అందరూ ఈ నిర్మాతలా ఉంటే ఎంత బాగుంటుంది!


ఎందరో నిర్మాతల్ని చూశాం. కానీ ఇలాంటి నిర్మాతని మాత్రం మనం ఎప్పుడూ చూసి ఉండం. ఇక్కడ మనం మాట్లాడేది – మమ్ముట్టి ‘మధుర రాజ’ మలయాళ సినిమాని తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో అందిస్తున్న ప్రొడ్యూసర్‌ గురించి. అందరూ ఈ నిర్మాతలా ఉంటే ఎంత బాగుంటుంది! అని అనిపిస్తుంది. ఎందుకంటారా? చదవండి మరి.

సినిమా మీది ప్రేమతో నిర్మాతలైనవాళ్లున్నారు. సినిమా గురించి కళగా ఏమీ తెలియకపోయినా వ్యాపారంకోసం నిర్మాతలయినవాళ్లున్నారు. రియల్‌ ఎస్టేట్‌ నించి వచ్చినవాళ్లున్నారు. రాజకీయంలో ఉంటూ ప్రొడ్యూసర్లైనవాళ్లున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా చాలాకాలం ఉండడం వల్ల సినిమా మీద ఇష్టం పెరగడం వల్లో… ఆ వ్యాపారం మీద అవగాహన కలగడం వల్లో ప్రొడ్యూసర్‌ అయినవాళ్లూ ఉన్నారు. అయితే అందరూ కూడా – గొప్పగా సినిమా తీశాం అని చెబుతూనే “మా సినిమా హిట్‌ చేయండి” అని ప్రేక్షకుల్ని బతిమాలుకుంటూ ఉంటారు. రామ్‌గోపాల్‌ వర్మలాగ – నాకు నచ్చింది తీశా, చూస్తే చూడండి లేకపోతే పొండి అనే దమ్మున్నవాడు ఇంతవరకూ ఎవరూ ప్రొడ్యూసర్లలో ఎవరూ కనిపించలేదు. కానీ ఈయనెవరో సాధుశేఖర్‌ అట. నిజంగా విలక్షణంగా ఉన్నాడు. మలయాళంలో హిట్టయిన మమ్ముట్టి సినిమా ‘మధుర రాజ’ ని ‘రాజా నరసింహా’ పేరుతో డబ్‌ చేసి వదులుతున్నాడు. సినిమా హిట్‌ చేయండి – అని అడగడం లేదు సరికదా.. “రాజా నరసింహా గ్యారెంటీ హిట్‌” అని ఆయనే ప్రకటించేసి గ్యారంటీ ఇచ్చేసుకున్నాడు. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం. ఏవేవో సినిమాలు జనం మీదకి వదిలి, గొప్పగా ఉంది చూడండి సపరివారంగా చూడండి, మీ అభిమాన థియేటర్లో చూడండి – అని హింస పెట్టే నిర్మాతలకంటే ఈయన ఎంతో బెటరనిపిస్తోంది. ఆయనే సినిమాకి హిట్‌ గ్యారంటీ ఇచ్చేశారు కాబట్టి – ఇక చూడడం, చూడకపోవడం మీ ఇష్టం!

రాజా నరసింహా గ్యారెంటీ హిట్‌
– నిర్మాత సాధు శేఖర్‌
”కొన్నేళ్లగా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఉన్నాం. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్‌ చిత్రాలను పంపిణీ చేశాం. ఆ అనుభవంతోనే నిర్మాణరంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా ‘మధుర రాజా’ చిత్రాన్ని తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువదించాం. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందచేయాలన్నదే మా లక్ష్యం” అని నిర్మాత సాధు శేఖర్‌ అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేం వైశాక్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై జనవరి ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత సాఽధు శేఖర్‌ మాట్లాడుతూ ”నిర్మాతగా తొలి సినిమా ఇది. వైశాక్‌, మమ్ముట్టి కాంబినేషన్‌ మీద నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం. ఓ అటవీ ప్రాంతంలో కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా ఎలా బుద్ధి చెప్పాడు అన్నది సినిమా ఇతివృత్తం. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. నమ్మితే ప్రాణమిచ్చే రాజా పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు తగ్గట్టే అత్యంత బలమైన పాత్రలో ప్రతినాయకుడిగా జగపతిబాబు చక్కని నటన కనబర్చారు. సన్నీలియోన్‌ ప్రత్యేక గీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. మన నేటివిటీకి తగ్గట్టే స్ట్రెయిట్‌ సినిమాలా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఉన్నాం కాబట్టి సినిమా విడుదలకు అంతగా ఇబ్బంది పడలేదు. కొత్త సంవత్సరంలో మా చిత్రం గ్యారెంటీగా హిట్‌ అవుతుంది” అని తెలిపారు.

ఇంతకీ మన నిర్మాత గారికి అంత గ్యారంటీ హిట్‌ అనిపించడానికి కారణం ఏంటో తెలుసా? ఇందులో మమ్ముట్టి హీరో కాగా, హీరోయిన్‌ మహిమా నంబియార్‌. సన్నీ లియోన్‌ ఐటెమ్‌ సాంగ్‌ కూడా ఉంది. పైగా తెలుగుహీరోవిలన్‌ జగపతిబాబే ఇందులో విలన్‌. పైగా ఇప్పటికే అక్కడ మలయాళంలో సినిమా మంచి హిట్‌ అయింది. బహుశా ఈ రీజన్స్‌ వల్లే నిర్మాతకి ఆ ‘గ్యారంటీ’ ఫీలింగ్‌ కలిగి ఉంటుంది. ఏదేమైనా ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టకుండా – ఇలా హిట్‌ ధీమా కలిగి ఉండే నిర్మాతలే ఇప్పుడు కావాలి మరి!


ADVERTISE HERE