అనుకున్న టైమ్‌కి పని పూర్తికావాలంటే… అద్భుతమైన ట్రిక్‌!

SriRamaNavami

మనం ప్రతి రోజూ ఈ పని చెయ్యాలి.. ఆ పని చెయ్యాలి.. అని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అవి చేయడానికి పథకాలు వేసుకుంటే చాలదు ఈ టైమ్‌కి ఇది చేయాలి… ఈ టైమ్‌కి ఇది చేయాలి… షెడ్యూల్స్ పెట్టుకోవాలి. ఎంత షెడ్యూల్‌ వేసుకున్నా – రోజు ముగిసేసరికి – కొంతమందికి అనుకున్న పనుల్లో చాలావరకూ పూర్తికావు. కొన్నిటిని మళ్లీ మర్నాటికి వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఇక పథకమూ, ప్రణాళికా లేనివాళ్లూ, షెడ్యూలే వేసుకోనివాళ్ల సంగతి మాట్లాడాల్సిన అవసరం లేదనుకోండి. అయితే నిజాయతీగా వేసుకున్న షెడ్యూల్స్ కూడా ఎందుకు విఫలమవుతుంటాయి? ఈ విషయంలో ఒక ముఖ్యమైన అంశాన్ని నిపుణులు కనిపెట్టారు. అది నిద్రపోవడానికి సంబంధించిన విషయం.

మనం చాలాసార్లు అలసిపోయినప్పుడు పనిచెయ్యలేక – మర్నాటికి కొన్ని పనుల్ని వాయిదా వేస్తాం. ఉదయాన్నే లేచి ఫలానా పని పూర్తి చేద్దామని ప్రణాళిక వేసుకుంటుంటాం. కానీ అనుకున్న విధంగా ఉదయాన్నే లేవలేకపోతుంటాం. షెడ్యూల్‌ ఫెయిలవడం అన్నది అక్కడినుంచే మొదలవుతుంది. పొద్దుట లేవలేకపోవడానికి ఒక ముఖ్య కారణం – రాత్రి సరయిన సమయానికి పడుకోకపోవడం! లేటుగా లేచిన రోజు తిరిగి రాత్రి ఆలస్యం కావడం, ఉదయం మళ్లీ ఆలస్యంగా లేవడం జరుగుతుంది. ఈ విధంగా నిత్యం షెడ్యూల్ చెదిరిపోవడం జరుగుతుంది. అయితే, ఈ విషయంలో మనం చేసే ఒక ముఖ్యమైన పొరపాటును నిపుణులు ఎత్తి చూపుతున్నారు. అదేమిటంటే – మనం షెడ్యూల్ వేసుకునేటప్పుడు… ఫలానా సమయానికి లేవాలి.. ఈ పని చెయ్యాలని అనుకుంటాం కదా?

అక్కడ ముఖ్యమైన రెండు అంశాల మధ్య – మనకేది ఎక్కువ ముఖ్యమన్నదానిని సరిగ్గా నిర్ణయించుకోవాలి. ఆ అంశాలు ఏమిటీ అంటే – “మనం తగినంత సమయం నిద్రపోవడం ముఖ్యమా? ఫలానా సమయానికి లేవడం ముఖ్యమా?” అనేది! నిజమే! ఒకొక్కసారి ఆ ఫలానా సమయానికి లేస్తే తప్ప – కొన్ని పనులు జరగవు. అలాంటప్పుడు లేచే సమయమే ఎక్కువ ముఖ్యమవుతుంది. అయితే ఒక్కోసారి నిద్రే ముఖ్యమవుతుంది. ఎందుకంటే తగినంత నిద్రపోకుండా పని చేయలేం. పొద్దుట త్వరగా లేచినా మత్తుగా ఉండిపోతే పని కాదు. నిద్ర నుంచి పూర్తిగా మెలకువ తెచ్చుకుని మనసూ మెదడూ ప్రశాంతంగా ఉంటే – పని కూడా బాగా అవుతుంది. కాబట్టి – “తగినంత నిద్ర కావాలా?.. సరైన సమయానికి లేవాలా?” ఈ రెండిటి మధ్యా ఓ నిర్ణయానికి వచ్చి దాన్ని బట్టి షెడ్యూల్‌ వేసుకుని పాటించాలి.

సాధారణంగా చాలామంది ఈ రెండిటి విషయంలో స్పష్టత లేకుండా అయోమయానికి గురవుతుంటారట! అదే షెడ్యూల్‌ ఫెయిలవడానికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. తగినంత సమయం నిద్రపోవడమే మనకి ముఖ్యమని మనం అనుకున్నప్పుడు, దానికి తగినంత నిద్ర సమయాన్ని – షెడ్యూల్లో ముందుగానే కేటాయించుకుని – ముందరి రోజు త్వరగా నిద్రపోవాలి.. లేదా తగినంత విశ్రాంతి లభించేదాకా ఉండి, ఆలస్యంగా లేవాలి. అయితే కొన్ని పనులు ఫలానా టైమ్‌ కి మాత్రమే అవుతాయి. అలాంటివి ఉన్నప్పుడు ఫలానా సమయానికి కచ్చితంగా లేవాలి. నిద్ర తక్కువైనా సరే ఆ సమయానికే లేవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో – తొందరగా లేచి పని పూర్తి చేసుకుని, కావాలంటే తరవాత విశ్రాంతి తీసుకోవచ్చు. ఇలాంటి స్పష్టత ఉంటే – ప్రణాళిక చెదిరిపోకుండా పనులవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

నిజమే కదా! కాబట్టి ఈసారి మీరు కూడా పొద్దుట ఫలానా సమయానికి లేచి ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు.. మీకు తగినంత నిద్ర ముఖ్యమా?.. లేదా ఫలానా సమయానికి లేవడం ముఖ్యమా?.. అన్న విషయంలో స్పష్టత ఉండేలా చూసుకోండి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu