సీబీఐ లో గొడవ చంద్రబాబు అదృష్టమా?

F2 Movie

సీబీఐలో గొడవ… ఒకటే వార్త. కానీ మీడియాలో దానికి భిన్నభిన్న కథనాలు. సీబీఐ డీఎస్పీ అరెస్ట్‌ కావడం అనే చిన్న వార్తగా ఒక పత్రిక ఇస్తే – సీబీఐ విశ్వసనీయతే పూర్తిగా పోయి మొత్తం నాశనమైపోయిందన్న రీతిలో కొన్ని పత్రికలు గోల చేశాయి. ఈ తేడా వెనక ఏదైనా మతలబు ఉందా?
తనపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ, దర్యాప్తు సంస్థలు ఆ ఆరోపణల్ని నిగ్గుతేల్చే ప్రతిసారీ – ఏదో ఒక సాంకేతికతని ఆలంబనగా చేసుకుని చంద్రబాబు తప్పించుకుంటూ పోతుంటారని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తూ ఉంటారు. చంద్రబాబు కూడా ఎప్పుడూ వాటిని లెక్క చేయకుండా, ఎలాంటి ప్రతిస్పందనా ఇవ్వకుండా, ఎప్పుడూ అసలు వాటి ఊసే ఎత్తకుండా లౌక్యంగా ముందుకి సాగిపోతుంటారు. చంద్రబాబు ఏదైనా కేసులో ఇరుక్కున్నప్పుడల్లా ఆయన మీద సీబీఐ దర్యాప్తు వేయండి వేయండి అంటూ ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే సీబీఐ లో తాజాగా జరిగిన కొన్ని అవాంఛనీయ పరిణామాలు చంద్రబాబుకి శాశ్వతంగా ఉపయోగపడబోతున్నాయా? – అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయింది.

అటు సీబీఐ – ఇటు సీబీఎన్‌

దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకీ, డైరెక్టర్‌ అలోక్ వర్మ కి మధ్య జరిగిన గొడవ లో భాగంగా – సీబీఐ తనను తానే దర్యాప్తు చేసుకోవాల్సిన స్థితిలో పడింది. ఈ తాజా విపరిణామాల్ని ఆధారంగా చేసుకుని కొన్ని పత్రికలు సీబీఐని చీల్చి చెండాడుతూ – ఇంకా చెప్పాలంటే మెట్లు దిగిపోయి అత్యున్నత సంస్థని ‘ఛీ’ కొడుతూ వార్తలు ప్రచురించడం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా చంద్రబాబుకి వత్తాసు పలికే మీడియా గా పేరున్న ప్రముఖ పత్రికల్లో ఈ ధోరణి కనిపించిందని అంటున్నారు. అయితే వైఎస్సార్‌ సీపీ పత్రిక మాత్రం – ‘సీబీఐ డీఎస్పీ అరెస్ట్’ అంటూ దీన్ని ఒక సింపుల్ వార్త గానే ఇవ్వడం జరిగింది. ఎందుకీ తేడా?

భ్రష్ఠుపడితే ఎవరికి లాభం?

బీజేపీనుంచీ, మోదీ నుంచీ టీడీపీ విడిపోయిన తరవాత చంద్రబాబు అవినీతి పైన కేసులు ప్రారంభం కావచ్చునన్న అంచనాలు ఇప్పుడు సర్వే సర్వత్రా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబును కాపాడుకునేందుకు మీడియాలో ఒక వర్గం తీవ్రంగా కృషిచేస్తోందన్నది జనాభిప్రాయం. సీబీఐలో తాజాగా జరిగిన అవాంఛనీయ పరిణామాలు – చంద్రబాబుకు కలిసి వచ్చే అవకాశం ఉందని ఈ మీడియా గమనించిందనీ, అందుకే – సీబీఐ సంస్థలోని ప్రస్తుత సున్నితమైన పరిస్థితిని సాకుగా చేసుకుని – “అసలు సీబీఐ అన్న దానికి విలువే లేదు” అనే రీతిలో జనాభిప్రాయం పెంపొందించేందుకు ఇవి కంకణం కట్టుకున్నాయనీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవే నిజమైతే – ఈ మీడియాలో ఇక వరసగా – సీబీఐ సంస్థని – పరిమితికి మించి చీల్చి చెండాడే కథనాలు ప్రారంభం అవుతాయి. నిజంగానే రేపు చంద్రబాబుపైన ఏదైనా ఒక సీబీఐ దర్యాప్తు కనక వస్తే – దాన్ని ఎదుర్కోవడానికి ముందస్తు జాగ్రత్త లో భాగంగానే – ఈ సీబీఐ విశ్వసనీయత దెబ్బతీసే కథనాలు ప్రారంభమయ్యాయి అన్నది పరిశీలకుల అంచనా. నిజమే! సీబీఐ అనే సంస్థ విశ్వసనీయత గురించి పూర్తిగా జనంలో చెడ్డ అభిప్రాయం ఏర్పడి, ఆ సంస్థ భ్రష్ఠు పట్టిపోతే – దాన్నుంచి ఎవరైనా సులువుగా తప్పించుకోగలరు.

కాపాడుకోవాల్సింది ఎవరిని?

సీబీఐ మాత్రమే కాదు, ఏ సంస్థలో అయినా ఎంతో కొంత శాతం అవినీతి ఉండే అవకాశం ఉండనే ఉంటుంది. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని అసలు సంస్థ తాలూకు మూలాలు దెబ్బ తీయాలనుకోవడం సరికాదు. గూఢచర్య సంస్థ ‘రా’ లోనూ లంచగొండులున్నారంటూ దాని విశ్వసనీయతని కూడా దెబ్బ తీస్తూ కథనాలు వచ్చాయి. నిజమే. ఎంత గొప్ప సంస్థయినా తప్పు ఉన్నప్పుడు బహిర్గతం చేయాల్సిందే! వార్తలు రాయాల్సిందే! నిజాల్ని ప్రజలకి తెలియజేయాల్సిందే! కానీ లోపాల్ని సరిచేసి తిరిగి ఆ వ్యవస్థ పటిష్ఠమయ్యేలా చూడాలి గానీ – మనవాళ్లూ తనవాళ్లూ అనుకున్నవాళ్లని రక్షించుకోవాలన్న తాపత్రయంతో – ఆ సంస్థలకే శాశ్వతంగా మసిపూసేయాలనుకోవడం తీవ్రమైన దోషం. ఈ రోజు మన అవసరం కోసం అంత గొప్ప సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తే – రేపు ఎందరో నేరస్తులు ఆ సందులోంచి తప్పించుకుపోతారు. అది భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికే ప్రమాదం తేవచ్చు. దీనిని మీడియా దృష్టిలో పెట్టుకోవాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu