సెలబ్రిటీల్ని ముందే చంపేస్తున్న మీడియా!

SriRamaNavami

మనిషి చనిపోకుండానే తద్దినాలు శ్రాద్ధాలు పెట్టడం మన మీడియాకి మామూలైపోయింది. ఒక గొప్ప వ్యక్తి/ప్రముఖుడు/ సెలబ్రిటీ ఇంకా ఊపిరితో ఉండి, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే – వాళ్ళ చరిత్రంతా రాసి పెట్టేసుకుని, చనిపోయినట్లుగా ముందే వాక్యాలు రాసేసుకుని, తమ హృదయాలు దుఃఖంతో కుంగిపోతున్నట్లు విశేషణాలు చేర్చి, అద్భుతమైన కవిత్వం సిద్ధంగా ఉంచుకోవడం – మీడియాకి ఎప్పటినుంచో ఉన్న అలవాటే! ఐసియుల్లో ఉన్నవాళ్లు అదృష్టం కొద్దీ బతికొస్తే సరే.. చనిపోతే మాత్రం – వెంటనే మీడియా అంతా ఒకేసారి పోటీపడుతుంది. రంగంలోకి దూకి ఆ ‘ఈవెంట్‌’ని క్యాష్ చేసుకుంటుంది! టీవీల్లో టీఆర్పీ రూపంలో… వెబ్‌ సైట్లలో క్లిక్స్ రూపంలో .. యూట్యూబ్‌లో వీడియోల రూపంలో ‘శ్రమ’కి ఫలితం లభిస్తుంది.

నిన్న మొన్న కరుణానిధి బెడ్ మీద ఉన్నప్పుడు – వికీపీడియాల మీద, గూగుల్ సెర్చ్ మీద ఆధారపడి కరుణానిధి వివరాలన్నీ సంపాదించి – ఆయన చనిపోకుండానే పాడెను సిద్ధం చేసేశారు. ఇప్పుడు పాపం వారి బారిన పడిన వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి. ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉందని ఇంకా ఒక నిర్ధారణకు వచ్చేలోపే – కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌ సైట్లు గూగుల్ సెర్చింగులు మొదలుపెట్టేశాయి. ఆయన జీవితచరిత్ర రాసేయడం, పార్టీకి, దేశానికి ఆయనేం చేశాడు.. ఇవన్నీ చెప్పేస్తూ ఆయన గురించి కీర్తిస్తూ పెద్ద పెద్ద విశేషణాలతో కవితలు రాసేయడం మొదలైపోయింది.

నిజమే! వాజ్‌ పేయి లాంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఈ లోకం నుంచి నిష్క్రమిస్తే – ఆయన వివరాల్ని జనానికి ఇవ్వడమన్నది మీడియా బాధ్యతే. కానీ ఇక్కడ పూర్తిగా మానవత్వ విలువలు లోపిస్తున్నాయి. ప్రింట్‌ మీడియా – న్యూస్‌ పేపర్లు మాత్రమే ఉండే కాలంలో – మనిషి చనిపోయిన మరునాడో త్వరలోనో వివరాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మీడియాలోనే పోటీ తత్వం పెరిగిపోయింది. ఈ పోటీ వల్ల సమాచారాన్ని పొందడంలో జనానికి లాభం కలుగుతోందేమో గానీ – జర్నలిస్తుల్లో ప్రొఫెషనలిజం పేరిట మానవత్వం నశించిపోతోందని చెప్పాలి.

ప్రతి విషయాన్నీ ప్రజలకు చేరవేసే జర్నలిస్ట్‌ కావచ్చు, ప్రజల ప్రాణాలు రక్షించగల డాక్టర్‌ కావచ్చు – వాళ్లు ఎంత ప్రొఫెషనల్‌ అయినా – ఒక వ్యక్తి చావుని తమ వృత్తిలో కేవలం ఒక ఈవెంట్‌ గా చూడకూడదు. ప్రొఫెషనల్‌ గా తప్ప మనిషిగా స్పందించలేని దుస్థితికి చేరుకోకూడదు. పోటాపోటీగా సమాచారం అందించే కంగారులో నైతికతకి తిలోదకాలివ్వకూడదు. చనిపోకుండానే సెలబ్రిటీల్ని అక్షరాలతో ‘ముందస్తు హత్యలు’ చేసే జర్నలిస్టులు – తమలో మానవత్వం నశించిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu