సినిమా కోసం పెళ్ళి మానేసిన డైరెక్టర్‌!

SriRamaNavami

బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ ఏళ్లతరబడి పెళ్లిని వాయిదా వేసేశాడని మనకి తెలుసు. ఇప్పుడు సెలక్షన్‌ కుదరక వాయిదాలు వేస్తున్నాడనుకోండి. అది వేరే సంగతి. అయితే ఒక సినిమా తీయడం కోసం పెళ్లి మానేసిన డైరెక్టర్‌ కూడా ఉన్నాడు తెలుసా? అవునండీ. నిజం. కాళి రంగసామి అనే తమిళ డైరెక్టర్‌ కేవలం తన సినిమా కోసమే పెళ్లి చేసుకోవడం మానేశాడు!

తమిళంలో ‘ఒరు కుప్పై కదై’ పేరిట ఆయన తీసిన సినిమా విమర్శకుల్ని నోరెళ్ళ బెట్టేలా చేసింది. ఈ సినిమా దర్శకుడు కాళి రంగసామికి అదే మొదటి చిత్రం. శ్రీలంకలో పుట్టిన రంగసామి పూర్వీకులది తమిళనాడే. కోయంబత్తూరులో బీఎస్సీ చదువుతూ మధ్యలోనే ఆపేసి సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్ళే రైలెక్కాడు. సినిమా అవకాశాలు ఎలా పొందాలో తెలియక నానా తిప్పలు పడి చివరికి దర్శకుడు ఎం ఆర్ భారతి దగ్గరకు చేరాడు. తర్వాత చేరన్, ఎళిల్ వంటి ప్రముఖ తమిళదర్శకుల వద్ద పనిచేశాడు. తర్వాత దర్శకుడు అస్లాం సినిమాకు సహాయకునిగానూ పనిచేశాడు. తర్వాత రంగసామిని దర్శకుడిగా చూడాలని ఈయనకు అవకాశాలిప్పించడానికి పాపం చాలామంది నిర్మాతలను అస్లాం సంప్రదించేవారట. చివరికి అస్లాం నిర్మాతగా మారి రంగసామిని తన సినిమాకు దర్శకుడిగా చేశారు. అయితే ఈ మొదటి సినిమాకు డబ్బు కోసం అస్లాం కష్టపడుతుంటే, రంగసామి స్నేహితులు రామదాస్, అరవిందన్ రంగంలోకి దిగి ధన సహాయం చేసి సహ నిర్మాతలయ్యారు. వీళ్ళందరి కలయిక వల్లే ‘ఒక కుప్ప కథ’ తమిళ తెరకెక్కింది. కానీ ఈ సినిమా అంత తేలిగ్గా రిలీజ్ కాలేదు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనుమడు ఉదయనిధి స్టాలిన్ ఆ సినిమా విడుదలకు సాయపడ్డారట. తన సంస్థ రెడ్ జెయింట్ ద్వారా ఈ సినిమాను బయటకు తీసుకొచ్చారు. కథ మూలం ఏమిటంటే, ఒక భార్య తన భర్తను వదిలేసి, తన బిడ్డతో కలసి మరో వ్యక్తికి దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇందులో అమాయకుడైన బాధిత భర్త పాత్రలో డాన్స్ మాస్టర్ దినేష్‌ని పెట్టుకున్నారు. దినేష్ మాస్టర్ హీరో అనగానే చాలామంది హీరోయిన్లు ఈ సినిమాలో నటించడానికి వచ్చినప్పటికీ, హీరోయిన్ క్యారెక్టర్ తీరు నచ్చక వెనక్కి తగ్గారు. చివరికి ఈ పాత్రలో మనీష్ నటించింది.

సినిమా కోసం పెళ్ళి చేసుకోలేదట కదా అని ఎవరైనా అడిగితే – రంగసామి ఇలా చెబుతాడు “అవును. ‘ఒరు కుప్పై కదై’ సినిమా పూర్తయిన తరువాతే పెళ్ళి చేసుకోవాలని శపథం చేశాను. ఎందుకంటే, మన ఇండస్ట్రీలో సహాయ దర్శకుడు మూడు పూటలా అన్నం తినే రోజులు కావివి. అలాంటప్పుడు పెళ్ళి చేసుకుని కుటుంబాన్ని కూడా పస్తులుంచడం పాపం కాదా? ఇంతకాలానికి నేను దర్శకుడిని అయ్యాను కానీ… నా వయసు చూస్తే నలభై ఎనిమిది. ఇప్పటికీ ఆర్ధికంగా స్థిరపడలేదు. ఎలా పెళ్లి చేసుకోను? అయితే మా ఇంట్లోవాళ్ళు నా కోసం అమ్మాయిని వెదుకుతూనే ఉన్నారనుకోండి. ఎలా జరిగితే అలా జరగనివ్వండి. అంతా పైవాడి దయ! ” అంటాడీ డైరెక్టర్‌.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu