆధ్యాత్మికవాదులందరూ అత్యున్నత స్థాయిలో మాత్రమే అర్థం చేసుకోగలిగే సత్యానికి సంబంధించిన విషయాలు. వాటిని ఇలా రోడ్డుమీదకు లాక్కొచ్చి, “దీనివల్లే ఇది జరిగింది… దాని వల్లే అది జరిగింది” అని తనకు అర్థమైనరీతిలో అర్దమెటిక్స్‌ లా లెక్కలు వేసి ప్రకటనలు చేసేయకూడదు. ఇలాంటి లేనిపోని ప్రకటనల వల్ల ఆధ్యాత్మికత పట్ల, హిందూ ధర్మం పట్ల విలువ పెరగడం మాట అటుంచి, గౌరవం తగ్గిపోయే ప్రమాదముంది. ఈ విషయాన్ని ఈ దైవ భక్తులంతా గుర్తించాలి.

వాళ్లూ మారాలి!

” శబరిమలకు భక్తితో వెళుతున్న బస్సులకు ఎన్నోసార్లు ప్రమాదాలు జరగలేదా? మరి అప్పుడు అందులో ఉన్నవారంతా పాపాత్ములేనా? ” – అని కొందరు నాస్తికులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలకు సామాన్య స్థాయిలో మనం సమాధానాలివ్వలేం. అంతమాత్రాన దేవుడు లేడనీ కాదు… ఇలా మాట్లాడినవాళ్లంతా దైవానికి వ్యతిరేకులూ కాదు. శబరిమల విషయానికొస్తే – ఫెమినిస్టులు కాస్త ఉదారంగా ఉంటే సరిపోయేది. స్త్రీలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టకూడదన్నది – కేవలం అక్కడి సంప్రదాయంగా వారు తీసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు – స్త్రీపట్ల ఆకర్షణ అన్నది పురుషుడికి ఆటంకం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి – మతంలో కొన్ని చోట్ల స్త్రీని నిషిద్ధ విషయంగా చూపిస్తుంటారు. ఆ నిషేధం ఆధారంగా ఏర్పడిందే ఈ శబరిమల నియమం. శబరిమల వచ్చేముందు – నలభై ఒక్క రోజులపాటు ఎంతో దీక్షగా బ్రహ్మచర్యాన్ని పాటించే సంసారులు – మనసులోకి స్త్రీ ఆలోచన కూడా రానంత ఆత్మనిగ్రహాన్ని పాటించే నిమిత్తం ఈ నియమం పెట్టి ఉండవచ్చు. అంతమాత్రాన స్త్రీలకి అవమానం జరిగిపోయిందంటే ఎలా?

ఈ లాజిక్కుల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ!

ఫెమినిజం పేరుతోనో, ప్రజాస్వామ్యం పేరుతోనో, లేదా లౌకికవాదం పేరుతోనో – కారణం ఏదైనా హిందూ ధర్మం మీదే దాడి జరుగుతోందన్నది హిందూ ఆధ్యాత్మిక వాదుల ఆరోపణ. వాళ్ల ఆందోళన సమంజసమైనదే కావచ్చు. కానీ దాన్ని ఎదుర్కొనే మార్గంలో వాళ్లు చేసే పనులు – తప్పటడుగులుగా మారి అసలుకే మోసం తెస్తున్నాయన్నది సత్యం. దైవానుభూతి అనేది ఒక ఉన్నతస్థాయి తాత్త్విక సత్యం. దానిని రోజువారీ వార్తల్లోకి తీసుకువచ్చి చర్చావేదిక మీద పెట్టడం విజ్ఞుడైనవాడు చెయ్యాల్సిన పనికాదు. కాబట్టి దైవం మీద విశ్వాసం ఉంచేవారందరికీ ‘తెలుగువాడు’ చేసే విన్నపం ఏమిటంటే…. మీ విశ్వాసాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. కానీ దానిని మీ బుద్ధికి తోచినట్టు – కింది స్థాయి లాజిక్‌తో విశ్లేషించి లేనిపోని అర్థాలూ, పెడర్థాలూ దయచేసి చెప్పవద్దు. దీని వల్ల మీరు మతానికి మేలు చేయడం కంటే, ఎక్కువగా కీడు చేస్తున్నారని గుర్తించండి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu