అబ్బే. కేసీఆర్‌ చేసింది ఏమీ లేదట!

SriRamaNavami

తెలంగాణ సాధించడానికి కేసీఆర్‌ చేసిందేమీ లేదని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. ఆయనతో కనీసం సంప్రదించకుండా తమకి తామే తెలంగాణ ఇచ్చేశారట. ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్న రాజధానితో కలిపి – ఏకంగా పది జిల్లాల తెలంగాణను – ఏమాత్రం న్యాయం లేకుండా విభజించి ఇచ్చేశారు కాంగ్రెస్‌ వాళ్లు. అలా ఇవ్వమని కాంగ్రెస్‌కి మరి ఎవరు చెప్పారు? కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు, అందులో అస్తిత్వం కోసం పోరాటం ఉంది. కాబట్టి ఏదో అలా జరిగింది అంటే కొంత అర్థం ఉంది – కానీ మరి ఎవరూ పోరాడకుండా, ఎవరూ ఉద్యమం చేయకుండా – కేవలం తామే పోరాడినట్టూ – ఏదో అలా కాజువల్‌ గా తెలంగాణ ఇచ్చేసినట్టూ కాంగ్రెస్‌ చెబుతోంది. నిజంగా కాంగ్రెస్‌ తెలంగాణ ఊరకే ఇచ్చేసిందా? అదే నిజమైతే – మొత్తం విభజన దోషాలన్నిటికీ వంద శాతం తనదే బాధ్యత అని కాంగ్రెస్‌ ఒప్పుకున్నట్టే! ఈ మాటలే నిజమైతే – ఆంధ్రులు ఎప్పటికైనా కాంగ్రెస్‌ ని క్షమించగలరా? – అంతా మాదే క్రెడిట్‌ అనే ముందు – కాంగ్రెస్‌ ఇవన్నీ ఆలోచించుకోవాలి.

ఏమైనా తెలంగాణలో తెరాస, కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల యుద్ధం మొదలయిందని చెప్పచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో అసలు టీఆరెస్ పాత్ర లేనే లేదని సీడబ్ల్యుసీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ నిన్న ఒక ఘాటు ప్రకటన చేశారు. అసలు తెలంగాణ ఇచ్చేముందు టీఆరెస్‌తో చర్చలు కూడా జరపలేదనీ, రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత మొత్తం కాంగ్రెస్ నేతలదేననీ ఆయన అన్నారు. ఒకవేళ తెరాస వాళ్లు రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర ఉందని అంటే… రండి చర్చిద్దాం అన్నట్టు సవాల్ కూడా చేశారు. తెలంగాణ అనే దాన్ని మేం ( కాంగ్రెస్‌ వాళ్లు) పండిస్తే.. ఫలితం వాళ్లు ( తెరాసవాళ్లు ) కోసుకుపోయారు.. వాళ్లు పదవులు తీసుకుపోయారంటూ ఆజాద్ మాట్లాడారు.

తెలంగాణని కాంగ్రెసే సాధించిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు, తమనే గెలిపిస్తారు – అని ఆజాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, సాధించడానికీ, ఇవ్వడానికీ తేడా ఉంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే! అది ఎవరూ కాదనలేరు. అయినప్పటికీ అసలు ఆ ఉద్యమాన్ని అంతవరకూ తీసుకువచ్చిందీ… ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పదు అనే పరిస్థితి ఏర్పడేలా చేసిందీ ఎవరనేది కూడా ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఇక ఇవ్వక తప్పని పరిస్థితుల్లో పార్టీకి లాభకరంగా ఉంటుందనే ఉద్దేశంతో.. ఒక పక్క ఆంధ్ర ప్రజల గొంతు కోసి మరీ – తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. బహుశా ఆంధ్రుల పట్ల చేసిన ఆ పాప ఫలితంగానే ఇక్కడ రాష్ట్రం ఇచ్చిన లాభాన్ని కాంగ్రెస్‌ పొందలేకపోయిందనేది ఆంధ్ర ప్రజల అభిప్రాయం.

తెరాస వల్లా, కేసీఆర్‌ వల్లా పైకి లేచిన ఉద్యమం మొత్తాన్ని – ఏమీ విలువలేనిదన్నట్టు పక్కనపెట్టి, అసలు కాంగ్రెస్సే తెలంగాణ ఇచ్చిందనీ, ఘనత అంతా తమదేననీ అనడం కరెక్టా? – అన్నది కాంగ్రెస్‌ ఆలోచించుకోవాలి. మూడు లడ్డూలు తిన్న వ్యక్తి, మూడో లడ్డూ వల్లే కడుపు నిండిందని నమ్మితే – అది ఎలా ఉంటుందో – కాంగ్రెస్‌ వల్లే తెలంగాణ వచ్చిందని అనడం కూడా అలాగే ఉంటుంది. నిజంగా ఆరోజున కాంగ్రెస్ తన సొంత రాజకీయ లాభం చూసుకోకపోయి ఉంటే – ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని చాలామంది అంటారు. ఎలాగైనా రాష్ట్రం ఇచ్చేయాలి లాభం పొందేయాలనే స్వార్థంతో – చరిత్రలో ఎన్నడూ లేని విధంగా – పార్లమెంట్ తలుపులు మూసి మరీ రాష్ట్రం ఇచ్చేసింది కాంగ్రెస్‌. అలా ఇవ్వకపోతే ఇప్పటికీ తెలంగాణ వచ్చి ఉండేది కాదేమోనని చాలామంది తెలంగాణవాదులే అభిప్రాయపడుతూ ఉంటారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్‌ – వక్రమార్గంలో అయినా సరే తెలంగాణకు మేలు చేసినట్టే అనుకోవాలి. కానీ కాంగ్రెస్‌ అలా సాహసించడానికి కారణం ఎవరు? రాష్ట్రం ఇస్తే లాభం ఉంటుందని కాంగ్రెస్‌ ఆశపడే స్థాయికి – ఉద్యమాన్నీ ప్రజల ఆవేశాన్నీ తీసుకువచ్చింది ఎవరు? ఇన్ని జరిగాక ఇప్పుడు – రాష్ట్రసాధనకి కేసీఆర్‌ చేసింది ఏమీ లేదు – అని అంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్‌ ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu