అంతా అబద్ధమట! నమ్ముదామా?


సినీరంగంలోని ఓ మధ్య స్థాయి వ్యక్తో కింద స్థాయి వ్యక్తో తప్పు చేస్తే టీవీ ఛానెల్‌ వాళ్లు లైన్లోకి పిలిచి అక్కడికక్కడే కడిగేస్తారు. కానీ ప్రముఖుల విషయం అలా కాదుగా? వాళ్లు తప్పు చేసి ఉన్నా- వాళ్లని రచ్చకి లాగడం అంత ఈజీ పని కాదు. వాళ్ల వ్యక్తిత్వాలు ఎలాంటివైనా సరే – గుడ్డిగా సపోర్ట్‌ చేసే ఫ్యాన్స్‌ బలం వాళ్లకి ఉంటుంది. ఇక ధనబలం, పలుకుబడి విషయం చెప్పాల్సిన పనిలేదు. మరి అలాంటప్పుడు ఫలానా ప్రముఖుడు నన్ను మోసం చేశాడు అని ఓ సామాన్యురాలు నిరూపించాలంటే – ఏం చేయాలి? తాను ఆరోపిస్తున్నదానికి రుజువులు చూపాలి. ఆ రుజువులు ఏం ఉంటాయి?  సాధారణంగా ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాట్స్‌, ఇంకా ఫొటోలు, వీడియోలు…!  అవి నిజమైన రుజువులు అయినా సరే… వాటిని ఫేక్ అని రుజువు చేయగలిగే ప్రమాదం పొంచి ఉన్నట్టు అనిపిస్తోంది మరి!

ఓ పక్క హీరోల మీద ఇంతింత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో – మీడియాలో కొన్ని చిత్రమైన, (అ)సందర్భమైన ఆర్టికల్స్‌ వస్తున్నాయి. ఓ ప్రముఖ పత్రికలో ఈరోజు వచ్చిన “అంతా అబద్ధం!” అన్న పేరుతో వచ్చిన ఆర్టికల్‌ చూసినప్పుడు చాలా అనుమానాలు రేకెత్తుతాయి. రుజువులుగా పనికొచ్చే ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాట్స్‌, ఇంకా ఫొటోలు… ఆఖరికి వీడియోలు కూడా.. అన్నీ దొంగవే సృష్టించవచ్చు, అంటూ – అది చాలా సులువంటూ – ఒక ప్రముఖ దినపత్రికలో ఒకాయన టెక్నాలజీ ఐటెమ్‌ రాశారు. వాట్సాప్‌ ఎన్‌క్రిప్ట్‌ అయిపోయిన ఈ కాలంలో వాళ్ల దగ్గరే ఒరిజినల్‌ దొరకడం లేదు… అంటూ – వాట్సాప్‌ రుజువులు కేసులకు పనికిరావన్నట్టు ఆయన చెప్పారు. నిజానికి – వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్లని ఫొటోషాప్‌లో మేనేజ్‌ చేయచ్చేమోగానీ… ఒరిజినల్‌ బ్యాకప్‌నుంచి డిక్రిప్ట్‌ చేసి చూసినప్పుడు – అవి నిజమైనవైతే తెలిసే తీరుతుంది. ఈ ఆర్టికల్‌ లో చెప్పినట్టు – ప్రపంచంలో కొందరు ఫేక్‌ వీడియోలూ చాట్సూ కూడా సృష్టించగలుగుతున్నారు. కానీ నిజమైన రుజువుల్నీ ఫేక్‌ రుజువుల్నీ – కాస్త డీప్‌ గా వెళ్తే – పసిగట్టడం మరీ అంత కష్టమేమీ కాదు. ఇవన్నీ ఆల్రెడీ యూఎస్‌ లో జరుగుతున్న పరిణామాలే! అయితే ఈ ఆర్టికల్‌ రాసిన తీరు ఎలా ఉందంటే – కొందరు దొంగగా డిజిటల్‌ సాక్ష్యాలు సృష్టించగలుగుతున్నారు కాబట్టి – అసలు ఈ ప్రపంచంలో నేరాల రుజువుకి డిజిటల్‌ సాక్ష్యాలన్నవే పనికిరావు – అన్నట్టు ఉంది.

ఈ ఆర్టికల్‌ టెక్నాలజీ పరంగా పాఠకులకి ఎంత మేలు చేస్తుందో తెలియదుగానీ, రేపు ఎవరైనా ప్రముఖ హీరో ఆగడాలూ రాసలీలల గురించి ఏ అమ్మాయి అయినా నిజమైన రుజువులు తెచ్చి చూపించినా – అవన్నీ అబద్ధాలే అని ఆయనగారు వాదించుకోవడానికి వీలుగా రాసినట్టు ఉంది ఈ ఆర్టికల్‌. తెలుగులో టెక్నాలజీ ఆర్టికల్స్‌ రాయడంలో తానే ప్రథముణ్ణి అని చెప్పుకునే ఓ వ్యక్తి ఈ ఆర్టికల్‌ రాశారు. ఆయనకీ , ఆ పత్రికకీ దురుద్దేశాలు అంటగట్టలేం గానీ – అలాంటి ఆర్టికల్‌ రాయడానికి ఇది మాత్రం ఏవిధంగానూ సందర్భం కానే కాదు.

టాలీవుడ్‌ అన్నదే ఓ వ్యభిచార కూపంలాంటిదని – అక్కడి జూనియర్‌ ఆర్టిస్టులు, అభాగినులు టీవీ ఛానెల్స్ లోకి వచ్చి వేదనతో వెల్లువెత్తుతున్నారు. ఏడుస్తూ ఘోషిస్తున్నారు. వాళ్లవన్నీ వట్టి నిందలే, వాటిలో నిజాలన్నవే లేవనీ వాదించే సినీ అభిమానులూ టాలీవుడ్ సపోర్టర్లూ కొందరు ఉండచ్చు. ఈ ఆరోపణల వెల్లువ తరవాత తెలుగు సినిమా రంగంకళ తప్పిపోవడం ఖాయం.

ఉద్దేశపూర్వకంగా రాశారని అనడం లేదుగానీ, “అంతా అబద్ధం!” అనే ఆర్టికల్‌ చదివిన వాళ్లకి మాత్రం ఓ అనుమానం కచ్చితంగా వస్తుంది. రేపో మాపో మునిగిపోబోతున్న ఈ టాలీవుడ్‌ సినీరంగంలోని కొందరు హీరోలకి, పెద్దలకి రక్షణ కల్పిస్తూ – ముందు జాగ్రత్తకోసం ఇది రాశారా అన్న అనుమానం పాఠకుడికి వచ్చి తీరుతుంది. ఎందుకంటే – రేపు ఫ్యూచర్లో ఏ సినీ ప్రముఖుడి బండారం బయటపడినా, బలి అయిన అమ్మాయిలు ఆ ప్రముఖుడి నేరాల్ని రుజువులతో సహా బయటపెట్టినా – ఆ రుజువులన్నీ కల్పితాలే, అంతా లేటెస్ట్‌ టెక్నాలజీతో తయారుచేసిన ఫేక్‌ లే! – అని వాదించేసి జనాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేయడానికి ఈ ఆర్టికల్‌ ఓ సపోర్ట్ గా ఉపయోగపడుతుంది. ఏదేమైనా – సినీ గద్దల చేతిలో దెబ్బతిన్న అభాగినులైన మన తెలుగు అమ్మాయిలు, అంత క్వాలిటీతో ఫేక్స్‌ సృష్టించగల స్థాయికి ఎదగలేదు. కాబట్టి – ఇలాంటి ఆర్టికల్స్‌ ను ఎదర పెట్టుకుని – రేపు ఏ అమ్మాయి రుజువుతో వచ్చినా అది ఫేక్‌ అంటే చెల్లదు కాక చెల్లదు.

టాలీవుడ్లో జరుగుతున్న విషయాలు చూస్తుంటే – హీరోలు, సినీ బడాబాబులు, కోఆర్టినేటర్లు – వీళ్లందరి వ్యవహారాలూ పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉంటాయని అనిపిస్తోంది ! సినీ బడాబాబుల చాటు మాటు పనుల వ్యవహారాలు ఇవీ – అంటూ ఆడవాళ్లు ముందుకి వచ్చి గోల చేస్తున్న నేపథ్యంలో రేపు పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటపడితే ఎలా? వాళ్లని రక్షించుకోవడం ఎలా? – అనే ఓ కలత సినీరంగంలో ఇప్పటికే మొదలయిందని వినికిడి. ఇలాంటి సందర్భంలో ప్రముఖ పత్రికల్లో ఇలాంటి ఆర్టికల్స్‌ రాకూడదు, రాయకూడదు. రాస్తే అది సినీ జనం సపోర్ట్ కోసమే రాశారని జనం అనుకుంటారు. జనం అంతా సినిమా రంగాన్ని అసహ్యించుకుంటున్న సమయంలో – పత్రికలన్నీ కనీసం కొంతకాలమైనా సినీ భజన కార్యక్రమాలు ఆపాల్సిన అవసరం ఉంది. వాళ్లని భుజాన వేసుకుని మోస్తున్నట్టు అనిపించే ఇలాంటి ఆర్టికల్స్‌ ప్రచురించడం మానాలి. నిజంగా ఎలాంటి దురుద్దేశం లేకపోయినా – సందర్భాన్ని బట్టి సందేహాలు బయలుదేరతాయి. రచయిత ఉద్దేశ పూర్వకంగా రాసినా, అనాలోచితంగా రాసినా – సందర్భం విషయం సరితూగనపుడు ఇలాంటి ఆర్టికల్స్‌ పత్రిక ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. ఈ విషయాన్ని వాళ్లు గుర్తించాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu